YS JAGAN: అవినాష్ తప్పు చేయలేదన్న జగన్.. చెల్లెళ్ల ఫైర్
పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపారు. ఇలాంటి కుట్రలు చేయడానికి చెల్లెళ్లను ఎవరు పంపించారో ప్రజలకు బాగా అర్థమైంది. పసుపు చీరలు కట్టుకొని వైఎస్‌ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వారు వైఎస్ వారసులా..? నన్ను నేరుగా ఎదుర్కోలేక అంతా కలిసి ఒక్కసారి దాడి చేస్తున్నారు.
YS JAGAN: వైఎస్ వివేకా హత్య విషయంలో తన సోదరుడు అవినాష్ ఎలాంటి తప్పూ చేయలేదని, అందుకే అతడికి టిక్కెట్ ఇచ్చానని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్. గురువారం జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “వివేకా హత్య కేసులో అవినాష్ ఎలాంటి తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే ఆయనకు టికెట్ ఇచ్చా. అలాంటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలని చూడటం బాధాకరం.
చిన్నాన్నను చెప్పింది ఎవరో దేవుడికి, జిల్లా ప్రజలకు బాగా తెలుసు. హత్య జరిగిన రోజు ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడకు వెళ్లారో.. పదే పదే మీడియాలో ఆయన సంధిస్తున్న ప్రశ్నలు నిజం కాదా..? వివేకాకు రెండో భార్య సంతానం ఉన్నది నిజం కాదా..? రెండో పెళ్లి ద్వారా సంతానం ఉన్నారో లేదో సమాధానం చెప్పాలి. వివేకా హత్య నిందితులకు ఎవరు మద్దతు ఇస్తున్నారని కూడా తెలుసు. పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపారు. ఇలాంటి కుట్రలు చేయడానికి చెల్లెళ్లను ఎవరు పంపించారో ప్రజలకు బాగా అర్థమైంది. పసుపు చీరలు కట్టుకొని వైఎస్‌ఆర్ శత్రువులతో చేతులు కలిపిన వారు వైఎస్ వారసులా..? నన్ను నేరుగా ఎదుర్కోలేక అంతా కలిసి ఒక్కసారి దాడి చేస్తున్నారు. అన్యాయంగా నాడు ఎన్నికల్లో ఓడించిన వాళ్లే ఇప్పుడు కుట్రలు చేస్తున్నారు. వారిచ్చిన స్క్రిప్టులనే వీళ్లు చదువుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీ అక్రమాలను ఎదుర్కొన్నది ఈ పులివెందుల బిడ్డలే. పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం. పులివెందుల అంటే అభివృద్ధికి, నమ్మకానికి నిదర్శనం. ఇదో సక్సెస్ స్టోరీ. ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారాన్ని కట్టబెట్టింది కుటుంబానికి, బంధువులకు దోచి పెట్టడానికి కాదు. ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది కుటుంబ సభ్యుల్ని కోటీశ్వరుల్ని చేయడానికి కాదు. పేదలకు మేలు చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు.
పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ అవాక్కులు పేలుతున్నారు. అలాంటి సంస్కృతి మాకు లేదు. మంచి చేయడం.. మంచికి అండగా నిలబడటమే తెలుసు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన అభివృద్ధిని మరో రెండు అడుగులు ముందుకే తీసుకెళ్లాం. అలాంటి పులివెందులలో వైఎస్, జగన్ ముద్రలేకుండా చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో భాగంగానే కొందురు వైఎస్ వారసులమని ముందుకొస్తున్నారు. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాల్సింది, వైఎస్‌కు నిజమైన వారసులెవరో చెప్పాల్సింది ప్రజలే. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరో.. ఆయనపై కేసులు పెట్టిందెవరో.. విగ్రహాలు తొలగిస్తామన్నదెవరో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారు. అలాంటి వారితో చేతులు కలిపిన వ్యక్తులు వైఎస్ వారసులు ఎలా అవుతారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరు ఓటు వేస్తారు..?” అని జగన్ వ్యాఖ్యానించారు.