SEATS SALES : సీటు ఇస్తాం…ఎంత ఇస్తావ్ ?
పార్టీలో సభ్యుడై ఉండక్కర్లేదు. లీడర్ వ్యక్తిగత బలంతో సంబంధం లేదు. లోకలా.. నాన్ లోకలా అనేది కూడా అనవసరం. జనంలో తిరుగుతారా.. లేదా అనేది అప్రస్తుతం.
పార్టీలో సభ్యుడై ఉండక్కర్లేదు. లీడర్ వ్యక్తిగత బలంతో సంబంధం లేదు. లోకలా.. నాన్ లోకలా అనేది కూడా అనవసరం. జనంలో తిరుగుతారా.. లేదా అనేది అప్రస్తుతం. టికెట్ కావాలంటే డబ్బు కొట్టాల్సిందే. ఎంపీ సీటు 100 కోట్లు. ఎమ్మెల్యే సీటు అయితే 50 కోట్లు ఖర్చుకు రెడీగా ఉండాలి. ఇందులో పార్టీ ఫండ్ ఎంత..? నువ్వు ఎంత ఖర్చు పెడతావ్..? ఆ లెక్కలు వేరే. ఓవరాల్ గా పార్టీలు అభ్యర్థుల్ని అడుగుతున్న మొదటి ప్రశ్న ఎంత ఇస్తావ్? అనేది మాత్రమే.
ఎన్నికలు రాగానే నేతలంతా డబ్బులు లెక్కపెట్టుకోవడంలో బిజీ అయిపోతున్నారు. టికెట్ కావాలంటే.. మొదట నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటని నిర్మొహమాటంగా అడిగేస్తున్నాయ్ పార్టీలు. డబ్బులు పెట్టుకుంటామని చెప్పినా.. సోర్స్ ఏంటని ఆరా తీస్తున్నాయి. పొలాలు అమ్ముతావా.. ఆస్తులు తాకట్టు పెడతావా.. ఎక్కడ్నుంచైనా డబ్బు సర్దుబాటు అవుతుందా అని కూపీ లాగుతున్నాయి. అన్నిరకాలుగా డబ్బుకు సమస్య లేదని తేలాకే.. మిగతా ప్రశ్నలు వేస్తున్నాయి. ఇతర సమీకరణాల గురించి ఆలోచిస్తున్నాయి. ఎంపీ అభ్యర్థి అయితే కనీసం వంద కోట్ల రూపాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి అయితే యాభై కోట్ల రూపాయలు చేతిలో పెట్టుకోవాల్సిందేనని చెప్పేస్తున్నాయి. కులాలు, వర్గాలు, ప్రాంతాలు, అనుభవం, సేవ.. ఇలా ఎన్ని ప్రాతిపదికలు కలిసొచ్చినా.. అసలైన అర్హత డబ్బు మాత్రమే…లేదంటే మాత్రం టికెట్ గల్లంతే. అదే డబ్బుండి మిగతావేవీ లేకపోయినా.. సర్దుకుపోదాం అంటున్నాయి పార్టీలు. డబ్బున్న నేతలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. డబ్బు లేదని తెలిస్తే.. ఇచ్చిన టికెట్ కూడా కేన్సిల్ అవుతుంది. డబ్బుంటే మాట్లాడు.. లేకపోతే టైమ్ వేస్టు అంటున్నాయి. ఈ గోలంతా ఎందుకని మొదటే ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి.. తర్వాతే ఆఫీసులకు పిలుస్తున్నాయి పార్టీలు. కొన్ని పార్టీలైతే ఫైనాన్షియల్ చెక్ కోసం థర్డ్ పార్టీలను కూడా ఆశ్రయిస్తున్నాయి.
ఎన్నికలంటే సవాలక్ష ఖర్చులుంటాయి. ప్రచారం, సభలు, మద్యం, బిర్యానీ, కార్యకర్తల రోజువారీ ఖర్చు, ప్రచారానికి వచ్చే జనానికి బేటాలు.. ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. డబ్బుకు వెనకాడని క్యాండిడేట్లు అయితే ఏ పార్టీలో ఉన్నా.. అర్జెంట్ గా తమ పార్టీ కండువా కప్పేసి మరీ టికెట్లు చేతిలో పెట్టేస్తున్నారు. అసలు ఆ ప్రాంతంతో సంబంధం లేకపోయినా ఫర్లేదు.. డబ్బుంది కదా అని అభ్యర్థుల్ని కళ్లకద్దుకుంటున్నాయి పార్టీలు.. బిజినెస్ లో పెట్టుబడి పెట్టి లాభాల కోసం చూసినట్టే.. ఎన్నికల్లో డబ్బులు పెట్టి.. తర్వాత ఐదేళ్లు అంతకు రెట్టింపు వసూళ్లపై దృష్టి పెడుతున్నారు. పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలే కాదు… స్థానిక ఎన్నికలు… ఆఖరికి పంచాయితీ ఎన్నిలను కూడా డబ్బే శాసిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ టికెట్ కావాలంటే రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఆ మాత్రం మనీ సూక్ష్మం గ్రహించకుండా ఎన్నికల్లో ఎలా పోటీచేస్తారనేది పార్టీలు సూటిగా అడుగుతున్న ప్రశ్న.
రాజకీయంలో ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు… మరి రాజకీయంలో ఉండాలంటే.. డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇదీ ప్రస్తుతం అమల్లో ఉన్న థియరీ. రాజకీయంలో నిలదొక్కుకోవడం ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారం వచ్చాక సంపాదించుకోవడం ఊరించే వ్యవహారం అయినా…. ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కోవాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత ఖర్చుచేస్తే.. గెలుస్తామో, ఓడతామా అనేది ఎవరూ చెప్పలేరు. అలాగని డబ్బు ఖర్చు చేయకుండా ఉండే ధైర్యం మాత్రం ఎవరూ చేయట్లేదు. పార్టీల తేడాలు లేవు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే ఖర్చు పెరిగేది. కానీ ఇటీవలి కాలంలో ఉపఎన్నికలు కూడా ఎన్నికల ఖర్చుకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి.
డబ్బు ఖర్చు పెట్టగలడా లేదా.. అనేదికాదు ఎంత ఖర్చు పెడతాడు? అనేది ఇప్పుడు పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడ పార్టీల పేర్లతో పనిలేదు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలకతీతంగా పాటిస్తున్న ప్రాథమిక సూత్రం ఇదే. అన్ని పార్టీల్లోనూ మెజారిటీ సీట్ల విషయంలో ఇవే లెక్కలే ఉన్నాయి. ఎక్కువ కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగలిగే వారికే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడానికి పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కావాల్సింది ప్రజల్లో ఉన్న పేరు, ప్రజలకు సేవ చేసిన నేపథ్యం కాదని.. పదుల కోట్ల రూపాయల వెయిటే అని పార్టీలు తేల్చి చెబుతున్నాయి. ఈ విషయంలో రాజీ పడటంలేదు. ఈ విషయాన్ని జనం కూడా పట్టించుకోవట్లేదు. జనాల్లో కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఎవరైతే ఎక్కువ ఖర్చుచేస్తారు… ఆ పార్టీలో ఎవరైతే ఎక్కువ ఖర్చు పెట్టగలరు.. అనే అంశాల గురించి మాత్రమే చర్చిస్తున్నారు. బాగా ఖర్చుపెట్టే అభ్యర్థి పైనే జనాల్లో క్రేజ్ ఉంటోంది. ఓడినా… గెలిచినా… నేతలు రిచ్ కల్చర్ మెయింటైన్ చేయాల్సిందే. అలా ఉండాలంటే.. నేతలు డబ్బు లెక్కలు చూసే వారు అయ్యుండకూడదు. అసలు కాసుల గురించి ఆలోచించకూడదు. ధనం గురించి పట్టించుకోకూడదు. అప్పుడే డబ్బు నీళ్లలా ఖర్చవుతుంది. విజయావకాశాలు పెరుగుతాయి. ఇదే పార్టీల లెక్క. ఈ విషయంలో ఏ పార్టీ కూడా రాజీపడటం లేదు. గెలుపోటముల సంగతి తర్వాత.. టికెట్ కన్ఫామ్ కావాలంటేనే కొన్ని కోట్ల రూపాయలు వెదజల్లాలి. మళ్లీ అధినేతల దగ్గర ఇంత ఖర్చుపెట్టాం.. అంత ఖర్చుపెట్టాం అని నసగటం కూడా పార్టీలకు నచ్చట్లేదు. పదే పదే డబ్బు గురించి చర్చ పెట్టే నేతల్ని దరిదాపులకు కూడా రానియ్యట్లేదు.
ప్రస్తుత రాజకీయాల్లో డబ్బున్న నేతలకున్న ధీమా ఎవరికీ లేదు. ఓటమి ఎరుగని నేతలకు కూడా టికెట్ రాకపోవచ్చు. కులబలం ఉన్నా ప్రయోగం పేరుతో పక్కన పెట్టొచ్చు. లోకల్ అయినా.. నాన్ లోకల్ ను తెరపైకి తేవచ్చు. పార్టీలో సీనియార్టీ ఉన్నా.. టికెట్ కు మాత్రం గ్యారంటీ లేదు. కానీ డబ్బున్నోళ్లకు ఇవేవీ వర్తించవు. వారికి రాచమర్యాదలు చేసి మరీ… పార్టీలు పిలిచి టికెట్ ఇస్తాయి. పక్క పార్టీలో ఉన్నా… పది నిమిషాల్లో కండువా కప్పి సీటిచ్చేస్తారు. చేతిలో డబ్బుందా.. ఆ ఒక్క అర్హత చాలు… ఏదో ఒక టికెట్ అయితే కచ్చితమే. అవసరమైతే ఖరారైన నేతను కూడా మార్చేసి ధనిక నేతలకు టికెట్ ఇచ్చేస్తున్నాయి పార్టీలు.
ప్రస్తుత లోక్‌సభలో గల 539 మంది ఎంపీల్లో 475 మంది కోటీశ్వరులనీ… ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్.. ఎడిఆర్ గతంలోనే నిగ్గు తేల్చింది. ప్రస్తుత శాసన సభ్యుల్లో 87% మంది కోటీశ్వరులు. డబ్బు తప్ప మరేవీ చూసే మూడ్ లో పార్టీలు లేవు. పార్టీల ఆలోచనకు తగ్గట్టుగానే నేతలు కూడా డబ్బు సంచులు తీసుకుని రాజకీయాల్లో దిగిపోతున్నారు. ఇలాంటి నేతల్ని రాజకీయాలంటే ప్రజాసేవ కదా అంటే పగలబడి నవ్వుతున్నారు. మాకలా చెప్పలేదే.. రేటు చెప్పు.. టికెట్ పట్టు అన్నారే అంటున్నారు.
డబ్బే ప్రధానమైన కొలబద్ద కావడంతో ధనవంతులైన అభ్యర్ధుల సంఖ్య ప్రతి ఎన్నికలకు పెరుగుతూ వస్తోంది. 1990-91లో పార్లమెంట్‌లో వ్యాపారవేత్తలు 7.24శాతం ఉంటే 14వ పార్లమెంట్‌లో అది 22.33శాతానికి పెరిగింది. ప్రస్తుత పార్లమెంట్‌లో వారి నిష్పత్తి ఇంకా ఎక్కువగానే ఉంది. అరుదుగా మాత్రమే పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా రంగంలో ఉండేవారు. పరోక్షంగా పార్టీలకు అండనిచ్చే వారు. కానీ ఇప్పుడు కార్పొరేట్‌శక్తులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలే ప్రత్యక్షంగా ఎన్నికల్లో అభ్యర్థులుగానే ప్రవేశిస్తున్నారు. స్థానిక సంస్థల్లో కూడా ఈ మధ్యకాలంలో భూస్వామ్య, ధనిక రైతుల నుంచే కాకుండా కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ఈ కొత్త సంపన్నవర్గాలు సంపదలో భాగమే కాకుండా అధికారంలో కూడా భాగం కావాలన్న కాంక్షతోనే రాజకీయాల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు పార్టీల తీరు చూస్తే.. అసలు రాజకీయాల ఆలోచన లేని ధనవంతుల్ని కూడా పనిగట్టుకుని ప్రోత్సహించి, ప్రేరేపించి టికెట్లిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మన పార్టీ గెలిచినా… ఓడినా మనకు వెయ్యి కోట్లు మిగలాలి అని ఒక యువనాయకుడు ఆఫ్ ది రికార్డులో అన్నాడంటే…మన దేశంలో ఎన్నికలు ఎంత బిగ్ బిజినెస్సో అర్థమవుతుంది.