తెలంగాణ బీజేపీకి ఏమైంది..? ( వ్యూహమా..? వ్యూహాత్మక తప్పిదమా..?)
తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ హైడ్రా... కాంగ్రెస్ సర్కార్ కాస్త వెనకడుగు వేసినా జనంలోని అనుమానాన్ని తనవైపు తిప్పుకుంటూ బీఆర్ఎస్ చెలరేగిపోతోంది. కారు నేతలంతా మూసీ చుట్టు ప్రదక్షిణలు చేస్తూ హస్తాన్ని మురికినీటిలో ముంచడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇంత కీలకమైన సమయంలో తెలంగాణ బీజేపీ కాడి వదిలేసింది. మధ్యలోకి నన్ను లాగొద్దన్నట్లుంది కమలం నేతల తీరు.
తెలంగాణ బీజేపీ నిద్రపోతోందా… నిద్ర నటిస్తోందా…?
అందివచ్చిన అవకాశాన్ని నేలపాలు చేస్తోందా…?
బీఆర్ఎస్ దూసుకుపోతుంటే బీజేపీ సైలెంట్ అయ్యిందెందుకు…?
హైడ్రా మంటలు రగులుతున్న చోట రైతుదీక్ష లేంటి…?
ఇది వ్యూహామా లేక వ్యూహాత్మక తప్పిదమా…?
కాంగ్రెస్ పై పోరులో ఎందుకు వెనకబడింది…?
బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందమే కారణమా…?
తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ హైడ్రా… కాంగ్రెస్ సర్కార్ కాస్త వెనకడుగు వేసినా జనంలోని అనుమానాన్ని తనవైపు తిప్పుకుంటూ బీఆర్ఎస్ చెలరేగిపోతోంది. కారు నేతలంతా మూసీ చుట్టు ప్రదక్షిణలు చేస్తూ హస్తాన్ని మురికినీటిలో ముంచడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇంత కీలకమైన సమయంలో తెలంగాణ బీజేపీ కాడి వదిలేసింది. మధ్యలోకి నన్ను లాగొద్దన్నట్లుంది కమలం నేతల తీరు.
తెలంగాణలో కాంగ్రెస్ తెలిసో తెలియకో రాజేసిన హైడ్రా నిప్పు దావానలంలా మారింది. అది తమనే ఎక్కడ దహిస్తుందో అని ఇప్పుడు హస్తం నేతలు వణికిపోతున్నారు. బుల్ డోజర్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పేదల జోలికి వెళ్లం మమ్మల్ని నమ్మండి అని నమ్మించడానికి నానా కష్టాలు పడుతున్నారు. అయితే హైడ్రా రేపిన భయం మాత్రం జనంలో పాతుకుపోయింది. ప్రతిపక్షాలుగా ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ అందిపుచ్చుకుంది. జనంలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కమలనాథులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. పోరాటం చేయాల్సిన చోట వట్టి మాటలతో సరిపెడుతున్నారు. బీజేపీ నేతల తీరు పార్టీ కేడర్ కు కూడా అర్థం కావడం లేదు. మిస్సైళ్లలా బుల్ డోజర్లపై పేలాల్సింది పోయి వర్షంలో తడిసిన తారాజువ్వల్లా తుస్సుమంటున్నారు.
హైడ్రా యాక్షన్ స్టార్ అయినప్పుడు బీజేపీ కూల్చివేతలకు మద్దతు పలికింది. బీఆర్ఎస్ కూడా కేవలం మాటలతో సరిపెట్టింది. అయితే కాంగ్రెస్ బుల్ డోజర్లు మూసీ దిశగా వెళ్లడం మొదలెట్టాయో అప్పుడే సీన్ మారిపోయింది. సామాన్యులను రోడ్డున పడేస్తున్నారన్న ఆందోళన రేగింది. బాధితుల భయం జనం భయంగా మారిపోయింది. రేపు మనదాకా వస్తారేమోనన్న బీపీ పెరిగిపోయింది. ఇంత మంచి అవకాశాన్ని ప్రతిపక్షాలుగా వాడుకోవాల్సిన అవసరం బీజేపీ, బీఆర్ఎస్ లపై ఉంది. జనంలో కాంగ్రెస్ పై పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన గులాబిదళం రోడ్డెక్కింది. మూసీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. మేమున్నాం అని హామీలు ఇస్తోంది. బాధితులతో మాట్లాడిస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సర్కార్ ను ఇరకాటంలోకి నెడుతున్నారు. మీ ఇంటిముందు మేముంటాం… బుల్ డోజర్లు వస్తే మమ్మల్ని దాటి వెళ్లాలి అంటూ పెద్దపెద్ద డైలాగులే చెబుతున్నారు. అసలు టైమ్ కు వారెక్కడుంటారో తెలియదు కానీ అవకాశాన్ని మాత్రం చక్కగా క్యాష్ చేసుకున్నారు. కానీ బీజేపీ మాత్రం రేసులో పూర్తిగా వెనకబడిపోయింది. ఒకరిద్దరు తప్ప కలసికట్టుగా యాక్షన్ లోకి దిగింది లేదు. పార్టీ పెద్దలతో సంబంధాలున్నాయన మౌనముద్రలో ఉన్నారు. నా పేదలు అన్న నేత కనిపించడం లేదు… లాజిక్కులు లాగే నేత దీనిపై కేసు వేయడానికి కూడా ఇష్ట పడటం లేదు…
ఓ చిన్న వివాదం రాజుకుంటే చాలు…మన నేతలకు కోతికి కొబ్బరికాయ దొరికినట్లే… కానీ బీజేపీ మాత్రం హైడ్రాపై ఎందుకో మౌనమే నా భాష అంటోంది. ఈటల లాంటి ఒకరిద్దరు అక్కడక్కడా తిరిగారు. కానీ ఇద్దరు కేంద్రమంత్రులు, 8మంది ఎంపీలు, 8మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు. హైడ్రా సామాన్యుల జోలికి వెళ్లొద్దంటూ మీడియాతో నాలుగు ముక్కలు మాట్లాడటం మినహా మరేం చేయలేదు. మేమున్నామంటూ జనానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
నిజానికి బీజేపీ అంటే అర్బన్ పార్టీ అనే ముద్ర ఉంది. గత GHMC ఎన్నికల్లో సత్తా చాటింది. మళ్లీ గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో హైడ్రా పేరుతో అంది వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటోందన్నదే ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాని ప్రశ్న. బీజేపీ నేతలకు సరైన దిశానిర్దేశం ఉందా లేదా అన్నది పెద్ద డౌట్. మొదట్లో హైడ్రాను సమర్ధించాం కాబట్టి ఇప్పుడు సైలెంట్ గా ఉంటే సరిపోతుంది అనుకున్నారో లేక దీనిపై పెద్దగా స్పందించవద్దని హైకమాండ్ చెప్పిందో లేక అందరినీ ఏకతాటిపై నడిపే నాయకుడు లేడో లేక ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.
ఇక్కడ మరో అనుమానం కూడా రేగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందన్న అనుమానాలు బలంగానే ఉన్నాయి, గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ సాయపడిందన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు కూడా తన పార్ట్నర్ బీఆర్ఎస్ కు మొత్తం క్రెడిట్ దక్కేలా తను సైలెంటవుతోందా అన్న అనుమానం కూడా వస్తోంది. అప్పుడు కారు సాయానికి ఇప్పుడు కమలం ఇలా సాయం చేస్తోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్ లో గట్టిగానే తిరుగుతున్నాయి. ఉత్తరాదిలో కమలం హవా రోజురోజుకు తగ్గుతోంది. దీంతో అక్కడిపై ఫోకస్ పెట్టిన హైకమాండ్ తెలంగాణపై అంతగా దృష్టి పెట్టడం లేదు. పైగా ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు. పైగా తెలంగాణలో కాంగ్రెస్ ను ఢీకొట్టే పరిస్థితిలో ప్రస్తుత బీజేపీ లేదు. అలా జరగాలంటే చాలా ఫోకస్ పెట్టాలి. అంత టైమ్ హైకమాండ్ కు లేదు. దీంతో ఢిల్లీ మనది రాష్ట్రం మన మిత్రపక్షానిది అన్నట్లుంది బీజేపీ పెద్దల తీరు.
అన్నిటికంటే నవ్వొచ్చే విషయం ఏమిటంటే బీజేపీ నేతల రైతు దీక్ష. బీఆర్ఎస్ ఇప్పటికే ఆ అంశాన్ని వాడి వాడి వదిలేసింది. లేటెస్ట్ గా హైడ్రా ఎపిసోడ్ ను రైట్ టైమ్ లో అందుకుంది. కానీ కమలనాథులు మాత్రం ఆ పాత పచ్చడిని పట్టుకుని బీజేపీ నేతలు దీక్షకు దిగారు. దాన్ని మీడియా తప్ప ఎవరూ పట్టించుకోలేదన్నది వారికి కూడా తెలుసు. కానీ ఏదో చేశామంటే చేశామని చెప్పుకోవడానికి అన్నట్లుంది వారి తీరు.
మొత్తంగా చూస్తే తెలంగాణపై బీజేపీ పెద్దలు ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. మరి ఇది వ్యూహమో లేక వ్యూహాత్మక తప్పిదమో కాలమే తేలుస్తుంది.
END