AP Politics : వ్యూహం లేని యుద్ధం.. పవన్ రాజకీయం

పవన్ రాజకీయాల్లోకి వచ్చి పదిహేనేళ్లైంది. ఇప్పటికీ వేసే ప్రతి అడుగులోనూ అస్పష్టత కనిపిస్తోంది. దీంతో క్యాడర్ లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. పవన్ వ్యవహారశైలితో జనానికి కూడా ఆయనపై నమ్మకం రావడం లేదు. దశాబ్దన్నర కాలంగా రాజకీయం చేస్తున్న పవన్.. పరిణతి మాత్రం సాధించలేకపోయారు. ఆయన ఏం చెప్పినా దాన్ని జనం సీరియస్ గా తీసుకోవడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2023 | 01:01 PMLast Updated on: Dec 17, 2023 | 1:01 PM

A War Without A Strategy Pawans Politics

 

పవన్ రాజకీయాల్లోకి వచ్చి పదిహేనేళ్లైంది. ఇప్పటికీ వేసే ప్రతి అడుగులోనూ అస్పష్టత కనిపిస్తోంది. దీంతో క్యాడర్ లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. పవన్ వ్యవహారశైలితో జనానికి కూడా ఆయనపై నమ్మకం రావడం లేదు. దశాబ్దన్నర కాలంగా రాజకీయం చేస్తున్న పవన్.. పరిణతి మాత్రం సాధించలేకపోయారు. ఆయన ఏం చెప్పినా దాన్ని జనం సీరియస్ గా తీసుకోవడం లేదు. 2024 ఎన్నికలు ఆయన ఎదుర్కునే నాలుగో ఎన్నికలు. ఇన్నేళ్లైనా జనసేన వ్యూహాల్లో పదును లేదని కొందరు, అసలు వ్యూహమే లేదని మరికొందరు ఎత్తిచూపుతున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన..తెలంగాణలో మాత్రం ఆ పొత్తు కొనసాగించట్లేదు. పైగా ఏపీలో టీడీపీతో పొత్తు పదేళ్లు ఉండాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. ఇదే టీడీపీ మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కనీసం జనసేన అభ్యర్థులకు ఓటేయమని కూడా చెప్పలేదు. ఇదేం పొత్తు, ఇదేరకమైన పొత్తు అనే ప్రశ్నలకు పవన్ దగ్గర జవాబు లేదు. పోనీ బీజేపీతో పొత్తన్నా నిలకడగా ఉందా అంటే అదీ లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో ఎవరితో పొత్తు ఉండదని బీజేపీ చెప్పేసింది. పవన్ ఎప్పుడు ఎందుకు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది బ్రహ్మపదార్ధంలా మారింది. పవన్ అవగాహనలేమే దీనికి కారణమనే వాదన కూడా ఉంది. అటు పవన్ ప్రసంగాలకు కూడా జనం కనెక్ట్ కావడం లేదు. జనసేనాని నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే ముద్ర కూడా పోవడం లేదు. పవన్ పై నమ్మకం లేకే జనం ఆయన్ను ఓడిస్తున్నారు. ఆయన కూడా ఆ నమ్మకం కరువవవై పొత్తులు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఒంటరిగా దిగితే ఓటమి ఖాయమని పవనే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. సహజంగా పొత్తులు పెట్టుకుంటే ఉమ్మడి అజెండా అనో, ఇంకేదో సిద్ధాంతం కలిసిందనో చెబుతారు. కానీ ఓటమి భయంతో పొత్తు తప్పడం లేదని చెప్పడం సరైన పనేనా అనేది జనసైనికుల్ని వేధిస్తున్న ప్రశ్న. పవన్ కు తెలియదు. పవన్ కి చెప్పేవాళ్లు కూడా ఎవరూ లేరనేది విశ్లేషకుల మాట.

పవన్ రాజకీయ విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా ఉండట్లేదు. తిట్టాల్సిందే అని ముందే ఫిక్సై తిడుతున్నట్టుగా ఉండటం కూడా తేడా కొడుతోంది. అందుకే జనం పవన్ ని సీరియస్ గా తీసుకోవడం లేదనే అభిప్రాయం ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలున్నాయి. బూత్ స్థాయిలో కమిటీలు లేకుండా ఓట్ల శాతం పెరగటం, పార్టీ జనం లోకి వెళ్లటం ఎలా సాధ్యమౌతుందనేది మరో ప్రశ్న. ఇలా మౌలికమైన రాజకీయ అంశాలకు దూరంగా పవన్ రాజకీయం సాగుతోంది . పవన్ ఎప్పుడేం చెబుతున్నారో జనసైనికులకే గుర్తుండటం లేదు. ఇక ప్రజలకు ఎలా మనసుకు ఎక్కుతుందనేది అసలు ప్రశ్న. రాజకీయ నేతకు సొంత వ్యూహం ఉండాలి. ఏమైనా పొరపాట్లు జరిగితే.. ఇతర పార్టీల నేతల్ని చూసైనా నేర్చుకోవాలి. కానీ పవన్ ఎక్కడా పద్ధతి మార్చుకోవడం లేదు. ఎప్పటికప్పుడు ప్రజలకు అంతు చిక్కకుండా ప్రవర్తిస్తున్నారు.

ఎన్నికల్లో ఎవరైనా గెలవాలనే అనుకుంటారు. ఏ పార్టీ అయినా అధికారం కోరుకుంటుంది. అందుకోసం ఓ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. గెలుపోటముల సంగతి పక్కనపెడితే.. వ్యూహం లేని పార్టీ అంటూ ఏదీ ఉండదు. కానీ జనసేన వ్యూహమే కొరుకుడుపడటం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్నా.. వ్యూహం ఏంటో క్లారిటీ లేకపోవడం.. క్యాడర్ ను గందరగోళపరుస్తోంది. రాజకీయాల్లో మంచో చెడో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కోసారి నష్టపోతామని తెలిసినా.. ఆ దారిలో వెళ్లక తప్పదు. పవన్ ఒక్కోసారి నిర్ణయం తీసుకున్నా.. అదేంటో స్పష్టంగా అర్ధం కాదు. దీంతో క్యాడర్ కు అప్పుడు కూడా అయోమయం తప్పడం లేదు. క్యాడర్ కు కన్ఫ్యూజనే లేకుండా చేయాల్సిన అధినేతే స్వయంగా గందరగోళంలో ఉండటం కూడా వింతగా ఉంటుంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. 2019 ఎన్నికల ముందు వరకూ తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసిన పవన్ కల్యాణ్.. ఒక్కసారిగా ఆ పార్టీకి కటీఫ్ చెప్పేశారు. టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి బయటికొచ్చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీతో కలిసి పని చేయడం ప్రారంభించారు. అయితే కొంతకాలంగా ఆయన బీజేపీతో దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇలా పొత్తుల విషయంలోనే నిలకడలేని జనసేనాని ఇక తమకేం ఉద్ధరిస్తారని జనం అనుకునే ప్రమాదం లేకపోలేదు. జనసేనకు క్యాడర్ లేదు. కానీ పవన్ కు అభిమానులున్నారు. ఇలా వ్యక్తిగత ఛరిష్మాతోనే ఎక్కువకాలం పార్టీ నడవదు. వీలైనంత త్వరగా పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించాలి. అప్పుడే జనసేన నిరంతరం జనంలో ఉంటుంది. అంతేకానీ పవన్ వస్తేనే జనసేన.. లేదంటే లేదు అనే అభిప్రాయం అసలు మంచిది కాదు. ఈ విషయంలో పవన్ మెరుగైన కసరత్తు చేయాల్సి ఉంది. పార్టీ నిర్మాణం సరిగా జరగకపోవడం, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకపోవడం వల్లే
పొరపాట్లు జరుగుతున్నాయనే వాదన ఉంది.

పవన్ ఇన్నాళ్లుగా రాజకీయం చేస్తున్నా.. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యూత్ నే ఆకట్టుకోగలుగుతున్నారు. ఆపై వయసు వాళ్లు ఆయనకు కనెక్ట్ కావడం లేదు. ఓటర్లలో వివిధ వర్గాలను దరి చేర్చుకోకుండా అనుకున్న లక్ష్యం ఎలా నెరవేరుతుందనేది ప్రశ్న. రైతులు లాంటి కీలక వర్గాలు కూడా పవన్ ను పట్టించుకోవడం లేదు.

ఎంతసేపూ పవన్ సినిమా అభిమానులు మాత్రమే ఆయన సభలకు వస్తే సరిపోతుంద?

పొలిటికల్ పార్టీ అంటే రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి. కేవలం అధినేతే కాదు.. కార్యకర్త స్థాయి నుంచి సీనియర్ల దాకా అందరూ పనిచేయాలి. కానీ జనసేనలో పవన్ మినహా చెప్పుకోదగ్గ నేత లేకపోవడం, కనీసం సమష్టి కృషి చేయడానికి కూడా కమిటీలు లేకపోవడం మైనస్ గా మారింది. ఇలా ఓ రాజకీయ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలో.. జనసేనలో అలా జరగలేదు. ఇలా ఓవైపు పార్టీ నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్న జనసైనికులకు పవన్ వ్యవహారశైలి మరింత చిక్కుముడిగా మారుతోంది. తమ అధినేత ఏం చెబుతున్నారో తమకే స్పష్టత లేకపోతే.. ఇక ప్రజలకు ఏం చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏ పార్టీలో అయినా అధినేతే అన్ని పనులూ చేయలేరు. సమర్థులైన నేతల్ని ఎంపిక చేయడం, వారికి కీలక బాధ్యతలు అప్పగించడం, పనితీరుపై రివ్యూ చేయడం, ప్రోగ్రెస్ ఆధారంగా పదవుల పంపకం చేయడం లాంటి పనులు చేసుకుంటూ పోవాలి. కానీ జనసేనలో ఈ పని జరుగుతుందా.. లేదా అనే విషయం ఆ పార్టీ క్యాడర్ కే తెలియడం లేదు. పవన్ ప్రభావం కూడా ఓ స్థాయికి మించి పెరగట్లేదు. ఇంకా ప్రభావం పెంచుకోవడానికి ఏం చేయాలో పవన్ కూడా నిర్దిష్టంగా ఆలోచించడం లేదు. నాయకుడు ఎప్పుడూ వ్యూహం ప్రకారం పనిచేయాలి. కానీ అసలు వ్యూహమే లేకుండా పనిచేయడమే.. పవన్ కు సమస్యగా మారుతోంది. టీడీపీ,జనసేన పొత్తు విషయంలో కమ్మ, కాపు ఈక్వేషన్ పై చర్చ జరుగుతోంది. తెలంగాణలో కమ్మవర్గం జనసేనకు సపోర్ట్ చేయనప్పుడు ఏపీలో టీడీపీకి తామెందుకు సపోర్ట్ చేయాలని కాపు వర్గంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి సమస్యల్ని పవన్ అధిగమించాల్సి ఉంది. పవన్ ఏదో వ్యూహం ఉన్నట్టు చెబుతున్నా.. నిజానికి అలాంటిది ఏమీ లేదు. ఒక పని చేస్తే ఎందుకు చేశాం.. చేయకపోతే ఎందుకు చేయలేదో కచ్చితంగా ప్రజలకు చెప్పగలగాలి. కానీ ఆ విషయంలో పవన్ విఫలమౌతున్నారనే వాదన ఉంది.

రాజకీయాల్లో వ్యూహాలే ప్రధానం. అప్పటికప్పుడు వ్యూహాలు కూడా మార్చాల్సి ఉంటుంది. అలాంటిది అసలు వ్యూహమే లేకుండా రాజకీయం చేయడం ప్రమాదకరం. పవన్ స్పీచుల్లో జనం తనకు ఓటేయలేదనే ఫిర్యాదే తప్ప.. ఎందుకు ఓటేయలేదని ఆత్మపరిశీలన చేసుకున్న సందర్భాలు కనిపించడం లేదు. ఈ ఆత్మ పరిశీలన లేకుండా రాజకీయ ఎదుగుదల aసాధ్యం . రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ.. హత్యలుండవు. ఏ పార్టీ బాగుపడ్డా, బలహీనపడ్డా.. అది ఆ పార్టీ మీదే ఆధారపడి ఉంటుంది. మరో పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు. ఇప్పుడు జనసేన ప్రస్తుత స్థితికి కూడా ఆ పార్టీ నడవడికే కారణం. పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఎలాంటి విమర్శలు వచ్చాయో.. ఇప్పటికీ అవే విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం జనసేన గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్న సూచనలుండేవి. కానీ ఆ గ్రాఫ్ కొంతవరకు పెరిగి అక్కడే ఆగిపోయింది. పార్టీ బలోపేతం కోసం ఆయన అసలు ఆలోచించడం లేదని కూడా చెప్పలేం. అప్పుడప్పుడూ కార్యాచరణ ప్రకటిస్తారు. కానీ చెప్పిన మాటపై నిలబడరు. ఇక్కడే నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే మాటొస్తోంది. క్యాడర్ కూడా నీరసపడిపోతోంది. రాజకీయం హడావుడిగా చేసేది కాదు. ఇలా వస్తే అలా అయిపోయేది కాదు. ఓ సమగ్ర వ్యూహంతో, దీర్ఘకాలిక కార్యాచరణతో చేయాలి. పవన్ కళ్యాణ్ యుద్దానికి వ్యూహామే కరువైంది.