Top story: లైఫ్ లో చంద్రబాబు చేసిన 10 తప్పులు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి 75 ఏళ్లు నిండాయి. ఈ 75 ఏళ్లలో 50 ఏళ్లు రాజకీయాలతోనే గడిచిపోయాయి. యూనివర్సిటీ రాజకీయాలు నుంచి నేషనల్ పాలిటిక్స్ వరకు తనదైన ముద్ర వేసుకున్న బాబు జీవితమే రాజకీయంగా....

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2025 | 09:30 PMLast Updated on: Apr 22, 2025 | 9:30 PM

10 Mistakes Chandrababu Made In Life

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి 75 ఏళ్లు నిండాయి. ఈ 75 ఏళ్లలో 50 ఏళ్లు రాజకీయాలతోనే గడిచిపోయాయి. యూనివర్సిటీ రాజకీయాలు నుంచి నేషనల్ పాలిటిక్స్ వరకు తనదైన ముద్ర వేసుకున్న బాబు జీవితమే రాజకీయంగా…. రాజకీయాలే జీవితం గా బతికారు. రాజకీయ మనుగడ కోసం ఎత్తులు జిత్తులు… వ్యూహాలు కుట్రలు.. కుతంత్రాలు… తెర వెనక యంత్రాంగాలు , మంత్రంగాలు ఎన్నో చేశారు.ఏం చేసినా అది రాజకీయం కోసం…. అధికారం కోసం… మాత్రమే. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసిన తప్పులు ఏంటి?ఆయన సక్సెస్ వెనక కనిపించని మరకలేమిటి చూద్దాం.

వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎం ఏ ఎకనామిక్స్ , చదువుతూ యూనివర్సిటీ రాజకీయాలతో పొలిటికల్ లైఫ్ మొదలుపెట్టిన బాబు
1978లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.1980 లోనే ఆయన ఎమ్మెల్యే అయిన మూడేళ్లకే మంత్రి అయ్యారు. యువ కమ్మ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలి అది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో…. ఆ పదవి కోసం కాంగ్రెసులో కరణం బలరామకృష్ణ, చంద్రబాబు నాయుడు పోటీపడ్డారు. ఏం మాయ చేశాడో తెలియదు…. గతంలో రౌడీ షీట్ ఉందని నెపంతో కరణం బలరామకృష్ణయ్యకు నిరాకరించి ,చంద్రబాబుకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ తర్వాత కరణం బలరాం మళ్లీ జీవితంలో మంత్రి కాలేకపోయాడు. చంద్రబాబు నాయుడు మాత్రం లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.1983 లో కాంగ్రెస్ తరపున చంద్రగిరిలో పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత 1984 లో మామగారు పార్టీ టిడిపిలో లేటుగా చేరాడు చంద్రబాబు.1985 నుంచి ఈరోజు వరకు మళ్లీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు సిబిఎన్.

అయితే ఇంత అన్ స్టాపబుల్ కెరీర్లో చంద్రబాబు కొన్ని దారుణమైన తప్పులు చేశాడు. అపర చాణక్యుడు అని పేరు పడిన బాబు అవసరాల కోసమో, గెలుపు కోసమో కొన్ని తప్పులు చేశాడు. పొలిటికల్ కెరీర్ లో ఆయన ఎంత ఎత్తుకు ఎదిగిన ఇప్పటికీ ఆ మరకలు పోలేదు.1995 ఆగస్టు లో సొంత మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి… తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని చంద్రబాబు కైవసం చేసుకున్నాడు.ఇందుకోసం కోర్టుల్ని, మీడియాని కూడా ప్రలోభాలతో ఆకట్టుకుని ఎన్టీఆర్ ను దారుణాతి దారుణంగా వంచించాడు. పరోక్షంగా చంద్రబాబు ఎన్టీఆర్ మరణానికి కారణం అయ్యాడు. చంద్రబాబు చేసిన ఈ మొదటి తప్పు ఇప్పటికీ ఆయన్ని వెన్నాడుతూనే ఉంది.

1999లో ఆయన తన నాయకత్వంలో మరోసారి టిడిపిని జనం గెలిపించారు. దాంతో ఎన్టీఆర్ చరిష్మాని తుడిచేయగలిగారు. ఐటీ, అర్బన్ డెవలప్మెంట్ పై విపరీతంగా ఫోకస్ చేశారు. ఈ ఊపులో ఆఫ్ ద రికార్డు ఒకసారి వ్యవసాయం దండగ అని ఆయన అన్న మాటలు ఈరోజుకి ఆయనకు ఒక రిమార్క్ లా నిలిచిపోయాయి. ఎన్ని చేసినా ఇప్పటికీ చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేకి అనే ముద్రే ఉంది. వ్యవసాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం చంద్రబాబు రెండో తప్పు.

1999లో చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యాక ఇప్పటి బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ కి మంత్రి పదవి ఇవ్వలేదు. కెసిఆర్ కి పోటీగా వెలమ కులస్తుడైన సి బి ఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావునీ తీసుకొచ్చి ఏకంగా మంత్రిని చేశాడు బాబు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో చంద్రశేఖర రావు 2000 సంవత్సరంలో ఏకంగా టి ఆర్ ఎస్ పార్టీని పెట్టి… ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లేవదీశాడు. కెసిఆర్ కు ఆరోజు మంత్రి పదవి ఇచ్చి ఉంటే, అసలు తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు, రాష్ట్రం విడిపోయేది కాదు. చంద్రబాబు చేసిన తప్పు రాష్ట్రం విడిపోవడానికి పరోక్షంగా కారణమైంది. కెసిఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆయన మూడో తప్పు.

2003 సెప్టెంబర్ లో చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు ల్యాండ్ మైన్ ఎటాక్ చేశారు. ఆ దుర్ఘటన నుంచి బాబు ప్రాణాలతో బయటపడ్డారు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో కూడా చంద్రబాబుకు కుటిల ఆలోచన వచ్చింది. కొందరి దిక్కుమాలిన సలహాపై , తనకు సానుభూతి కలిసి వస్తుందని ఆశించి ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకి వెళ్లారు. చంద్రబాబు భ్రమలో కేంద్రంలో వాజ్పేయి తో పాటు మరికొందరు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఒక్క నితీష్ కుమార్ మినహాయించి అందరూ ఓడిపోయారు. ఏపీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. సానుభూతి కలిసొస్తుందని ఆశతో తాను ప్రభుత్వాన్ని రద్దు చేసి పెద్ద తప్పు చేశానని చంద్రబాబు చాలాసార్లు అంగీకరించారు. చంద్రబాబు చేసిన నాలుగో తప్పిది.

2009లో కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి కూటమి కట్టారు చంద్రబాబు. ఏ కెసిఆర్ అయితే విభేదించాడో అదే కేసీఆర్ ని కూటమిలో కలుపుకున్నాడు. వామపక్షాలు కూడా కలిశాయి. కానీ అదే సంవత్సరం పిఆర్పి పెట్టిన చిరంజీవి మాత్రం విడిగా పోటీ చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగే అప్పుడు చిరంజీవిని చంద్రబాబు కలుపుకొని ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోయేది. చిరంజీవిని వదిలేసి కూటమి కట్టి పరోక్షంగా కాంగ్రెస్ని గెలిపించాడు చంద్రబాబు. ట్రయాంగిల్ ఫైట్ లో కాంగ్రెస్ బయటపడిపోయింది. చిరంజీవి దారుణంగా దెబ్బతిని పిఆర్పి ని క్లోజ్ చేసుకున్నాడు. చిరంజీవిని కలుపుకోలేకపోవడం బాబు చేసిన ఐదో తప్పు..

రాజశేఖర్ రెడ్డి మరణించాక తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పడం మొదలుపెట్టారు. 2012లో టిడిపిలో తెలంగాణ నాయకుల ఒత్తిడితో రాష్ట్ర విభజనను అంగీకరిస్తూ సంతకం పెట్టి చంద్రబాబు స్వయంగా కేంద్రానికి లేఖ పంపారు. తాను తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ….. కాంగ్రెస్ ఇవ్వదని బాబు భ్రమలో ఉండేవారు. చంద్రబాబు లేఖ రావడం ఆలస్యం ,కాంగ్రెస్ దానిని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని విభజన చేసింది. తెలంగాణ విభజనకు పరోక్షంగా చంద్రబాబే కారణం. చంద్రబాబు తెలిసి చేసిన ఆరోతప్పిది. చంద్రబాబు ఆనాడు సంతకం పెట్టకుండా ఉండి ఉంటే ఆ నెపంతో కాంగ్రెస్ రాష్ట్ర విభజన వాయిదా వేసుండేది.2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యేవారు.

అధికారం సంపాదించడం ముఖ్యం. అది ఏ దారిలో అయినా తప్పులేదు అనేది చంద్రబాబు సిద్ధాంతం.2015 లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం కోసం ఇప్పటి ముఖ్యమంత్రి ,అప్పటి టిడిపి నేత రేవంత్ రెడ్డి తో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ నీ కొనడానికి 50 లక్షల రూపాయల క్యాష్ పంపించారు చంద్రబాబు. ఆ క్యాష్ తో స్టీవెన్ సన్ ఇంట్లో అడ్డంగా దొరికిపోయాడు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఫోన్లో స్టీవెన్సన్ తో మాట్లాడుతూ చంద్రబాబు కూడా దొరికిపోయాడు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. అయితే కెసిఆర్ తో రహస్య ఒప్పందం మేరకు హైదరాబాద్ ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు చంద్రబాబు. దీనివల్ల పదేళ్లపాటు హైదరాబాద్ పై ఏపీకి హక్కు ఉన్నప్పటికీ సీఎం తరలిపోవడంతో కోల్పోయారు ఏపీ వాళ్ళు. కక్కుర్తి రాజకీయాల కోసం చంద్రబాబు చేసిన ఏడో తప్పిది.

2014లో రాష్ట్రం విడిపోయాక బిజెపి, పవన్ కళ్యాణ్ సహకారంతో చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యారు. పోయిన తెలంగాణని తిరిగి తెచ్చుకోవాలని ఆతృతలో విలువలకు తిలోదకాలు ఇచ్చి తన రాజకీయ ఆజన్మాంత శత్రువు అయిన కాంగ్రెస్ తో కలిసి తెలంగాణలో పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్తో చంద్రబాబు కలవడం ఎవ్వరు ఊహించనిది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, నాయకుడు కానీ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలా ఎవ్వరితోనైనా అంట కాగలిగే శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందనేది అర్థమైంది. మేధావి అనుకున్న చంద్రబాబు ఇక్కడే పప్పులో కాలేశాడు. చంద్రబాబు మళ్ళీ తెలంగాణ లో అడుగు పెట్టాడని నినాదం ఇచ్చి కెసిఆర్ టిఆర్ఎస్ ని రెండోసారి గెలిపించుకున్నాడు. చంద్రబాబు చేసిన అతి దారుణమైన ఎనిమిదో తప్పు తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం.

2014లో ఏపీలో బిజెపితో కలిసి పోటీ చేసి 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి బరిలో దిగాడు చంద్రబాబు. దీంతో అక్కడ బిజెపి దూరమైంది. తెలివిగా ఏపీకి ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకొని, బిజెపితో తెగ తెంపులు చేసుకొని మోడీని బండబూతులు తినడం మొదలుపెట్టారు చంద్రబాబు. నరేంద్ర మోడీ శక్తిని ,బిజెపి బలాన్ని అంచనా వేయలేకపోవడం బాబు చేసిన తప్పు.2014లో తనను గెలిపించిన పవన్ కళ్యాణ్ ని అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేశారు చంద్రబాబు. అంతేకాదు టిడిపి సోషల్ మీడియా, టిడిపి ప్రాయోజిత మీడియా సహకారంతో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని డామేజ్ చేశారు. అప్పట్లోనే శ్రీ రెడ్డి, కత్తి మహేష్ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసింది మొదట టిడిపినే.2019లో టిడిపి ఓటమికి ,నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ నీ దూరం చేసుకోవడమే కారణం. చంద్రబాబు చేసిన తొమ్మిదో తప్పిది.

2014లో ముఖ్యమంత్రి అయ్యాక లోకేష్ ని ఎంఎల్సి చేసి మంత్రి పదవి ఇచ్చేశాడు చంద్రబాబు. తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ ని ఎలా అయితే సిద్ధం చేసుకుంటున్నా డో తాను లోకేష్ ని అలా తయారు చేసుకోవాలనుకున్నాడు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా దొడ్డిదారిన లోకేష్ ని మంత్రిని చేశాడు. అదే ఊపులో లోకేష్ చేసిన అవినీతి కార్యక్రమాలు చంద్రబాబు ఇమేజ్ ని దెబ్బ తీశాయి. ప్రధాని మోడీ లాంటివాడు నేరుగా లోకేష్ అవినీతిని స్వయంగా ఎత్తి చూపించాడు అంటే ఈ విషయం ఎంతగా జనంలోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు చేసిన పదో తప్పు అనుభవం లేని లోకేష్ కి పవర్స్ ఇవ్వడం.

అయితే తాను చేసిన పొరపాట్లను త్వరగా గుర్తించడం కూడా చంద్రబాబు లో ఉన్న గొప్ప లక్షణం. అందుకే 2024 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ని, మోడీని తిరిగి కలుపుకొని అఖండ విజయం సాధించారు బాబు. అయితే ఎంత గొప్ప మేధావి అయినా ఎక్కడో చోట తప్పులు చేస్తూనే ఉంటారని చంద్రబాబు జీవితమే ఒక ఉదాహరణ. చంద్రబాబు చేసిన కొన్ని పొరపాట్లు తెలుగు రాష్ట్రాల చరిత్ర గతినే మార్చేశాయి. చాలా చారిత్రాత్మక సంఘటనలకు పరోక్షంగా చంద్ర బాబు బాధ్యత ఉంది.