నువ్వు ఛాంపియన్ వి, అశ్విన్ పై దిగ్గజాల ప్రశంసలు
భారత క్రికెట్ లో గొప్ప ఆటగాడి శకం ముగిసింది. వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్‌లో మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న కోహ్లీని హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు.
భారత క్రికెట్ లో గొప్ప ఆటగాడి శకం ముగిసింది. వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్రిస్బేన్‌లో మూడో టెస్ట్ ముగిసిన తర్వాత అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పక్కనే ఉన్న కోహ్లీని హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ సిరీస్ లో అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్ తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు. అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం అటు సహచరులకు, ఇటు మాజీలకు , ఫ్యాన్స్ కూ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ లో క్రమంగా అవకాశాలు తగ్గుతుండడంతోనే యాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయంతో పలువురు మాజీ ఆటగాళ్ళు అతనికి విషెస్ చెబుతూ ట్వీట్లు చేశారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అశ్విన్ రిటైర్మెంట్ పై ట్వీట్ చేశాడు. అశ్విన్ ను గొప్ప ఛాంపియన్ గా పేర్కొన్నాడు. టెస్టుల్లో త్వరగా 250, 300, 350, 400, 450 వికెట్లు పడగొట్టాడంటూ యాష్ కు సంబంధించిన గణాంకాలను సచిన్ గుర్తు చేసాడు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత స్పిన్ విభాగాన్ని అద్భుతంగా శాసించాడంటూ రాసుకొచ్చాడు. అటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అశ్విన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఒక యువ బౌలర్ నుంచి ఆధునిక క్రికెట్‌లో లెజెండ్‌గా ఎదగడం గొప్ప విషయమన్నాడు. నిన్ను మిస్ అవుతారు బ్రదర్ అంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే ధన్యవాదాలు అశ్విన్. మీ ఆట గొప్పగా ఉంటుందంటూ బీసీసీఐ ట్వీచ్ చేసింది. టీమిండియాకు దొరికిన గొప్ప ఆల్ రౌండర్ మీరు అంటూ ప్రశంసించింది.
మరోవైపు అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని డ్రెస్సింగ్ రూమ్ లోనే తెలుసుకున్న విరాట్ కోహ్లీ ఎమోషనల్ గా హగ్ చేసుకుని విషెస్ చెప్పాడు. తర్వాత ఎక్స్ వేదికగా అశ్విన్ కు వీడ్కోలు పలికాడు. 14 ఏళ్ళుగా మీతో ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాననీ,
మీ రిటైర్మెంట్ నిర్ణయం భావోద్వేగానికి గురి చేసిందంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. మీతో కలిసి ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానంటూ కోహ్లీ రాసుకొచ్చాడు. భారత క్రికెట్ లో ఓ లెజెండ్ గా అశ్విన్ ఎప్పటికీ గుర్తుండిపోతారంటూ విరాట్ వ్యాఖ్యానించాడు. కాగా అశ్విన్ రిటైర్మెంట్ పై ట్వీట్ చేసిన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా విరాట్ కోహ్లీ, అశ్విన్ కలిసి ఉన్న వీడియోను షేర్ చేసింది. ఇప్పటివరకు భారత్ తరపున 106 టెస్టుల్లో537 వికెట్లు తీసి భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా అశ్విన్ ఐపీఎల్ లో కొనసాగనున్నాడు.