Joe Biden: బైడెన్ హత్యకు తెలుగు యువకుడి ప్రయత్నం వైట్‌హౌస్‌పై ట్రక్కు దాడిలో సంచలన నిజాలు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హత్యకు ప్రయత్నించాడో తెలుగు యువకుడు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
అమెరికా అధ్యక్షుడి నివాస భవనం వైట్‌హౌస్ పరిసరాల్లోకి 19 ఏళ్ల యువకుడు ట్రక్కుతో దూసుకువచ్చాడు. వెంటనే అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తాను అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌ను హతమార్చేందుకే వచ్చానని చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడు తెలుగు సంతతికి చెందిన వ్యక్తి. సాయివర్షిత్ అనే యువకుడు.. భారీ ట్రక్కులో వచ్చి, వైట్‌హౌస్ ఉత్తర భాగంలో భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
ఐతే వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సాయివర్షిత్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తాను అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌ను లక్ష్యంగా చేసుకొనే దాడికి పాల్పడ్డానంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. నిందితుడిపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేశారు. దాడికి పాల్పడిన సమయంలో ట్రక్కుకు నాజీ జెండా కట్టి ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయ్. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో ఉంటున్న సాయివర్షిత్… వాషింగ్టన్ డీసీకి చేరుకొని, అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకొన్నాడు. ఆ టక్కుతోనే దూసుకొచ్చి దాడికి యత్నించాడు.
దీనికోసం గత ఆరు నెలల నుంచి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సాయివర్షిత్ భద్రతా దళాల విచారణలో తెలిపాడు. అతడు 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేషన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లోని ఖాతాల ద్వారా అతని వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. నాజీ విధానాలకు ఆకర్షితుడు అయి.. అమెరికా అధ్యక్షుడి మీద కోపంపెంచుకున్నాడని.. అతన్ని హత్య చేయాలని ప్లాన్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వైట్‌హౌస్ సమీపంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణం అవుతోంది.