World Happiness Report: వరల్డ్ హ్యాపీనెస్ డే.. సంతోషంలో మన స్థానమెక్కడ..? ఇంత దారుణమా..?
ఈ లిస్టులో ఎప్పటిలాగే నార్డిక్ దేశాలు అగ్రభాగంలో నిలిచాయి. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఈ జాబితా రూపొందించారు. ఇక.. ఈ జాబితాలో భారత్ చాలా వెనుకబడి ఉండటం విశేషం.

World Happiness Repor: ప్రపంచంలోని సంతోషకర దేశాల జాబితా వెల్లడైంది. వరల్డ్ హ్యాపీనెస్ డే (మార్చి 20) సందర్భంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టును యూఎన్ ఆధారిత సంస్థ విడుదల చేసింది. సంతోష సూచీలో వివిధ దేశాల ర్యాంకింగ్‌లను వెల్లడించింది. దీని ప్రకారం.. గతంలోలాగే ఫిన్లాండ్ మరోసారి అగ్రభాగాన నిలిచింది. అంటే.. అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ చోటు దక్కించుకుంది. వరుసగా ఏడుసార్లు ఫిన్లాండ్ ఈ జాబితాలో టాప్‌లో నిలవడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్ రెండో స్థానంలో, ఐస్‌ల్యాండ్ మూడో స్థానంలో నిలిచాయి.
Radisson Drugs Case: రాడిసన్ కేసులో రహమాన్ అరెస్ట్.. వీడు మామూలోడు కాదు..
ఈ లిస్టులో ఎప్పటిలాగే నార్డిక్ దేశాలు అగ్రభాగంలో నిలిచాయి. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఈ జాబితా రూపొందించారు. ఇక.. ఈ జాబితాలో భారత్ చాలా వెనుకబడి ఉండటం విశేషం. సంతోషంగా జీవించే 143 దేశాల జాబితాలో ఇండియా 126వ స్థానంలో నిలిచింది. పొరుగు దేశాలైన చైనా (60), నేపాల్ (93), పాకిస్థాన్ (108), మయన్మార్(118) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగు స్థానం దక్కించుకుంది అఫ్గానిస్థాన్. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. అగ్ర దేశాలైన అమెరికా, జర్మనీ మొదటిసారిగా ఈ లిస్టులో టాప్ 20 నుంచి కిందకు దిగజారాయి. ఈ దేశాలు టాప్-20లో చోటు కోల్పోవడం దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. కోస్టారికా (12), కువైట్ (13) తొలిసారి టాప్-20లో చోటు దక్కించుకున్నాయి. టాప్-10లో అగ్రదేశాలేవీ లేవు.
అలాగే టాప్-10లో నిలిచిన వాటిలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మినహా మిగిలిన దేశాలన్నీ 1.5 కోట్ల కంటే తక్కువ జనాభా కలిగి ఉన్నవే. టాప్-20లో కెనడా, యూకే మాత్రమే మూడు కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు. అంటే తక్కువ జనాభా ఉన్న దేశాల్లోని ప్రజలే ఎక్కువ సంతోషంతో జీవిస్తున్నారని ఈ సర్వే ద్వారా తేలింది. సంతోష సూచీలో ఈసారి సెర్బియా, బల్గేరియా, లాత్వియా వంటి దేశాలు మెరుగుపడ్డాయి. అఫ్గానిస్థాన్, లెబనాన్, జోర్డాన్ ప్రజలు సంతోషాన్ని గణనీయంగా కోల్పోయారు. ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉండటానికి అక్కడి ప్రజలు.. ప్రకృతితో దగ్గరగా ఉండటం, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కారణమని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ సైంటిస్ట్ జెన్నిఫర్ డీ పావోలా అన్నారు.