అమిత్ షా డ్రామాలు వద్దు; షర్మిల వార్నింగ్

అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ ‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 03:12 PMLast Updated on: Dec 20, 2024 | 3:12 PM

Ys Sharmila Fire On Bjp And Nda

అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ ‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. గురువారం పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని బీజేపీ, ఆరెస్సెస్‌ ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయన్నారు. అందుకే అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయని ఆమె మండిపడ్డారు. అమిత్ షాను రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశామన్నారు.

కానీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశారని పార్లమెంట్ లోపలికి వెళ్తున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ గారిని బీజేపీ ఎంపీలు అడ్డుకుని పక్కకు తోయడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ తోపులాటలో మల్లికార్జున ఖర్గే గారు కిందపడిపోయారన్నారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఆవరణలోనే బీజేపీ ఎంపీలు రౌడీల్లా కర్రలు చేతబట్టి సభలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ఎంపీలను అడ్డుకోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. వారిలో వారే కొట్టుకుని రాహుల్ గాంధీ గారిపై నింద మోపుతున్నారని విమర్శించారు.

వారి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోందన్నారు. అంబేద్కర్‌పై అమిత్ ‌షా చేసిన వ్యాఖ్యల వీడియోను డిలీట్‌ చేయాలంటూ ‘ఎక్స్‌’కు కేంద్రం నోటీసులు ఇవ్వడం చూస్తుంటే వారు తప్పు చేశారని అర్థమవుతోందన్నారు. అంబేద్కర్‌పై బీజేపీ అసలు ఆలోచనలు.. అమిత్‌షా వ్యాఖ్యల రూపంలో బయటపడ్డాయని దేశానికి రాజ్యాంగాన్ని, కోట్లాది మంది దళితులు, అణగారినవర్గాల ప్రజల జీవితాలను మార్చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ను బీజేపీ అనుక్షణం అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కాషాయం మూకపై పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.