TDP, Janasena : టీడీపీ, జనసేనలో కొత్త గొడవ ! అదేంటి ! లోకేష్ అలా మాట్లాడాడు..?

టీడీపీ-జనసేన కూటమి సీఎం అభ్యర్ధి విషయంలో అప్పుడే గొడవ మొదలైందా ? చంద్రబాబే సీఎం అని లోకేష్ డిసైడ్ చేశారా? చంద్రబాబు-నేను మాట్లాడుకొని ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ చెబుతుంటే.. లోకేష్ మాత్రం చంద్రబాబే అని ఎలా తేల్చేస్తారు. లోకేష్ స్టేట్‌మ్మెంట్ జనసేన కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమైందా? ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. రేపు తమకు ప్రాధాన్యత దక్కుతుందా అని జనసైనికుల్లో ఆందోళన మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 01:52 PMLast Updated on: Dec 22, 2023 | 1:52 PM

A New Fight Between Tdp And Janasena What Is That Lokesh Said That

టీడీపీ-జనసేన కూటమి సీఎం అభ్యర్ధి విషయంలో అప్పుడే గొడవ మొదలైందా ? చంద్రబాబే సీఎం అని లోకేష్ డిసైడ్ చేశారా? చంద్రబాబు-నేను మాట్లాడుకొని ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ చెబుతుంటే.. లోకేష్ మాత్రం చంద్రబాబే అని ఎలా తేల్చేస్తారు. లోకేష్ స్టేట్‌మ్మెంట్ జనసేన కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమైందా? ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. రేపు తమకు ప్రాధాన్యత దక్కుతుందా అని జనసైనికుల్లో ఆందోళన మొదలైంది.

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేయబోతున్నాయి. మొత్తం 175 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అన్న దానిపై ఇంకా రెండు పార్టీలు అవగాహనకు రాలేదు. మరో నెల రోజుల్లో పొత్తుల సంగతిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి తేల్చేసే అవకాశాలున్నాయి. జనసేన 50 సీట్లు దాకా డిమాండ్ చేస్తోందనీ.. 20 మాత్రమే టీడీపీ కేటాయించే ఛాన్సుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఎన్నో యేళ్ళుగా ఆయా అసెంబ్లీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న జనసేన అభ్యర్థులకు ఈ పొత్తు ఇబ్బందిగా మారుతోంది. తమకు సీటు వస్తుందో రాదో.. అసలు టీడీపీతో పవన్ ఎందుకు కలవాల్సి వచ్చిందని కొందరు మధనపడుతున్నారు.

ఇదే టైమ్ లో టీడీపీ నేత లోకేష్ చేసిన ప్రకటనతో జనసేన లీడర్లు, కార్యకర్తల్లో మరింత అసహనం పెరిగింది. సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది.. చంద్రబాబు, తాను మాట్లాడి డిసైడ్ చేస్తామని పవన్ కల్యాణ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా లోకేష్ మాత్రం.. సీఎం సీటు విషయంలో షేరింగ్ ఏదీ ఉండదు.. చంద్రబాబే తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇంటర్వ్యూల్లో తేల్చిపారేశారు. ఇన్నాళ్ళు జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం అవుతాడని ఆ పార్టీ నేతలు బోల్డన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ లోకేష్ ఇలా ఏకపక్షంగా మాట్లాడటం ఏంటి.. పవన్ కూడా చంద్రబాబునే మళ్ళీ సీఎం చేయడానికి ఒప్పేసుకున్నాడా? లేక ఇప్పుడు చెబుతున్నట్టు తర్వాతే మాట్లాడుకుందాం అనుకున్నాడా? అన్న అనుమానాలు జనసైనికుల్లో మొదలయ్యాయి.

జనసేన – టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి పదవి కూడా షేరింగ్ పద్దతిలో ఉంటుందని గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. చెరి సగం.. అంటే చెరి రెండున్నరేళ్ళు ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగుతారని జనసేన నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబే సీఎంగా ఉంటారనీ.. పవన్ కల్యాణ్ కూడా అందుకు ఒప్పుకున్నారని లోకేష్ అంటున్నాడు. కానీ పవన్ కల్యాణ్ ఎప్పుడూ చంద్రబాబే సీఎం అని నేరుగా చెప్పలేదు. పైగా నాకు సీఎం పదవి అంటే వ్యతిరేకత లేదు.. వస్తే కచ్చితంగా ఆ పదవిని తీసుకుంటా అని చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ చెబుతున్నది చూస్తే.. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే పదవికే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. తమ నాయకుడికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వనప్పుడు.. టీడీపీతో తాము ఎందుకు పనిచేయాలి.. ఆ పార్టీ కోసం తమ సీట్లు ఎందుకు త్యాగం చేయాలి అన్న చర్చ జనసేనలో మొదలైంది. ఒంటరిపోరు చేసినా తమకు ప్రయోజనం ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు. లోకేష్ కామెంట్స్ తో ఇప్పుడు టీడీపీ – జనసేన కూటమిలో కొత్త రచ్చ మొదలైంది. దీనిపై చంద్రబాబు లేదా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.