భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. గతంలో తాను కపిల్ దేవ్ ను చంపడానికి సిద్ధపడినట్లు గుర్తుచేసుకున్నాడు. కపిల్ ఇంటికి తుపాకీ తీసుకెళ్లి బెదిరించినట్లు నాటి సంఘటన గురించి చెప్పాడు.కపిల్ దేవ్ టీమిండియా కెప్టెన్ అయ్యాక, తనను ఏ కారణం లేకుండా జట్టు నుంచి తప్పించాడని ఆరోపించాడు. దీనిపై తన భార్య కపిల్ ను ప్రశ్నించాలనుకుందనీ, అయితే తానునేను కపిల్ కు బుద్ధి చెప్పి వస్తానంటూ వెళ్ళానని నాటి సంఘటన గురించి వివరించాడు. తన తుపాకీ తీసుకుని సెక్టర్ 9లో ఉన్న కపిల్ ఇంటికి వెళ్లగా.. అతడు తన తల్లితో కలిసి బయటకు వచ్చాడని చెప్పాడు. అతడిని అప్పుడు చాలా సార్లు తిట్టాననీ గుర్తు చేసుకున్నాడు. పాయింట్ బ్లాంక్ లో నిన్ను కాల్చాలని ఉందనీ, కానీ నీ తల్లిని చూసి ఆగిపోయానంటూ కపిల్ కి చెప్పేసి తిరిగొచ్చేసిన విషయాన్ని వెల్లడించాడు. ఆ తర్వాత ఇక క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నట్టు యోగరాజ్ చెప్పాడు. 28 ఏళ్ల తర్వాత 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచాక తాను కపిల్ దేవ్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లు తెలిపాడు. కాగా మరికొందరు క్రికెటర్ల గురించి కూడా ఆయన ఈ ఇంటర్యూలో మాట్లాడాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పాడు. అయితే బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్ కలిసి తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని యోగరాజ్ ఆరోపించాడు. తాను బిషన్ సింగ్ బేడీని అస్సలు క్షమించనన్నాడు. నన్ను జట్టులోకి తీసుకోకూడదని బిషన్ సింగ్ బేడీ కుట్ర పన్నిన విషయాన్ని ఒక సెలక్టర్ అప్పట్లో చెప్పారనీ గుర్తు చేసుకున్నాడు. కాగా యోగరాజ్ సింగ్ భారత తరపున ఒక టెస్ట్ మ్యాచ్ , ఆరు వన్డేలు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 30 మ్యాచ్ లు ఆడాడు.