YS SHARMILA: ప్రధాని మోదీకి షర్మిల లేఖ.. విభజన హామీలు నెరవేర్చాలని వినతి

రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీ కోసం కేంద్రం అనేక హామీలు ఇచ్చిందని షర్మిల గుర్తు చేశారు. అయితే, 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుపై పెద్దగా దృష్టి పెట్టలేదని, రాష్ట్రం విడిపోయి పదేళ్లైనా విభజన హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని షర్మిల గుర్తు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 08:21 PMLast Updated on: Jan 30, 2024 | 8:21 PM

Ys Sharmila Write Letter To Pm Modi About Ap Issues

YS SHARMILA: ఏపీకి ప్రత్యేకహోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మంగళవారం నాడు లేఖ రాశారు. ఏపీ అభివృద్ధికి సంబంధించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలను తమ దృష్టికి తీసుకువస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీ కోసం కేంద్రం అనేక హామీలు ఇచ్చిందని షర్మిల గుర్తు చేశారు.

Gaddar Statue: ట్యాంక్‌బండ్‌పై గద్దరన్న విగ్రహం.. మరి చివరి కోరిక సంగతేంటి ?

అయితే, 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుపై పెద్దగా దృష్టి పెట్టలేదని, రాష్ట్రం విడిపోయి పదేళ్లైనా విభజన హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని షర్మిల గుర్తు చేశారు. “విభజన జరిగిన ఒక దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారు. ప్రస్తుతం ఏపీ దయనీయ స్థితిలో ఉంది. కేంద్రం నుంచి తక్షణం సహకారం అందించాల్సి ఉంది. విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారనేది వాస్తవం. విభజన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఏపీ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తానని ఆనాటి ప్రధాని చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పూర్తిగా విస్మరించింది. కేంద్రం విభజన హామీల విషయంలో ఎలా మోసం చేసిందో చెప్పడానికి ప్రత్యేకహోదా ఉదాహరణగా మిగిలింది. దీనివల్ల నేడు, AP పురోగతి, అభివృద్ధి లేకుండా పోయింది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం వల్ల ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతోంది. ప్రత్యేకహోదా అంత ప్రాధాన్యత కల పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం సరైన సహకారం అందించడం లేదు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు.

పోలవరం రాష్ట్ర ప్రజల హక్కు. ఈ రోజు ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టు జాతీయ హోదాను నీరుగార్చాయి. ఈ అంశాలను ఐదున్నర కోట్ల మంది ఏపీ ప్రజల తరపున మేం విజ్ఞప్తిని చేస్తున్నాం. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి ఈ వాగ్దానాలను నెరవేర్చాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైనా పునరాలోచించాలి. విశాఖ ఉక్కు ఆంద్రుల హక్కు” అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. షర్మిల లేఖలో మొత్తం ఎనిమిది అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను ఇస్తామని అంటున్నారు.