భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ పేరు చెప్పగానే టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డే గుర్తొస్తుంది... అలాగే లార్డ్స్ లో గంగూలీ చొక్కా విప్పి సంబరాలు చేసుకునేందుకు కారణమైన ఇన్నింగ్స్ ఆడింది కూడా యువీనే... ఇక అన్నింటికీ మించి క్యాన్సర్ బారిన పడి చావును జయించి రీఎంట్రీ ఇచ్చిన గొప్ప పోరాట యోధుడిగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అలాంటి యువరాజ్ కెరీర్ త్వరగా ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీనే కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో అతను చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. యూవీ క్యాన్సర్ నుంచి కోలుకున్నాక జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడనీ, అయితే ఫిట్‌నెస్ విషయంలో కాస్త మినహాయింపులు ఇవ్వాలని కోరినప్పటికీ అప్పుడు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఒప్పుకోలేదని ఉతప్ప చెప్పుకొచ్చాడు. జట్టులో ప్రతీ ప్లేయర్ తనలాగే పూర్తి ఫిట్ నెస్ తో ఉండాలని కోహ్లీ కోరుకునేవాడని ఊతప్ప గుర్తు చేసుకున్నాడు. ఈ విషయంలో చాలా మంది క్రికెటర్లు అలాగే ఉండేందుకు ప్రయత్నించినా... ఆరోగ్య సమస్యల దృష్ట్యా యువీ కొంచెం ఇబ్బంది పడ్డాడని ఊతప్ప చెప్పాడు. పలుసార్లు దీనిపై కోహ్లీతో చర్చించినా అతను సానుకూలంగా స్పందించలేదంటూ ఊతప్ప చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఊతప్ప మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు. భారత్ రెండు ప్రపంచకప్ లు గెలవడంలో కీలకంగా ఉన్న ప్లేయర్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు కెప్టెన్ గా ఉన్న వ్యక్తి సపోర్ట్ చేయాలన్నాడు. క్యాన్సర్ కారణంగా అతడి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయిందని అందరికీ తెలుసన్నాడు. చికిత్సలో ఎంతో నొప్పిని తట్టుకుని యువీ క్యాన్సర్ ను జయించాడన్నాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలను పాటించాలనీ...కానీ కొన్ని మినహాయింపులు ఉంటాయన్నాడు. యువరాజ్ సింగ్ మినహాయింపులకు అర్హుడనీ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ జట్టు 2007, 2011 వరల్డ్ కప్ విజయాల్లో యూవీ ఆల్ రౌండ్ ప్రతిభ ఎంతో ఉంది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ లో బ్యాట్ తో పాటు బంతితోనూ అదరగొట్టేశాడు. అయితే ఈ మెగాటోర్నీ మధ్యలోనే క్యాన్సర్ బారిన పడ్డాడు. ఆసీస్ పై క్వార్టర్ ఫైనల్లో రక్తమోడుతున్నా కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత చికిత్స తీసుకుని ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో యువీ కెరీర్ ముగింపుకు సంబంధించి ఊతప్ప చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.[embed]https://www.youtube.com/watch?v=y-T9Bspy09M[/embed]