ఇండియాకు 205 మంది అక్రమ వలసదారులు అమెరికాలో కొనసాగుతున్న బహిష్కరణ ఆపరేషన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...పుష్ఫ డైలాగ్ చెబుతున్నారు. తగ్గేదే లే అంటూ...కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైనే ఫోకస్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…పుష్ఫ డైలాగ్ చెబుతున్నారు. తగ్గేదే లే అంటూ…కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైనే ఫోకస్ చేశారు. ఇందులో ముఖ్యంగా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న విదేశీయుల భరతం పడుతున్నారు. బేడీలు వేసి…వారి స్వదేశాలకు పంపుతున్నారు. నిన్న మొన్నటి వరకు గటేమాలా, పెరు, హోండూరస్ దేశస్తులను పంపిన ట్రంప్…తాజాగా భారతీయులను పంపించేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…నేను మొనార్క్ అంటున్నారు. నన్నెవరు ఏం చేయలేరనేలా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చినట్లు…వాటిని అమలు చేసి చూపిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అక్రమ వలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠిన చర్యలు చేపడుతున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ వలసదారుల గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. వలసదారులకు బేడీలు వేసి విమనాల్లో తరలించడంపై ఆయా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
తాజాగా భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను… సీ17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో అక్రమ వలసదారులను తరలిస్తున్నారు. అమెరికాకు చెందిన ఈ మిలటరీ విమానం భారత్‌కు బయలుదేరింది. ఎంత మంది వలసదారులను తరలిస్తున్నారనే విషయంపై కచ్చితమైన సమాచారం లేదు. అయితే 200 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి వస్తున్న వలసదారుల విమానం…24 గంటల్లో ఇండియాకు చేరుకోనుంది. 7 లక్షల 25వేల మందికిపైగా భారత్‌కు చెందిన వలసదారులు…అమెరికాలో సరైన ధ్రువపత్రాలు లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 18వేల మందిని భారత్‌కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. అమెరికాలో మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులేనని అమెరికా ప్రభుత్వం తేల్చింది.
అక్రమ వలసదారుల విషయంలో అమెరికా వైఖరిని…భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
తొలుత 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఎల్ పాసో, టెక్సాస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించనుంది. ఇప్పటికే పెరు, హోండూరస్, కొలంబియా, బ్రెజిల్ తదితర దేశాలకు అమెరికా విమానాల్లో పలువురు వలసదారులను తరలించింది. ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు పెడుతోంది. గతవారం గటెమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అగ్రరాజ్యం…సుమారు 4,675 డాలర్లను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత మందిని వెనక్కి తిప్పి పంపించారో ఐసీఈ చెప్పలేదు. అదే బైడెన్ కాలంలో 12 నెలల వ్యవధిలోనే 2,70,000 కంటే ఎక్కువ మందిని వెనక్కి పంపినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో, ఎల్‌పాసోల్లో 1,500 మంది సైనికులను అమెరికా మోహరించింది.