YS Sharmila: ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన షర్మిల.. కాంగ్రెస్‌లో విలీనంపై క్లారిటీ వచ్చేనా?
వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లి తన పార్టీ విలీన ప్రక్రియపై ఒక స్పష్టత కోరనుంది.
ఉంది అంటే.. ఉంది అన్నట్లు తయారైంది షర్మిల పార్టీ పరిస్థితి. ఓ మూమెంట్ లేదు.. ఓ మ్యూజిక్ లేదు. ఎప్పుడో ఒకసారి బయటకు రావడం.. ఆందోళనలు చేయడం.. వాళ్ల మీదో వీళ్ల మీదో చేయిచేసుకోవడం.. ఇదే కామన్ అయిపోయింది వైటీపీ పరిస్థితి. వచ్చేవాళ్లు రాకపోగా.. ఉన్న ఒకరిద్దరు కూడా పార్టీ జంప్ చేస్తుండడంతో.. వేరే దారి లేక.. హస్తాన్ని నమ్ముకోవాలని ఫిక్స్ అయ్యారు షర్మిల. కాంగ్రెస్‌లో వైటీపీని విలీనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఏం జరుగుతుందో తెలియదు.. ఏం జరిగిందో అర్థం కాదు.. ఈ విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. దీంతో షర్మిల పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది.
తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు పాపం! ముందుగా వైటీపీని విలీనం చేసుకునేందుకు, కాంగ్రెస్ అగ్ర నేతలు అంగీకారం తెలిపినా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, మరికొంతమంది సీనియర్లు షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి రానివ్వొద్దని.. ఆమెను ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని అధిష్టానం దగ్గర ఒత్తిడి చేశారు. దీంతో షర్మిల పార్టీ విలీన ప్రక్రియ ఆగిపోయింది. ఇటు ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి. కాంగ్రెస్‌లోవిలీన ప్రక్రియ రోజురోజుకు ఆలస్యం అవుతుండడంతో.. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. షర్మిలలో టెన్షన్ కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు.. విలీన ప్రక్రియపై క్లారిటీ తీసుకునేందుకు షర్మిల ఢిల్లీ టూర్‌కు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
సోనియా, రాహుల్‌తో సమావేశమై.. తన రాజకీయ భవిష్యత్ గురించి చర్చించబోతున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీలోనూ షర్మిల సేవలను ఎక్కడ వినియోగించుకోవాలనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. షర్మిలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య షర్మిల ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించబోతోంది. దీంతో త్వరగా షర్మిల పార్టీని విలీనం చేసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఐతే ఆమె తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టనంటూ పట్టిన పట్టు వీడడం లేదు. దీంతో విలీన ప్రక్రియ ఆలస్యం అవుతూ వస్తోంది. మరి ఈ ఢిల్లీ టూర్‌తో అయినా సస్పెన్స్‌కు తెరపడుతుందో లేదో చూడాలి.