Eknath Shinde: షిండేకు పదవీ గండం.. తిరుగుబాటుకు సిద్ధమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మరో మహా సంక్షోభం తప్పదా?
బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం ఏక్‌నాథ్ షిండేపై ఆ వర్గానికి చెందిన శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని శివసేన అధికార పత్రిక సామ్నా వెల్లడించింది. ఈ కథనం ప్రకారం.. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది.
Eknath Shinde: మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం ఏక్‌నాథ్ షిండేపై ఆ వర్గానికి చెందిన శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని శివసేన అధికార పత్రిక సామ్నా వెల్లడించింది. ఈ కథనం ప్రకారం.. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో గత ఏడాది ఏక్‌నాథ్ షిండే పార్టీపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.
చాలా మంది ఎమ్మెల్యేల్ని తన వైపు తిప్పుకొని, బీజేపీతో కలిసి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చాడు. తర్వాత సీఎం అయ్యాడు. బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇటు బీజేపీ నేతలు, అటు షిండే వర్గం శివసేన నేతల మధ్య పొసగడం లేదు. రెండు వర్గాలుగా ప్రభుత్వం సాగుతోంది. బీజేపీ నేతలతో షిండే వర్గం నేతలు ఇమడలేకపోతున్నారు. వారికి బీజేపీ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో వాళ్లంతా త్వరలో తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ఉద్ధవ్ వర్గం ఎంపీ వినాయక్ రౌత్ చెప్పారు. దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు షిండేపై తిరుగుబాటు చేయొచ్చని ఆయన చెప్పారు. చివరకు షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వంలో పని జరగడం లేదని వినాయక్ ఆరోపించారు.
గతంలో షిండే వర్గానికి చెందిన గజానన్ కీర్తికర్ బీజేపీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్నారని, వాళ్లంతా తిరిగి ఉద్ధవ్ వర్గంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వినాయక్ వెల్లడించారు. నిజానికి ఈ తరహా ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. అయితే, ఇటీవల దీనికి అనుగుణంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్నారా? లేక ఇదంతా ఉద్ధవ్ వర్గం ఆడుతున్న డ్రామానా? తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.