ఓ వెర్రి అభిమానికి సామాన్యుడి లేఖ డియర్ ఫాన్స్…. ఓ అభిమాన దేవుళ్ళారా …
హీరోల కోసం పడి చచ్చే, హీరోలే జీవితంగా బతికే, ఆ హీరోల కోసం కంఠాలని కూడా కోసుకునే , అప్పులు చేసి ... ఆస్తులు అమ్మి ఆరాధ్య దైవాలకు పాలాభిషే కాలు చేసే.... బుర్ర లేని వెర్రి అభిమానులకు ఓ సామాన్యుడి లేఖ.
హీరోల కోసం పడి చచ్చే, హీరోలే జీవితంగా బతికే, ఆ హీరోల కోసం కంఠాలని కూడా కోసుకునే , అప్పులు చేసి … ఆస్తులు అమ్మి ఆరాధ్య దైవాలకు పాలాభిషే కాలు చేసే…. బుర్ర లేని వెర్రి అభిమానులకు ఓ సామాన్యుడి లేఖ.
ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో, ఆడియో ఫంక్షన్ లో మన హీరోలు మీరంతా ఉబ్బితబ్బిబు అయిపోయే స్టేట్మెంట్ ఇస్తుంటారు. నా ఫ్యాన్స నా బలం…. వాళ్లు లేకపోతే నేను లేను, వాళ్లే నా జీవితం . ప్రేక్షక దేవుళ్ల వలనే మేము ఈ స్థితిలో ఉన్నాం. ఇంకొందరు హీరో లైతే ….రెండు అడుగులు ముందుకేసి…. మిమ్మల్ని వాళ్ళ ఆర్మీతో పోల్చుతారు, మరికొందరు డై హార్ట్ ఫ్యాన్స్ అంటారు. రకరకాలుగా పొగుడుతూ ఉంటారు. మీరంతా చెలరేగిపోయి, చొక్కాలు చింపుకొని వందకు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్లు కొని, మళ్లీ మళ్లీ హీరో గారి సినిమాలు చూసి వాటిని హిట్ చేస్తూ ఉంటారు. బొమ్మ వంద రోజులు ఆడించడానికి నానా తంటాలు పడుతుంటారు. టికెట్లు మీరే కొని… పంచి పెడుతూ ఉంటారు. ఇక కటౌట్లకు పాలాభిషేకాలు…. రక్త తిలకాలు ……ఇవన్నీ ఇప్పటివి కాదులే , 40…50 ఏళ్ల నుంచి
తెలుగు నాట సినిమా పిచ్చోళ్ళ హంగామా జనానికి తెలిసిందే. అయితే ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ ,కృష్ణ, శోభన్ బాబులకు అభిమానులు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు హీరోలకు ఆర్మీ లు తయారయ్యాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అనబడే మీరు హీరోలకు చీప్ లేబర్ లాంటివాళ్ళు. రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ల కోసం ప్రచారం చేసేవాళ్ళు మీరే. హీరోల్ని దేవుళ్ళలాచూస్తూ వాళ్ల కోసం ఎగబడి పోయే వాళ్ళు మీరే . హీరోలు మీకు అప్పుడప్పుడు సెల్ఫీలు ఇస్తూ… స్టేట్మెంట్స్ ఇస్తూ రెచ్చగొడితే చాలు గుడ్డలు చింపుకొని హీరోల కోసం, వాళ్ల సినిమాల కోసం, వాళ్ల ఫ్యామిలీ కోసం గొంతులు కోసుకోవడానికి కూడా మీరు వెనుకాడరూ. ఒకప్పటితో పోలిస్తే ఈ పిచ్చ ….. ఈ సైకో ఫ్యాన్సీ ఇంకా పెరిగింది. హీరోల్ని భగవత్ స్వరూపుడు లాగా చూడడం, హీరోలు ఎక్కడికి వస్తే అక్కడ వేలకొద్దీ పోగుబడిపోవడం, హీరోల కోసం అన్నదానాలు, రక్తదానాలు నిర్వహించడం, మొదటి రోజు టికెట్లు బ్లాక్ లో కొని చూడటం , రిలీజ్ రోజున వేట పోతులు బలి ఇవ్వడం, క్షీరాభిషేకాలు, కటౌట్లు…. బొమ్మ 50 రోజులు .. వంద రోజులు ఆడించడానికి చేతి నుంచి వేల రూపాయలు ఖర్చు పెట్టడం… తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ ఫ్యాన్స్ చేసే అరాచకాలు ఇవి. కేవలం హీరోల వ్యామోహంలో పడి సంసారాలు గుల్ల చేసుకోవడం, చదువుల్ని గాలికి వదిలేయడం…. చివరికి కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, మెకానిక్ లుగా మిగిలిపోవడం ఏ సినిమా హీరో ఫ్యాన్ జీవితం చూసిన ఇదే కథ. సెలబ్రిటీల కోసం ఎగబడిపోయి జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళ కోకోల్లోలు వింటుంటాం.
సినిమా మాయ లో…. హీరోల పిచ్చిలో ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టడం, అందుకోసం లక్షల రూపాయలు అప్పులు చేయడం…. ఇల్లు వాకిలి అమ్ముకోవడం చివరికి బికారులుగా మారడం ఇలా ఎంతో మంది అభిమానులు జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు. హీరోలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోను బంజారాహిల్స్ లోనే ఉంటారు. వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం మురికివాడల్లో, గుడిసెల్లో, మెకానిక్ షెడ్లలో, సింగిల్ రూమ్ గదుల్లో బతికెళ్లదీస్తూ ఉంటారు. ఒక సినిమాకి హీరో ఇవాళ 100 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు. కానీ ఒక అభిమాని రోజుకి 100 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాడు. ఫ్యాన్స్ ని ఉద్దేశించి వాళ్ల వల్లనే బతికిబట్ట కడుతున్నామని, వాళ్ల అభిమానమే తమను బతికిస్తుందని, వాళ్లు మా ఆర్మీ అని, మా డైహార్డ్ ఫ్యాన్స్ అని ఇన్ని కబుర్లు చెప్పే హీరోలు ఫ్యాన్స్ కోసం ఏనాడైనా జేబు నుంచి రూపాయి తీసి ఖర్చు పెడతారా? వాళ్లకు వచ్చిన వందల కోట్ల రూపాయల ఆదాయంలో 30% సొమ్ము ఫ్యాన్స్ కోసం, వాళ్ల సంక్షేమం కోసం ఇస్తారా? ఒక్క విషయం మర్చిపోకండి. వాళ్లు నటులు మాత్రమే. వాళ్లని మనం హీరోలుగా మారుస్తాం. ఆరాధ్య దైవాలను చేస్తాం. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు తాము సినిమాల్లో ఎలా ఉన్నామో, బయట కూడా అలాగే ఉండాలని ఊహించుకుంటారు.
అక్కడే దెబ్బతింటారు. ఒక సినిమా హీరోని ఎందుకు అభిమానించాలి? సినిమా హీరో ఒక పాత్రలో మాత్రమే జీవిస్తాడు. ఆ పాత్ర ముగిసిపోగానే తన బతుకేదో తన బతుకుతాడు. పాత్రను అభిమానించాలి తప్పించి ఆ పాత్ర వేసిన నటులని నిజంగానే హీరోలనుకుంటే మాత్రం ప్రతి ఫ్యాన్ కి చివరికి చిప్ప మిగులుతుంది. ఇండియాలో పేదరికం, నిరక్షరాస్యత, ప్రజల్లో బానిస మనస్తత్వం ఇవన్నీ సినిమా వాళ్లకు బాగా కలిసి వస్తున్నాయి. సినిమా హీరోలు కూడా తమను తాము దైవంశ సంభూతులుగానే భావిస్తున్నారు. లేక పోతే రెండున్నర గంటల సినిమాలో నలుగురిని కొట్టే ఒక హీరో కనిపించగానే వేల మంది జనం ఇలా పిచ్చెక్కిపోయి మీద పడిపోతుంటే మనలో ఎంత బానిస మనస్తత్వం ఉందో అర్థమవుతుంది. ఒక యాక్టర్ నటిస్తే, ఒక హీరోయిన్ అందచందాలను చూపిస్తే 100 రూపాయలు మన డబ్బులు పడేసి చూసి వచ్చే సినిమాకి…. మనం బానిసలుగా మారిపోతున్నాం.
ఇదేం ఘోరం…. ఇదేం అరాచకం.? సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో చూడడానికి అల్లు అర్జున్ వస్తే అతగాడిని చూడడానికి వేల మంది తరలివచ్చారు. బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరూ 3000 రూపాయలు టికెట్ పెట్టుకుని అల్లు అర్జున్ చూడడానికి వచ్చారు. ఆ తొక్కిసలాటలో ఒక కుటుంబంలో తల్లి చనిపోయింది. ఆమె కొడుకు 14 ఏళ్ల శ్రీ తేజ బతుకులు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇందుకు కారణమైన అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో 500 కోట్ల విలువ చేసే తన ఇంట్లో విలాసంగా స్విమ్మింగ్ చేసుకుంటున్నాడు. భార్యా పిల్లలతో కులాసాగా దిలాసగా బతుకుతున్నాడు. నిజానికి సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఆ తల్లిదండ్రులు కూడా పొరపాటే. పిల్లల్ని వెంటబెట్టుకుని సినిమా మొదటి రోజు బెనిఫిట్ షో సమయంలో అల్లు అర్జున్ ని చూడాలని కుటుంబం మొత్తం ఎగబడటం ఎంత సైకో ఫ్యాన్సీ మనస్తత్వం? ఇదా మీరు పిల్లల్లో చూడాల్సింది? వాడెవడో ఆవారా హీరో గాడిని చూడడానికి ప్రాణాలకు తెగించి జనంలో నలిగిపోతున్నారంటే ఈ జనరేషన్ ఎంతగా వెనకబడిందో అర్థమవుతుంది. అందుకే ఫ్యాన్స్ అనేవాళ్ళు హీరోల దృష్టిలో నిజానికి ఒక వెర్రి పుష్పాలు. మీరే మాకు దిక్కు, మీ వల్లే మేము ఇలా ఉన్నాం, మీరు మా ఆర్మీ అని అనగానే వీళ్లంతా గుడ్డలు చింపుకొని…. ఇంట్లో చెంబులు, ముంతలు కూడా అమ్ముకొని హీరోల కోసం సినిమాలు చూస్తుంటారు.
వీళ్ళ రక్తం …చెమట…. టికెట్ల రూపంలో పిండుకుంటారు నిర్మాతలు ,హీరోలు. ఏ హీరో అయినా ఎన్నడైనా ఒక్క సినిమా అభిమాని గురించి ఆలోచించాడా? హీరోలు… హీరోయిన్లు నిర్మాతలు కోట్ల రూపాయల విలువైన ఇళ్లల్లో ఎందుకుంటారు? మనం ఎందుకు మురికివాడలో…. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో… పూరి గుడిసెల్లో బతకాలి? మన బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? జనం డబ్బు మీద సినిమా వాళ్లు వేల కోట్లకు అధిపతులు అవుతున్నారు. వాళ్లని అభిమానించి… మీ జీవితాలను భవిష్యత్తును అగమ్య గోచరం చేసుకుంటున్నారు అభిమానులు. నీ అభిమానం సినిమా వరకే ఉండాలి తప్ప…. హీరో ఫైకాదు. హీరోల పిల్లలు మళ్లీ హీరోలు అవుతున్నారు…. కానీ అభిమానుల పిల్లలు మాత్రం ఆటో డ్రైవర్లుగా, రిక్షా పుల్లర్లుగా, మెకానికులుగా , తాపీ మేస్త్రులుగా మిగిలిపోతున్నారు. ఎందుకని? ఎప్పుడైనా ఆలోచించారా? సినిమా హీరో కటౌట్ కి క్షీరాభిషేకం చేస్తే మీ కొరిగేది ఏంట్రా పిచ్చి వెధవల్లారా? పెళ్ళాం పుస్తెలుతాడు కూడా అమ్మి ,అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజున వేట పోతుల్ని బలిస్తున్నామని సంబరపడిపోతున్నారు తప్ప ఈ మత్తులో మీ కుటుంబాన్ని బలి చేసుకుంటున్నామని ఎన్నడైనా ఆలోచించారా? చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి హీరోల కు మీరు ఎవరో తెలుసా? అసలు మీరెవరో వాళ్ల గుర్తు పడతారా? మీలో ఒక్కరినైనా ఒక హీరో గుర్తుపట్టి పేరుతో పిలవగలడా?
ఇంట్లో పూట తిండి లేకపోతే ఏ హీరో అయినా వచ్చి మీకు అన్నం పెడతాడా? మీ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేక బడి మాన్పించి కూలి పనులకు పంపుతుంటే…. ఏ ఒక్క హీరో అయినా వచ్చి మీ బతుకులు బాగు చేస్తాడా? మరి ఆ హీరో కోసం మీరు ఎందుకు ఎగబడాలి? మీకు వ్యక్తిగత జీవితాలు లేవా? మీ జీవితం మీద మీకు గౌరవం లేదా? మీ బతుకులు మీరు బాగు చేసుకోరా? హీరో గాడి సినిమా… థియేటర్ కి వెళ్లి ఒకసారి చూడండి. బాగుంటే మరోసారి చూడండి. అంతేకానీ చేతి వాచీలు తాకట్లు పెట్టి హీరో గాడి కోసం సంబరాలు చేయకండి. మీ పిల్లల బతుకులు నాశనం చేయకండి. మీ భార్యలకు కన్నీళ్లు మిగిల్చకండి. హీరోని నమ్ముకుని బాగుపడిన ఒక్క అభిమాని కూడా చరిత్రలో లేడు. కానీ అభిమానులు నమ్ముకొని వేలకోట్లకు ఎదిగిన హీరోలు చాలామంది చరిత్రలో ఉన్నారు. సినిమాని సినిమాలా చూడండి. వాళ్లు తెరపై మాత్రమే హీరోలు నిజజీవితంలో జీరోలు. సినిమాలో పోలీస్ స్టేషన్ ని కొనేసిన పుష్ప ఇప్పుడు అన్ని మూసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో బెంచి మీద కూర్చున్నాడు. తగ్గేదేలే అంటే పోలీసులు తోలు తీస్తారు. కొన్ని గంటలు పాటు అల్లు అర్జున్ అనే వాడిని జైల్లో పెడితే…. వాడికి ప్యాంటు తడిసిపోయింది. అది అతగాడి హీరోఇజం. అంత పెద్ద హీరోని ఓదార్చడానికి టాలీవుడ్ అంతా కదిలి రావాల్సి వచ్చింది.
అల్లు అర్జున్ నీ చూడడానికి ఎగబడి…. బౌన్సర్ల కాళ్ళ కింద నలిగిపోయి, చనిపోయిన రేవతి అనే మహిళ కుటుంబాన్ని , అల్లు అర్జున్ ని పరామర్శించిన హీరోల్లో ఒక్కడు కూడా వెళ్లి పరామర్శించలేదు. చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పడి ఉన్న శ్రీ తేజను ఈ హీరోల్లో ఒక్కడు వెళ్లి ఎలా ఉన్నావని అడగలేదు. ఆ కుటుంబానికి పది రూపాయలు కూడా చేతిలో పెట్టలేదు. ఇది వీళ్ళ నిజాయితీ. అల్లు అర్జున్ అనే ఐదు అడుగుల అతిగాడిని చూడ్డానికి ఇద్దరు పిల్లల్ని, అనారోగ్యంతో ఉన్న మొగుడ్ని వెంటపెట్టుకొని సంధ్యా థియేటర్ కి వెళ్ళింది ఆ మహాతల్లి. చివరికి ఆ కుటుంబం దిక్కులేంది అయిపోయింది ఇప్పుడు. నిర్మాతలు హీరోలు వందల కోట్లు లెక్క పెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. మహా అయితే పాతిక లక్షలు ఆ కుటుంబం మొహాన విసురుతారు. రేపటి నుంచి వాళ్లని ఎవరు పట్టించుకోరు. ఇలాంటి రేవతి కథలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో వందలు ఉన్నాయి. హీరోల మాయలో సినిమాల పిచ్చిలో బ్రష్టు పట్టిపోయిన జీవితాలు కో కోకొల్లలు ఉన్నాయి.
ఒక సినిమాతో ఒక పాత్ర అయిపోతుంది. మరో సినిమా లో మరో పాత్రలోకి వెళ్ళిపోతాడు హీరో. మూడు నెలలకు ఒక పాత్ర వేసుకుంటూ నిత్యం నటిస్తూ బతికే వాళ్ళ కోసం మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారు? మీ పెళ్ళాం పిల్లల కన్నీళ్లు… ఆకలితో వాళ్ళు పెట్టే ఆక్రందనలు మీకు వినిపించడం లేదా? ఏ హీరో అయినా తన అభిమానిని ఇంటికి పిలిచి భోజనం పెట్టిన సందర్భాలు ఉన్నాయా? అలాంటి అరుదైన ఘటన మీరు ఎప్పుడైనా చూశారా? మరి ఎందుకు ఈ హీరో కానీ జీరో ల కోసం మీ తపన.? ఎందుకు వీళ్ళ కోసం మీ జీవితాలు తగలబెట్టుకుంటారు? మీ భార్య పిల్లల కోసం ఆలోచించండి. మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించండి. మీ చదువులు కోసం కష్టపడండి. మీ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. విలువైన సమయాన్ని రేపటి కోసం ఆయుధంగా మార్చుకోండి. ఈ పనికిమాలిన హీరోలు, మీరు ఎవరో తెలియని సెలబ్రిటీల కోసం మీరెందుకు జీవితాన్ని హారతి కర్పూరం చేసుకుంటారు?. ఎందుకు ఇలా తొక్కిసలాటలో నలిగిపోతారు. చివరికి ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు? అభిమానుల పైన.. ఫ్యాన్స్ పైన ఈ హీరోలకి అంత ప్రేమ ఉంటే వాళ్లు సంపాదించిన వందల కోట్ల పారితోషికాల్లో సగం ఫ్యాన్స్ కోసం ఖర్చు పెట్టమనండి.
ఆ వందల కోట్ల డబ్బుని ఫ్యాన్స్ కుటుంబాలు.. పిల్లల బాగు కోసం వెచ్చించమని చెప్పండి. అప్పుడు వీళ్ళ నిజస్వరూపాలు తెలుస్తాయి. అంతేగాని ఎవడో హీరో కోసం…. మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. పదేళ్లు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక హీరో రెమ్యూనరేషన్ 100 కోట్లు అవుతుంది. మీరు మాత్రం సింగిల్ రూమ్ ఇంట్లోనే ఉంటారు. అదే సైకిలు ,అదే బైకు నడుపుతుంటారు. మొదటి సినిమాకి టేబుల్ ఫ్యాన్ ని రెమ్యూనరేషన్ గా తీసుకున్న చిరంజీవి ఈరోజు మీ పుణ్యాన్న వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. తొలి సినిమాలో ట్రాన్స్ జెండర్ లా మనకి కనిపించి అల్లు అర్జున్ ఇప్పుడు ఏకంగా పుష్పా కి 300 కోట్ల రూపాయలు వాటాగా తీసుకున్నడంట. వీళ్ళని పిచ్చిగా ఆరాధించి… వాళ్ల కోసమే బతికే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సినిమాను సినిమాలా చూడండి. అంతేగాని సైకో ఫ్యాన్సీ మత్తులో హీరోలను దేవుళ్ళుగా చూస్తే మీరు దరిద్రులుగా మిగిలిపోవడం ఖాయం.