మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్..ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన మహనీయుడని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. దేశానికి ఆయన చేసిన సేవ, రాజకీయం జీవితం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరనిలోటన్నారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. విశిష్టమైన వ్యక్తుల్లో మన్మోహన్ సింగ్‌ను ఒకరన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. దేశ ఆర్థికరంగంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారన్న ఆయన...ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానిగా దేశ ప్రజలు జీవితాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయని... మన్మోహన్ సింగ్ ను దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుందన్నారు. గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించారని గుర్తు చేశారు. ఆర్థికశాస్త్రంలో ఆయన లోతైన అవగాహన...దేశానికి స్ఫూర్తి అందించిందన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్ గాంధీ. మన్మోహన్ సింగ్ మరణం జీర్ణించుకోలేకపోతున్నట్లు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ తెలిపారు. భారత దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేశారన్న ఆయన...ఆర్థిక సరళీకరణ రూప శిల్పిగా పేరు సంపాదించుకున్నారని గుర్తు చేశారు. కఠినమైన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారని కొనియాడారు. దేశ అభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచిన మన్మోహన్ సింగ్...ఉప రాష్ట్రపతిగా ఆయనతో ఎన్నో సంభాషణలు జరిపినట్లు ధన్ ఖడ్ వెల్లడించారు. భారత దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా...దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. దేశ రాజకీయాలలో నిష్ణాతుడని...ప్రజా సేవలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం తపించారని గుర్తు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయన నాయకత్వం, అభిమానాన్ని సంపాదించుకున్నారని జేపీ నడ్డా అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి...మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కేంద్రమంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్న చంద్రబాబు.... కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. గొప్ప మానవతావాది అన్న ఆయన....అసలైన నవభారత నిర్మాతను దేశం కోల్పోయిందన్నారు.[embed]https://www.youtube.com/watch?v=ai_e1kjc6N0[/embed]