YCP vs BJP: ముసుగు తీసేసిన బీజేపీ! కలిసిపోయిన కాషాయం పసుపు! ఇక వైసీపీతో ప్రత్యక్ష యుద్ధమే!
నిన్నమొన్నటివరకు కలిసే ఉన్నారు.. కాదు కాదు.. కలిసే ఉన్నట్టు నటించారు.! పరస్పర అవసరాల కోసం వైసీపీ, కేంద్రంలోని బీజేపీ స్నేహంతోనే మెలిగాయి.. ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ అసలు రంగు బయటపడింది.
జగన్‌పై సీబీఐ కేసులు భూమి ఉన్నంత వరకు కొనసాగుతూ ఉండవచ్చు..అయినా ఆయన అరెస్ట్ అవ్వరు. పార్లమెంట్‌లో బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు జగన్ ఎంపీలు తమ పార్టీ బతికున్నంత కాలం మద్దతు చెబుతూనే ఉండవచ్చు..! ఈ రెండు పార్టీలది ఓ మూట్యువల్ అండర్‌స్టాండింగ్. బయటకు బహిరంగంగా మద్దతు ఇచ్చుకోరు..కానీ ఎవరికీ కావాల్సిన పనులు వాళ్లు చేయించుకుంటారు.. ఇదంతా ఈ నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్న తంతు..అయితే ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరో 9నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా రానున్నాయి. దీంతో బీజేపీ తన అసలు రంగును బయటకు తీసింది. ఈ పరిణామాలను ముందే ఊహించిన వైసీపీ రివర్స్ అటాక్ కూడా మొదలుపెట్టింది.
బీజేపీ ఎప్పటికైనా టీడీపీతో కలిసి పోటి చేసే పార్టీనే అని జగన్‌కు తెలుసు. కమలం పార్టీపై విమర్శలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తెలుసు..అయితే అది ఇంత త్వరగా వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎన్నికలకు 9నెలల ముందే బీజేపీ తన ముసుగును తీసేసింది. చంద్రబాబుతో కలిసే జగన్‌పై తాడోపెడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. అందుకే కేంద్ర పెద్దలు ఏపీ బాట పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా ఏపీకి వచ్చి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసి వెళ్లిపోయారు. రేపో మాపో మోదీ కూడా వస్తారు. ఆయన కూడా ఏం చేస్తారు.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే చదువుతారు.
నిన్నమొన్నటివరకు వైసీపీపై పల్లెత్తు మాట అనని కేంద్ర పెద్దలు ఇప్పుడు గేర్ రివర్స్ చేశారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్టు జగన్ చెబుతున్నారంటూ అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు అని.. మోదీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫొటోలు వేసుకుంటున్నారన్నారు. నిజానికి ఇదంతా యల్లో ఆర్మీ ప్రచారాలు. చంద్రబాబు నేరుగా ఈ వ్యాఖ్యలు చేయకపోయినా తమ అనుచరులతో ఈ తరహా విమర్శలే చేయిస్తుంటారు. అమిత్ షా కూడా అదే స్క్రిప్ట్ చదివారు. అటు వైసీపీకి అసలు మేటర్ అర్థమైపోయింది. బీజేపీ వాడేసుకుంటుందని జగన్‌కు ముందే తెలుసు కానీ.. ఇంత త్వరగా అని ఊహించలేదు..అందుకే జేపీ నడ్డా వచ్చి వెళ్లిన తర్వాత ఆయన చేసిన ఆరోపణలను పెద్దగా పట్టించుకోని ఫ్యాన్ పార్టీ అమిత్ షా విషయంలో మాత్రం సీరియస్‌గానే రియాక్ట్ అయ్యింది.
టీడీపీ మాటలనే బీజేపీ చెబుతోందని.. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనే కడుపుమంటతోనే అమిత్ షా ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రానికి ముష్టి వేసినట్లు నిధులు వేస్తున్నారని.. ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంట్‌పై ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన వారు ఒక విజన్‌తో మాట్లాడాలంటూ మండిపడ్డారు బొత్స.
ఇక ప్రత్యక్ష యుద్ధమే!
టీడీపీ-జనసేన-బీజేపీ కలవడం దాదాపు ఖాయమైపోయినట్టే లెక్క! మొన్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ పెద్దగా మాట్లాడలేదని.. పసుపుతో కాషాయం ఇకపై కలిసే ఛాన్స్ లేదు అని వైసీపీ అనూకుల వాదులు ప్రచారం చేశారు. కానీ ఇదంతా స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది. కలిసి వెళ్లిన వెంటనే హాడావుడి చేయకుండా కామ్‌గా ఉండాలని రెండుపార్టీలు డిసైడ్ అయ్యినట్టు సమాచారం. వైసీపీని టైమ్ చూసి దెబ్బ కొట్టాలని.. జగన్‌కు ఝలక్ ఇవ్వడానికి సస్పెన్స్ మెయింటైన్ చేయాల్సిందిగా రెండు పార్టీల పెద్దలు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే బీజేపీ స్లో స్లోగా వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. కానీ జగన్‌కి ఇప్పటికే అసలు విషయం అర్థమైపోయింది. అందుకే రివర్స్ అటాక్ మొదలుపెట్టేసింది. ఇకపై కేంద్రం వర్సెస్ వైసీపీ యుద్ధం షురూ కానుంది.