Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్.. కేంద్రం సీరియస్..!
సినీ నటి రష్మిక మందన్నాకు చెందిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేరే మహిళకు సంబంధించిన వీడియోను రష్మిక వీడియోలాగా మార్చారు. ఒరిజినల్ వీడియోలని మహిళ ముఖాన్ని.. రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి, విడుదల చేశారు.
Rashmika Mandanna: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ కొత్త సమస్యలకు కారణమవుతోంది. ప్రస్తుతం డీప్ ఫేక్ టెక్నాలజీ ఇలాంటి సమస్యే సృష్టిస్తోంది. కావాల్సిన వారి ఇమేజెస్, వీడియోలు క్రియేట్ చేయడమే ఈ టెక్నాలజీ. అంటే ఒకరి వీడియోను లేదా ఇమేజ్‌ను మరొకరి వీడియో, ఇమేజ్‌లాగా మార్చవచ్చు. ఇలా ఏ వ్యక్తికి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో లేదా ఇమేజ్ బయటకు వచ్చినా వాళ్లకు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా సినీ నటి రష్మిక మందన్నాకు చెందిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వేరే మహిళకు సంబంధించిన వీడియోను రష్మిక వీడియోలాగా మార్చారు. ఒరిజినల్ వీడియోలని మహిళ ముఖాన్ని.. రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేసి, విడుదల చేశారు. ఈ వీడియో, అలాగే ఒరిజినల్ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకరి ఫేక్ వీడియోలు సృష్టించడం సరికాదంటున్నారు. మరోవైపు ఈ డీప్ ఫేక్ టెక్నాలజీపై కేంద్రం కూడా స్పందించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వీడియో విడుదలవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఆయా సోషల్ మీడియా సంస్థలదే అన్నారు. ఇంటర్నెట్‌కు సంబంధించి భారత వినియోగదారుల నమ్మకం, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ రూపొందించిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా సోషల్ మీడియాలో యూజర్లు తప్పుడు సమాచారం పోస్ట్ చేయకుండా చూడాలని ఆయా సంస్థలకు సూచించారు. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు తప్పుడు సమాచారాన్ని సంస్థలు తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ రూల్స్ పాటించని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై రూల్ 7 ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఆయా సంస్థలపై కోర్టును ఆశ్రయించే హక్కు బాధితులకు ఉందని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. మార్ఫింగ్ అత్యంత క్రూరమైన చర్య అని అభివర్ణించారు.