30 లక్షల మంది బహిష్కరణకు సిద్ధం.. పాక్, ఆఫ్ఘాన్ మధ్య యుద్ధం ఖాయమా?
ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వం కూలిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా ఆనందపడింది పాకిస్తానే. ఆ మాటకొస్తే ఆఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకోడానికి తాలిబన్లకు అన్ని విధాలుగా అండగా నిలిచిందీ అదే.

ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వం కూలిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా ఆనందపడింది పాకిస్తానే. ఆ మాటకొస్తే ఆఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకోడానికి తాలిబన్లకు అన్ని విధాలుగా అండగా నిలిచిందీ అదే. చివరికి తాలిబన్లు అనుకున్నది సాధించడంతో బహిరంగంగానే మద్దతు తెలిపి సంబరాలు చేసుకుంది. కానీ, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. సరిహద్దు వివాదంతో అదే తాలిబన్లు పాకిస్తాన్ పాలిట భస్మాసుర హస్తంలా మారిపోయారు. పాకిస్తాన్‌లోకి చొచ్చుకు వస్తూ భీకర దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాలిబన్లను రెచ్చగొట్టే సంచలన నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. తమ దేశంలో ఉన్న 30 లక్షల మంది ఆఫ్ఘనీయులను గెంటేయాలని డిసైడ్ అయింది. ఈ నిర్ణయమే ఇప్పుడు ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య మంట పెడుతోంది. ఇంతకూ, ఒకేసారి 30 లక్షలమంది ఆప్ఘాన్ పౌరులను గెంటేయాలని పాకిస్తాన్ ఎందుకు డిసైడ్ అయింది? ఈ నిర్ణయం ఆఫ్ఘాన్, పాక్ మధ్య యుద్ధానికి దారితీయబోతోందా? టాప్ స్టోరీలో చూద్దాం..
“ఆఫ్ఘనిస్తాన్‌లో తిష్టవేసిన సోవియట్లను తరిమేందుకు తాలిబన్లను తయారు చేశాం.. మేం చేసిన వాళ్లే అమెరికా, నాటోను కూడా ఓడించారు”. 2021లో కాబూల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత పాకిస్తాన్ పాలకుల నోటివెంట వచ్చిన మాటలే ఇవి. అంతేకాదు, ఇక ఇక తాలిబన్ మూకలు భారత్‌పై దృష్టిపెడతాయని బెదిరింపులకు తెగబడ్డారు. కానీ, వారి అంచనాలన్నీ తిరగబడ్డాయి. అదే తాలిబన్ల మద్దతుతోనే తెహ్రీక్-ఇ-తాలిబన్లు చెలరేగిపోతున్నారు. 2023లో ఏకంగా ప్రధాని షెహబాజ్ ప్రభుత్వానికి పోటీగా ఉత్తర పాకిస్తాన్‌లో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పింది. దీనిలో వివిధ మంత్రివర్గ శాఖల్ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాలు పాకిస్తాన్ సార్వభౌమత్వాన్నే సవాలు చేశాయి. పాక్ తాలిబన్లు తమదిగా చెప్పుకొంటున్న ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించారు. వీటిల్లో గిల్గిట్, బాల్టిస్తాన్, ఆఫ్ఘాన్ సరిహద్దులను కలిపి ఉత్తర ప్రావిన్స్‌గా.. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దు వరకు ఉన్న ప్రదేశాన్ని దక్షిణ ప్రావిన్స్‌గా విభజించారు. అంతేకాదు పాకిస్తాన్ అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ ప్రాంతాన్ని కూడా తమదిగా ప్రకటించుకున్నారు. కానీ, టీటీపీ, ఆఫ్ఘాన్ తాలిబన్లకు లంకె ఎలా కుదిరింది?
తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్‌ను టీటీపీగా వ్యవహరిస్తారు. దీనిని పాక్ తాలిబన్ అని కూడా అంటారు. 2021లో ఆఫ్ఘాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వెళ్లిపోయాక ఇది బలపడింది. టీటీపీ అధినేత నూర్ వలీ మెహసూద్ ఆఫ్ఘాన్‌లోనే తిష్ఠవేసి తన కార్యకర్తలను నడిపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం దక్కించుకొనే వరకు అక్కడి తాలిబన్లు పాకిస్తాన్ కనుసన్నల్లోనే ఉండేవారు. అమెరికా నుంచి అధికారం దక్కించుకొన్నాక.. అప్పటి పాక్ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గ దర్శకత్వం చేసి వచ్చాడు. దాదాపు 18 నెలలు గడిచాక సీన్ రివర్స్ ఐంది. పాక్‌తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘాన్ తాలిబన్లు దృష్టిపెట్టారు. మొదట కంచె నిర్మించాలన్న పాక్ ప్రయత్నాలను అడ్డుకున్నారు. తర్వా త ఖైబర్ ఫఖ్తుంఖ్వా తమదే అని వాదించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏకంగా డ్యూరాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. దీంతో టీటీపీని కట్టడిచేయాలని ఆఫ్ఘాన్ తాలిబన్లను బెదిరించే ప్రయత్నం చేసింది ఇస్లామాబాద్. కానీ, తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్‌తో తమకు ఎలాంటి సంబంధంలేదని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు తేల్చి చెప్పారు. ఇక్కడే పాకిస్తాన్ వ్యూహం మార్చింది.
2021కు ముందు ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధం సమయంలో పెద్దఎత్తున శరణార్థులు పాకిస్తాన్‌కు వసల వెళ్లారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో సుమారుగా 30 లక్షల మంది ఆఫ్ఘనీయులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. టీటీపీని కంట్రోల్ చేసేలా ఆఫ్ఘాన్ తాలిబన్లను ఒప్పించేందుకు ఈ 30 లక్షలమందినే పాకిస్తాన్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. ఆఫ్ఘాన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారు తమ దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చిన గడువు ముగియడంతో వారందరినీ గెంటేయాలని డిసైడ్ అయింది. పాక్‌లో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ వాసులను, ఇతర విదేశీయులను తిరిగి పంపడానికి 2023 అక్టోబర్ నుంచి పాకిస్తాన్ బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఆ దేశ సిటిజన్ కార్డు ఉన్నవారు స్వచ్ఛందంగా తమ దేశాన్ని వదిలి వెళ్లాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి బహిష్కరించాల్సి ఉంది. ఐతే బహిష్కరణలను 10వ తేదీకి వాయిదా వేసింది. అంటే టీటీపీపై యాక్షన్ తీసుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు 10 రోజుల టైం ఇచ్చారన్నమాట. కానీ, ఈ వ్యూహం వర్క్‌ఔట్ అయ్యే సీన్ లేదు. ఎందుకంటే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఈ తరహా ఒత్తిళ్లకు లొంగే రకాలు కాదు.
30 లక్షల మందిని బహిష్కరించాలని పాక్ డిసైడ్ అయిన వెంటనే కాబూల్ నుంచి రియాక్షన్ వచ్చింది. తమ పౌరులను బహిష్కరించడానికి పాక్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ముతాలిబ్ కీలక ప్రకటన చేశారు. శరణార్థులు గౌరవంగా తమ దేశానికి తిరిగి రావాలని తాలిబన్ ప్రభుత్వం కోరుకుంటుందని పేర్కొన్నారు. తాలిబన్ ప్రభుత్వానికి, ఐక్యరాజ్య సమితికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పాకిస్తాన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. అంటే ఈ ప్రక్రియలో ఏమాత్రం తేడా వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు వైల్డ్‌గా రియాక్ట్ అవుతారన్నమాట. వివరంగా చెప్పాలంటే.. 30 లక్షల మందిని సరిహద్దులు దాటించే సమయంలో ఎలాంటి పొరపాట్లూ జరక్కూడదు. ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగితే పాక్ ఊహకందని విధ్వంసం జరుగుతుందని హింట్స్ ఇస్తున్నారు. నిజానికి.. 30 లక్షల మందిని సరిహద్దు దాటించడం అంత ఈజీ కాదు.. పాకిస్తాన్ అంత సురక్షంగానూ లేదు. బీఎల్ఏ, టీటీపీ దాడులను అడ్డు కోలేక ఆ దేశ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ పౌరుల తరలింపులో జరగకూడనిది ఏదైనా జరిగితే దానిని ఆఫ్ఘాన్ తాలిబన్లు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. టీటీపీ, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల అసలు లక్ష్యం పాకిస్తాన్‌ను ఆక్రమించి షరియా చట్టం అమలు చేయాలన్నదే. ఇలాంటి సమయంలో తాలిబన్లను రెచ్చగొట్టే చర్యలకు దిగడం అంత మంచిది కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి పాకిస్తాన్ బహిష్కరణ వ్యూహం చివరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.