Sharmila: పాలేరు కాదు సికింద్రాబాద్ నుంచి పోటీ.. షర్మిలను కాంగ్రెస్ ఒప్పించిందా ?

తెలంగాణను ఉద్దరించేందుకు , తెలంగాణలోనూ రాజన్న రాజ్యాన్ని స్థాపించేందుకు అలుపెరగని పాదయాత్ర చేసిన షర్మిల.. మూడేళ్లు కూడా నిండని తన పార్టీని నూటపాతికేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. ఇక గుసగుసలకు , ఊహాజనిత కథనాలకు ఆస్కారమే లేదు. షర్మిల బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లడం, కాంగ్రెస్ పెద్దలను కలవడం, పార్టీ విలీనంపై ప్రాథమికంగా చర్చలు జరపడం పూర్తయ్యాయి. ఇక మిగిలిందల్లా జెండా మార్చేయడమే. ఈ నెల 18 లేదా నెలాఖరు లోపు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 12, 2023 | 09:47 AMLast Updated on: Aug 12, 2023 | 9:47 AM

Ys Sharmila Is In Talks To Contest As Congress Mla From Secunderabad

తెలంగాణను ఉద్దరించేందుకు , తెలంగాణలోనూ రాజన్న రాజ్యాన్ని స్థాపించేందుకు అలుపెరగని పాదయాత్ర చేసిన షర్మిల.. మూడేళ్లు కూడా నిండని తన పార్టీని నూటపాతికేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. ఇక గుసగుసలకు , ఊహాజనిత కథనాలకు ఆస్కారమే లేదు. షర్మిల బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లడం, కాంగ్రెస్ పెద్దలను కలవడం, పార్టీ విలీనంపై ప్రాథమికంగా చర్చలు జరపడం పూర్తయ్యాయి. ఇక మిగిలిందల్లా జెండా మార్చేయడమే. ఈ నెల 18 లేదా నెలాఖరు లోపు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయం.

ఏపీలో ప్రచారం..తెలంగాణ నుంచి పోటీ

తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు తనకు ఉన్నాయని.. యావత్ తెలంగాణ సమాజం తన వెంటే ఉందని నిన్న మొన్నటి వరకు వివిధ సందర్భాల్లో మాట్లాడిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో భాగంకాబోతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..షర్మిలను ఏపీ నేతగా మాత్రమే చూస్తున్నా.. ఆమెను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ వ్యతిరేక వర్గం బాగానే పనిచేసినట్టు కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే బెంగళూరు నుంచి డీకే శివకుమార్ నడిపిస్తే..ఆమెను కాంగ్రెస్ నేతగా మార్చే బాధ్యతను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షర్మిల కృతజ్ఞతలు కూడా చెప్పారు. సరే ఇక పార్టీ విలీనం లాంఛనంగా మారిన సందర్భంలో అసలు కాంగ్రెస్ నేతగా షర్మిల ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపిన షర్మిల.. ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనేందుకు అంగీకరించినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. తాను తెలంగాణ నుంచి మాత్రమే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని ఢిల్లీ పెద్దలకు స్పష్టం చేసిన షర్మిల.. ఏపీలో మాత్రం ప్రచారానికి సై అన్నారంట.

పాలేరు కోసం షర్మిల పట్టు.. సికింద్రాబాద్ ట్రై చేయమంటున్న కాంగ్రెస్

వైఎస్ఆర్ పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి షర్మిల మనసంతా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలోనే ఉంది. ఇప్పటికే అనేక సార్లు ఆమె పాలేరులో పర్యటించారు కూడా. పాలేరు నుంచే అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు షర్మిల ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయి. షర్మిలను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉండటంతో క్రిస్టియన్ ఓటు బ్యాంకును మళ్లీ యాక్టివ్ చేసేందుకు షర్మిల అయితే సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు షర్మిల చేవిలో కూడా వేశారు. అయితే పాలేరు నుంచి సికింద్రాబాద్ మారే విషయంలో షర్మిల ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఖర్కే, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీని కలవబోతున్న షర్మిల.. సికింద్రాబాద్ విషయంలో తన అభిప్రాయాన్ని వాళ్లతో పంచుకునే అవకాశముంది.

షర్మిలను టీకాంగ్రెస్ ఓన్ చేసుకుంటుందా ?

అతి చిన్న పార్టీని.. అతి పెద్ద పార్టీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత చిన్న పార్టీ నేతలు కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. ఇప్పుడు షర్మిల కూడా అలాంటి క్రాస్ రోడ్స్ లోనే ఉన్నారు. తెలంగాణ సమాజం ఇప్పటికీ ఆమెను రాజశేఖర్ రెడ్డి కుమార్తెగానే చూస్తుంది తప్ప.. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అతి పెద్ద రాజకీయ శక్తిగా చూడటం లేదు. వాస్తవానికి షర్మిలకున్న బలం, బలగం కూడా నామమాత్రమే. కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ఆర్ కుమార్తెగా తనకున్న బ్యాగ్రౌండ్ ఇమేజ్‌తో కాస్తోకూస్తో పార్టీలో కీలక నేతగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అయితే షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ స్థాయిలో అంగీకరిస్తాన్నదే ఇక్కడ ప్రశ్న. ఆమె వల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనాలు ఏంటన్నద పక్కన పెడితే.. భిన్న ధృవాలుగా చీలిపోయి ఎవరికి వాళ్లు తమకు తగ్గట్టుగా రాజకీయం నడిపే కాంగ్రెస్ పార్టీలో షర్మిల వెంట నడిచేదెవరు ?