Smriti Irani: బెట్టింగ్ యాప్ నుంచి కాంగ్రెస్‌కు నిధులు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ప్రచారానికి ఈ నిధుల్నే వినియోగిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన అక్రమ డబ్బును వినియోగిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. దేశ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన బెట్టింగ్ గేమ్ ఆడారు
Smriti Irani: బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి నిధులొస్తున్నాయని, ఈ నిధులతోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. బెట్టింగ్ యాప్స్ నుంచి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్ల నిధులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా గుర్తించింది. దీంతో కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం నిధులు సమకూర్చుకునేందుకు హవాలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ప్రచారానికి ఈ నిధుల్నే వినియోగిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన అక్రమ డబ్బును వినియోగిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. దేశ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన బెట్టింగ్ గేమ్ ఆడారు” అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కాంగ్రెస్ అంటోంది. ప్రజల ముందు తమ సీఎం భూపేశ్ బఘేల్ ప్రతిష్ట దిగజార్చేందుకే ఇలా బీజేపీ విమర్శలు చేస్తోందని ఆరోపించింది.
రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే కేంద్రం.. దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కాగా, ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన అసిన్ అనే ఒక వ్యక్తి నుంచి రూ.5.36 కోట్ల నగదును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కాంగ్రెస్‌కు నిధులు అందజేసేందుకే మహదేవ్ అనే బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అసిన్ ద్వారా ఈ డబ్బు పంపినట్లు ఈడీ ఆరోపించింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు రూ.508 కోట్లు భూపేశ్ బఘేల్‌కు అందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది.