INDIA Alliance : ఇండియా కూటమిలో సీట్ల లొల్లి….ఎవరికి వారే – యమునా తీరే !

లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసి... ప్రధాని నరేంద్రమోడీని అధికారం నుంచి దింపాలని పెద్ద పెద్ద కంకణాలు కట్టుకున్నారు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు.  కానీ ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం.  దేశవ్యాప్తంగా సీట్ల పంపిణీ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి.  మొన్న మహరాష్ట్రలో శివసేన, నిన్న పంజాబ్ లో ఆప్ పార్టీ... ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. అవసరమైతే ఒంటరిగా అయినా పోరుకు వెళ్తామని అల్టిమేటం జారీ చేస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 31, 2023 | 10:58 AMLast Updated on: Dec 31, 2023 | 10:58 AM

India Alliance Seat Sharing

India Alliance :  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని 2024లో అధికారం నుంచి దింపాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇతర పార్టీల ఆలోచన. అందుకోసం బీజేపీయేతర పార్టీల్లో చాలావరకూ ఇండియా కూటమిగా జతకట్టాయి. ప్రధాని పదవిలో కూర్చోవాలని నితీష్ కుమార్ కలలు గన్నా… ఆ తర్వాత  AICC అధ్యక్షుడు మల్లిఖార్జున్ పేరును బయటకు తీసుకొచ్చారు. దాంతో తమ నాయకుడు రాహుల్ గాంధీని భావి ప్రధానిగా ఊహించుకున్న కాంగ్రెస్ శ్రేణుల ఆశలు అడుగంటాయి. సరే… రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బహిరంగసభలు, భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని నిర్ణయించాయి కూటమిలోని అన్ని పార్టీలు. కానీ అంతకంటే ముందు సీట్ల పంపకం పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు.

సరిగ్గా ఇక్కడే పేజీ మొదలైంది.  సీట్ల సర్దుబాటుపై ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా… బలంగా ఉన్న పార్టీలన్నీ తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి.  మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో 23 తమకే కావాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.  మిగిలిన 25 సీట్లను కాంగ్రెస్, NCP పంచుకోవాలని అంటున్నారు.  దీనికి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నేతలు ఒప్పుకోవడం లేదు.  పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ కూడా ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తున్నారు.  దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఉంటుంది..  కానీ పశ్చిమబెంగాల్ లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి బుద్ధి చెప్పగలదు అంటూ ఈమధ్య ఓ బహిరంగ సభలో కామెంట్ చేశారు.  అంతే బెంగాల్ లో 42 లోక్ సభ సీట్లు ఉన్నాయి.  వీటిల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు కేటాయించేది లేదంటున్నారు మమతా బెనర్జీ.

Employees Salaries : 2024 న్యూఇయర్ గుడ్ న్యూస్… తెలంగాణలో ఫస్ట్ వీక్ లోనే జీతాలు !

పంజాబ్ లో అధికారంలో ఆప్ పార్టీ కూడా తాము రాష్ట్రలోని 13 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటనలు ఇస్తోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. సో… ఆప్ తో జతకట్టేది లేదనీ… ఒంటరిగానే పోటీ చేద్దామంటున్నారు హస్తం పార్టీ నేతలు.  అలాగే ఢిల్లీ, బిహార్, ఝార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లోనూ లోక్ సభ సీట్ల పంపకం విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది.  ఈమధ్య రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.  దాంతో కాంగ్రెస్ కు టిక్కెట్లు ఇచ్చేందుకు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ముందుకు రావడం లేదు.  అయితే రాహుల్ గాంధీ జనవరి 14న భారత్ న్యాయ యాత్ర ప్రారంభిస్తున్నారు.  దీంతో కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందనే భావనలో ఉన్నారు AICC పెద్దలు.  అయితే ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల కోసం కాంగ్రెస్ ఓ జాతీయ అలయెన్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.  అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని ఆ కమిటీ సభ్యులు చెబుతున్నారు.