వారి ఎంట్రీతో ఆ ముగ్గురూ ఔట్, భారత తుది జట్టుపై గవాస్కర్
ఆస్ట్రేలియా టూర్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు రెడీ అవుతోంది. పెర్త్ టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ అదే జోష్ లో పింక్ బాల్ సవాల్ కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి.
ఆస్ట్రేలియా టూర్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు రెడీ అవుతోంది. పెర్త్ టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ అదే జోష్ లో పింక్ బాల్ సవాల్ కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి. రోహిత్ శర్మ, గిల్ ఎంట్రీతో తుది జట్టు ఎంపిక క్లిష్టంగానే మారినప్పటకీ… డే నైట్ మ్యాచ్ కావడంతో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు భారత్ ఫైనల్ ఎలెవన్ పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో మూడు మార్పులు జరుగుతాయని గవాస్కర్ పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో దూరమైన రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ తిరిగి రెండో టెస్టుకు అందుబాటులోకి రావడంతో ప్లేయింగ్ 11లో మార్పులు ఉండనున్నాయని తెలిపాడు. దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌ల ప్లేసులను
రోహిత్ , గిల్ భర్తీ చేస్తారని చెప్పాడు.
పెర్త్ టెస్టులో ఆడిన ఏకైక భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశాలున్నాయని తెలిపాడు. సుందర్ స్థానంలో రవీంద్ర జడేజా తుదిజట్టులోకి వస్తాడని చెప్పాడు.ఈ మూడు మార్పులు చేస్తే.. జట్టు సమతూకంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయని గవాస్కర్ అంచనా వేశాడు. యశస్వి జైశ్వాల్‌తో పాటు రోహిత్ శర్మ ఓపెనర్‌గా వస్తాడని.. ఆ తర్వాతి స్థానంలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలు ఆడతారన్నాడు.పెర్త్ టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉందన్నాడు.
రోహిత్ లేకపోవడంతో తొలి టెస్టులో జైశ్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి ఇన్నింగ్స్ లో వీరు నిరాశపరిచినా… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టారు. జైశ్వాల్ సెంచరీతో చెలరేగితే.. రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు పడిక్కల్ , కోహ్లీ కూడా రాణించారు. కానీ రెండో టెస్టుకు పడిక్కల్ బెంచ్ కే పరిమితం కాక తప్పదు. ఇదిలా ఉంటే పింక్ బాల్ టెస్ట్ కావడంతో మరోసారి బ్యాటర్లే కీలకం కానున్నారు. గత టూర్ లో ఇదే మ్యాచ్ లో టీమిండియా కేవలం 36 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయం పాలైంది. ఈ సారి ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ తుది జట్టు ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా మొదలవుతుంది.