BRS BSP : ఇంత బతుకు బతికి… బీఎస్పీతో పొత్తా? బీఆర్ఎస్ పని అయిపోయిందా?
అధికారాంతమున చూడవలె అయ్యవారి వైభవం అంటారు. అధికారం పోగొట్టుకున్న తర్వాత కేసీఆర్ (KCR) వైభవం ఎలా దిగజారిపోయిందో స్పష్టంగా బయటపడింది. BRS ఇప్పుడు బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అధికారాంతమున చూడవలె అయ్యవారి వైభవం అంటారు. అధికారం పోగొట్టుకున్న తర్వాత కేసీఆర్ (KCR) వైభవం ఎలా దిగజారిపోయిందో స్పష్టంగా బయటపడింది. BRS ఇప్పుడు బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బహుజన సమాజ్ పార్టీ (Bahujan Samaj Party) చిన్నాచితక పార్టీ ఏం కాదు. అది జాతీయ పార్టీ. జాతీయ రాజకీయాలను (National Politics) శాసించిన పార్టీ. ఉత్తరప్రదేశ్ లో దశాబ్దాల పాటు అధికారాన్ని నిలబెట్టుకున్న పార్టీ. ఇంత చరిత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో ఆ పార్టీ ఇప్పుడు జీరో. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీ. ఒకప్పుడు ప్రగతి భవన్ రోడ్ లోకి కూడా బీఎస్పీ కార్యకర్తలను అనుమతించని కేసీఆర్, కనీసం బీఎస్పీ నాయకుల ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడని కేసీఆర్, ఎన్నడూ బీఎస్పీ పార్టీని ఆ పేరుతో ప్రస్తావించని కేసీఆర్… తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని సాదరంగా ఇంటికి పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడారు.
BSP, BRS మధ్య పొత్తు కోసం బతిమిలాడుకున్నారు. ఎట్టకేలకు కొన్ని కండిషన్స్ పై రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తారు. టిఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టదు. అలాగే మిగిలిన రాష్ట్రం అంతా BSP… గులాబీ పార్టీకి మద్దతు పలుకుతుంది. బీఎస్పీతో పొత్తు ద్వారా ఎస్సీ,ఎస్టీల, బీసీల ఓట్లు కొల్లగొట్టవచ్చన్నది కేసీఆర్ ప్లాన్. బీజేపీ తో పొత్తుకు ప్రయత్నించి భంగపడి… చివరికి బీఎస్పీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కేసీఆర్ కి.
తెలంగాణలో పదేళ్లు రాజరికపాలన చేసి… కన్ను మిన్ను కాకుండా వ్యవహరించిన కేసీఆర్ కుటుంబం లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గల్లంతైపోతుంది అనే భయంతో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. రాబోయే లోక్ సభ ఎన్నికలతో BRS పని అయిపోయినట్లేనని తెలుస్తోంది. అతి కష్టంపై ఒకటి లేదా రెండు సీట్లు వస్తే గొప్ప. కనీసం ఏదో మార్గంలో పరువు దక్కించుకోవాలని ఆలోచనతో బీఎస్పీని దగ్గరికి తీసుకున్నారు కేసీఆర్. ఇండియా కూటమిలో బీఎస్పీ, బీఆర్ఎస్ రెండు లేవు. కనుక తెలంగాణలో వాళ్ళు పొత్తులు పెట్టుకోవడానికి ఇబ్బంది కూడా ఏమీ లేదు. నాగర్ కర్నూల్ లో BRS గెలిచే అవకాశం ఎలాగూ లేదు. ఆ సీటు BSP ముఖాన కొడితే రాష్ట్రమంతా ఆ పార్టీని వాడుకోవచ్చని కేసీఆర్ వ్యూహం.