Taj Mahal: తాజ్‌మహల్‌ను తాకిన వరద భారీ ముప్పు పొంచి ఉందా ?
ఢిల్లీని వరదలు వెంటాడుతున్నాయ్. యమునా నది మహోగ్రరూపం.. హస్తినవాసులకు నిద్రలేకుండా చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో ఢిల్లీ చిగురుటాకులా వణుకుతోంది.

Yamuna river flood hits Taj Mahal Archeology Department officials said that no matter how much flood there is, there will be no threat to this structure
దీంతో యమునా నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో యమునమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆగ్రాలోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్ గోడ వరకు వరద నీరు చేరుకుంది. 45ఏళ్ల తర్వాత తొలిసారి యమున ప్రవాహం.. తాజ్ మహల్ కట్టడం గోడను తాకుతూ ప్రవహిస్తోంది. తాజ్‌మహల్ ముందు ఉన్న గార్డెన్‌లోకి వరద నీరు చేరుకుంది. తాజ్ మహల్ దగ్గర యమునా నది గరిష్ఠ నీటి మట్టం 495అడుగులు కాగా.. ప్రస్తుతం వరద ప్రవాహం 497.9 అడుగులను దాటింది. చివరిసారిగా 1978నాటి వరదల సమయంలో యమునా నది ఉద్ధృతంగా ప్రవహించింది. అప్పుడు మొదటిసారి యమున ప్రవాహం తాజ్ మహల్ వెనక గోడను తాకింది. యమునా నది ఉద్ధృతి మరింత పెరిగినప్పటికీ.. తాజ్ మహల్ కు ముప్పేమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎంత ఉద్ధృతితో యమునా ప్రవహించినప్పటికీ.. తాజ్ మహల్ ప్రధాన సమాధిలోకి నీరు ప్రవేశించని విధంగా ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెప్తున్నారు.
యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ కట్టడానికి.. వరదల వల్ల ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని అంటున్నారు. 1978నాటి వరదల సమయంలో యమునా నది గరిష్ఠంగా 508 అడుగుల మేర ప్రవహించింది. అప్పుడు తాజ్ మహల్ స్మారకంలోని నేలమాళిగల్లోని 22గదుల్లోకి వరద నీరు చేరింది. ఈ ఘటన తర్వాత అధికారులు చెక్క తలుపులను తొలగించారు. ఇక అటు తాజ్ మహల్ చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయ్యాయ్. తాజ్‌గంజ్ శ్మశాన వాటిక, పోయాఘాట్ రెండూ పూర్తిగా నీట మునిగాయి. మరోవైపు పురాతన దసరా ఘాట్, ఎత్మదౌలా సమాధి, రామ్ బాగ్, మెహతాబ్ బాగ్, జోహ్రా బాగ్, కాలా గుంబాద్ వంటి ప్రాంతాలు వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఆగ్రాలో వరద పరిస్థితి దృష్టిలో పెట్టుకొని.. అధికారులు అలర్ట్‌గా ఉన్నారు. ఔట్‌పోస్టులను ఏర్పాటు చేసి జనాలను అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.