Andhra Pradesh BJP : ఏపీలో ఎం చెయ్యాలో అర్థం కాక.. జుట్టు పీక్కుంటున్న బీజేపీ..

ఏపీలో ఎన్నికల హడావుడి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ ఎలక్షన్స్‌లో పోటీ చేసి బొక్కబోర్లా పడింది జనసేన. సీట్ల సంగతి తర్వాత కనీసం ఓట్లు కూడా సరిగా పడలేదు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2023 | 01:53 PMLast Updated on: Dec 17, 2023 | 1:53 PM

Not Understanding What To Do In Ap Bjp Is Pulling Its Hair

 

ఏపీలో బీజేపీ ఎక్కడ ?

ఏపీలో ఎన్నికల హడావుడి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ ఎలక్షన్స్‌లో పోటీ చేసి బొక్కబోర్లా పడింది జనసేన. సీట్ల సంగతి తర్వాత కనీసం ఓట్లు కూడా సరిగా పడలేదు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. తెలంగాణలో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి జనసేనే కారణమన్నది దాని సారాంశం. జనసేన వల్ల ముఖ్యంగా సెట్లర్లు, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమకు టర్న్‌ అవుతాయని భావించారట తెలంగాణ బీజేపీ నేతలు.

కానీ సీన్‌ రివర్స్‌ అయి గంపగుత్తగా బీఆర్ఎస్‌కు పడ్డాయన్నది పార్టీ నేతల అంచనా. కాపులతో పాటు పవన్‌ అభిమాన గణం కూడా బీఆర్‌ఎస్‌కే ఓటేసినట్టు బీజేపీ నేతలు నిర్ధారణకు వచ్చారన్నది సమాచారం. దాంతో రెండు పార్టీల మధ్య వ్యవహారం చెడిందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎవరితోనూ పొత్తు ఉండదన్న రీతిలో కిషన్‌ రెడ్డి సంకేతాలు పంపడాన్ని కూడా ఈ కోణంలోనే చూడాలంటున్నారు పరిశీలకులు. ఇప్పుడిదే ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. తెలంగాణలో బీజేపీ, జనసేన బంధం కొసికొచ్చి కొట్టుకులాడుతున్న సందర్భంలో.. ఏపీలో కూడా తెగినట్టేనా అన్న ప్రశ్న వస్తోంది. ఇప్పటికే ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైపోయింది. సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఎక్కడా బీజేపీ ప్రస్తావన రాకున్నా.. బీజేపీ కూడా టీడీపీ-జనసేన కూటమితో జట్టు కట్టడం ఖాయమనే భావన ఇప్పటికీ కొన్ని వర్గాల్లో ఉంది. జనసేన-బీజేపీలకు కలిపి 30 నుంచి 35 అసెంబ్లీ సెగ్మెంట్లు.. ఏడు ఎంపీ స్థానాలు ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్స్‌, కిషన్‌ రెడ్డి కామెంట్స్‌పై ఆంధ్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలోలాగే ఏపీలో కూడా బీజేపీ-జనసేన బంధం తెగే దశకు వచ్చినట్టేనా? బీజేపీ సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్తుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇదే సందర్భంలో బీజేపీ పేరుతో సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ అవుతున్న ఓ వీడియో క్లిప్పింగ్‌ పరిస్థితిని చెప్పకనే చెబుతోందని అన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగం పై ఇటీవల అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దొందూ దొందేనంటూ బీజేపీ పేరుతో వచ్చిన వీడియో ఆసక్తి రేపుతోంది. అధికారికంగా పార్టీ నుంచి వచ్చిందా? లేక సానుభూతిపరులు తయారు చేసి జనం మీదికి వదిలారా అన్నది తేలాల్సి ఉంది. అధికారికమైతే మాత్రం ఇక ఏపీలో కూడా బంధం తెగినట్టేనంటున్నారు.

టీడీపీ-జనసేన కూటమితో కలిసి వెళ్లాలన్న ఆలోచన బీజేపీకి ఉంటే.. ఈ తరహాలో వీడియోను వదలరు కదా అనేది బేసిక్‌ పాయింట్‌. అయితే ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలను కొంత మేర శాంత పర్చడానికి కిషన్‌ రెడ్డి ఈ తరహా కామెంట్‌ చేసి ఉండొచ్చని.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జనసేనతో కచ్చితంగా బీజేపీ కలిసి వెళ్తుందన్నది ఆ చర్చ సారాంశం. బీజేపీ ఏపీ చీఫ్‌ పురంధేశ్వరి కూడా టీడీపీ అంశాన్ని ప్రస్తావించకున్నా.. జనసేన మాత్రం తమ మిత్రపక్షమేనని అన్నారు. దీంతో 2014 కాంబినేషన్‌ని కొట్టిపారేయలేమని, ఏం జరుగుతుందో చివరిదాకా వేచి చూడాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి కిషన్‌ రెడ్డి కామెంట్స్‌తో ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం మీద కొత్త చర్చకు తెర లేచింది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.