6 Years for 1st Class admission: 6 యేళ్ళు నిండితేనే ఒకటో తరగతి – కేంద్రం ఆదేశాలు
పిల్లలు ఇంట్లో మారం చేస్తున్నారని... ఆరేళ్ళు నిండకముందే బలవంతంగా బడికి పంపడం ఇక నుంచి కుదరదు. ఆరేళ్ళు నిండిన వారికి మాత్రమే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
పిల్లలకు మూడు నాలుగేళ్ళ రాగానే వెంటనే స్కూల్ కి పంపుతారు తల్లిదండ్రులు. అందుకే ఎల్కేజీ నుంచే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చదువులు అనీ… ఫస్ట్ క్లాస్ నుంచే IIT కోచింగ్ అంటూ స్కూళ్ళు వెలుస్తున్నాయి. లక్షల్లో ఫీజులు కూడా వసూలు చేస్తున్నాయి. పిలల్లు ఇంట్లో మారం చేస్తున్నారనో… లేకపోతే వాళ్ళని స్కూళ్ళల్లో పడేస్తే.. తమ ఉద్యోగాలకు ఆటంకం ఉండదనో చాలామంది తల్లిదండ్రులు 6యేళ్ళ లోపే బడులకు పంపుతున్నారు. కానీ అంత చిన్న వయస్సులో పిల్లలు చదువు విషయంలో ఎంతో మానసిక క్షోభను పడుతున్నారని అంటోంది కేంద్ర ప్రభుత్వం. పిల్లలపై ఒత్తిడిలేని చదువుల కోసం… 2020లో తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యావిధానంలో అనేక సూచనలు చేసింది. అందులో భాగంగా పిల్లలను ఒకటో తరగతిలో అడ్మిట్ చేయాలంటే కనీసం ఆరేళ్ళయినా ఉండాలని షరతు పెట్టింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలోనే కేంద్ర విద్యాశాఖ లెటర్లు కూడా రాసింది.
2024-25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడ్ 1 లేదా ఒకటో తరగతిలో అడ్మిషన్స్ కు 6యేళ్ళ నిండిన వారికే ఇవ్వాలని మరోసారి లెటర్లు రాసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త విద్యా విధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. రెండేళ్ళ క్రితమే అంటే మార్చి 2021లోనే ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఆ తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలోనూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తమ రాష్ట్రాల్లో ఆరేళ్ళకి ఒకటో తరగతి విధానంపై ఆదేశాలు ఇచ్చాయి. అమలు చేస్తున్నాయి కూడా. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం కేంద్రం ఆదేశాలను అమలు చేయబోమని చెప్పేసింది. ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. కొత్త జాతీయ విద్యావిధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో కోరింది.