Pregnancy Scam : ప్రెగ్నెన్సీ చేస్తే… రూ.13 లక్షలు ! బిహార్ లో బయటపడ్డ భారీ స్కామ్
నిరుద్యోగుల నిస్సహాయతను క్యాష్ చేసుకోడానికి బిహార్ లో కొందరు కేటుగాళ్ళు ఓ వెరైటీ స్కీమ్ మొదలుపెట్టారు. అమ్మాయిలను గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అందుకోసం రూ.799 రిజిస్ట్రేషన్ ఫీజు, డిపాజిట్ 20 వేల దాకా వసూలు చేశారు. ఆ తర్వాత పరార్ అవడంతో పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.
రోజుకో తరహా మోసం వెలుగులోకి వస్తోంది. ఇప్పటిదాకా ఇంట్లో ఉండే ఉద్యోగం, విదేశాల్లో కొలువు పేరుతో దొంగ కన్సెల్టెన్సీలు జనాన్ని మోసం చేస్తున్నాయి. బిహార్ లోని ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ .. నిరుద్యోగులను వెరైటీగా మోసం చేసింది. ఈ ఫేక్ సంస్థ అమ్మాయిలను గర్భవతులను చేస్తే రూ.13 లక్షలు ఇస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టింది. ఒకవేళ చేయలేకపోతే స్పెషల్ గిఫ్ట్ పేరుతో రూ.5 లక్షలు ఇస్తామని నమ్మించింది. వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రకటనను సర్క్యులేట్ చేశారు. ముందుగా ఎంట్రీ ఫీజు కింద 799 రూపాయలను కట్టించుకున్నారు. అందమైన అమ్మాయిలు, యువతుల ఫోటోలను చూపించారు. వాళ్ళల్లో నచ్చినవారితో శృంగారం చేయొచ్చని నమ్మించారు. అమ్మాయిల అందాన్ని బట్టి రూ.5 వేల నుంచి 20 వేల దాకా నిరుద్యోగుల నుంచి కలెక్ట్ చేశారు. అలా డబ్బులు వసూలు చేసి… ఫోటోలో ఉన్న అమ్మాయిల మొబైల్ నెంబర్లు, అడ్రెస్ ఇచ్చేవారు. అది తీసుకొని వెళ్ళిన నిరుద్యోగులకు ఏ అమ్మాయి కనపడదు. పైగా ఈ కేటుగాళ్ళు కూడా తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారు.
నిరుద్యోగులను నిండా ముంచుతున్న ఈ ముఠాను పట్టుకునేందుకు బిహార్ లోని నవాడా ఎస్పీ ఆధ్వర్యంలో ఓ సిట్ ఏర్పాటు చేశారు. ఆలిండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ నిర్వాహకుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బాధితుల సమాచారంతో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఫేక్ సంస్థకు డబ్బులు కట్టిన నిరుద్యోగులు వేలల్లో ఉన్నట్టు తెలుస్తోంది. బయటకు తెలిస్తే పరువు పోతుందని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడానికి జంకుతున్నారు.