Jaiswal: వంద కొట్టిన జైస్వాల్ నివ్వెరపోయిన నేపాల్

ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌ విభాగంలో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 3, 2023 | 02:29 PMLast Updated on: Oct 03, 2023 | 2:29 PM

Yashaswi Jaiswal Played A Key Role In The Match Against Nepal

ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌ విభాగంలో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో సెమీస్‌కు చేరుకుంది. అయితే, సెంచరీతో భారత విజయంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 48 బంతుల్లోనే శతకం పూర్తిచేశాడు. దీంతో తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేయడంతోపాటు అరుదైన ఘనత సాధించాడు. మరో యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ పేరిట ఉన్న రికార్డును యశస్వి అధిగమించాడు. న్యూజిలాండ్‌పై ఇదే ఏడాది జనవరిలో గిల్ సెంచరీ కొట్టాడు. అప్పుడు అతడి వయసు 23 ఏళ్ల 146 రోజులు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ వయసు 21 ఏళ్ల 279 రోజులు కావడం విశేషం.

దీంతో భారత్‌ తరఫున పిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతయ క్రికెట్‌లో భారత్‌ నుంచి టీ20ల్లో సెంచరీ సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా నిలిచాడు. భారత్‌ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్ కావడం విశేషం. యశస్వి 48 బంతుల్లో సెంచరీ కొట్టగా.. రోహిత్ శర్మ 35 బంతుల్లోనే వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔట్ అయిన జైస్వాల్, నేపాల్ ముందు 202 పరుగుల భారీ టార్గెట్ ఉంచాడనికి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నేపాల్‌పై రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే ఈ విజయంతో భారత్ సెమీఫైనల్స్‌కి చేరుకోగా.. నేపాల్ ఇంటి బాట పట్టింది.