AP Politics : ఏపీపై గాంధీ ఫ్యామిలీ స్పెషల్‌ ఫోకస్‌.. ప్లాన్‌ మాములుగా లేదుగా..

తెలంగాణలో ఊహించని విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ఏపీ మీద ఫోకస్‌ పెడుతోంది. ఏపీలో బలం పుంజుకునేందుకు ఎలాంటి కఠిన చర్యలకు అయినా.. ఎన్ని మెట్లు దిగేందుకు అయినా.. ఎవరినైనా ఢీకొట్టేందుకైనా సిద్ధం అన్నట్లుగా కాంగ్రెస్‌ వ్యూహాలు కనిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 28, 2023 | 02:18 PMLast Updated on: Dec 28, 2023 | 2:18 PM

Gandhi Family Special Focus On Ap Plan Is Not Normal

తెలంగాణలో ఊహించని విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ఏపీ మీద ఫోకస్‌ పెడుతోంది. ఏపీలో బలం పుంజుకునేందుకు ఎలాంటి కఠిన చర్యలకు అయినా.. ఎన్ని మెట్లు దిగేందుకు అయినా.. ఎవరినైనా ఢీకొట్టేందుకైనా సిద్ధం అన్నట్లుగా కాంగ్రెస్‌ వ్యూహాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. గత ఎన్నికల్లో కనీసం ఒక్కరికి కూడా డిపాజిట్లు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు.. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి. ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌ను యాక్టివ్‌ చేసి.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభావం ఉండేలా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

దీనికోసం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాకూర్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏం చేయాలనే దానిపై.. సుధీర్ఘంగా చర్చించారు. పార్టీలో చేరికలు, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, పొత్తులు, రాజకీయ వ్యవహారాల్లాంటి అంశాలపై చర్చించారు. దీంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలను చేర్చాలనే విషయంపైనా ప్రధానంగా చర్చ జరిగింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో కాంగ్రెస్ తరఫున చేపట్టబోయే వివిధ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. మాస్టర్‌ ప్లాన్ సిద్ధం చేశారు. సంక్రాంతి తర్వాత కొన్ని కీలక ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించారు.

హిందూపురంలో మల్లికార్జున ఖర్గే, విశాఖపట్నంలో రాహుల్ గాంధీ , అమరావతిలో ప్రియాంక గాంధీ సభలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు వరుస కాంగ్రెస్ చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా ఉండి ఇతర పార్టీల్లో చేరిపోయిన నేతలను.. తిరిగి హస్ం గూటికి రప్పించే విధంగా వారితో సంప్రదింపులు చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. మరి ఇవన్నీ వర్కౌట్ అవుతాయా.. కనీసం పోటీ అయినా ఇస్తుందా.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆటలో అరటిపండులా మిగిలిపోతుందా.. ఇలా చాలా అనుమానాలు వినిపిస్తున్నాయ్ కొందరిలో !