5 ఎమ్మెల్సిలు.. అన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న పవన్…!
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్సీ పదవులకు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా మంత్రి పదవులకు వినపడుతున్న పేర్లపై పెద్ద చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్సీ పదవులకు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా మంత్రి పదవులకు వినపడుతున్న పేర్లపై పెద్ద చర్చ జరుగుతోంది. మూడు పార్టీల నుంచి ఆశవాహులు ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీల అధినేతలు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్ద చర్చ జరుగుతుంది.
2024 ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు ఉంటాయా ఉండవా అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటికి సీట్లు త్యాగం చేసిన వాళ్లకు పార్టీ అధిష్టానాలు సీట్లు ఖరారు చేశాయి. ఇంకా 5 ఎమ్మెల్సీ స్థానాల విషయంలో పార్టీల అధినేతల ఆలోచన ఏ విధంగా ఉందనేదానిపై ఆ పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఇక ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో మూడు స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారు అయిపోయినట్లుగానే కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వంగవీటి రాధా కచ్చితంగా మండలిలో అడుగుపెట్టే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
2019 ఎన్నికలకు ముందు వైసీపీతో విభేదించిన వంగవీటి రాధా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేశారు. అయితే ఆయనకు గత ఎన్నికల్లో సీటు ఖరారు చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ వంగవీటి రాధ విషయంలో చంద్రబాబు నాయుడు అంత ఆసక్తి చూపించలేదు. అయితే గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆయనకు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనితో కచ్చితంగా వంగవీటి రాధా శాసనమండలిలో అడుగుపెట్టడం ఖాయం అని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అలాగే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న వర్మ పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినపడుతోంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా వర్మ చాలా కష్టపడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయనకు పదవులు ఇచ్చే విషయంలో అసంతృప్తి కనపడుతుంది. ఈ తరుణంలో ఆయనను కచ్చితంగా శాసనమండలికి పంపించే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. రాజకీయంగా నియోజకవర్గంలో ఆయనకు మంచి బలం ఉంది. ఇది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ని కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
అందుకే ఆయనను ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి కే.ఎస్ జవహర్ పేరు కూడా ఇక్కడ ప్రధానంగా వినపడుతుంది. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానం విషయంలో ఆయన పేరు ప్రధానంగా చర్చకు వచ్చినా.. కొన్ని కారణాలతో ఆయనకు సీటు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు కచ్చితంగా ఇచ్చే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే జనసేన నుంచి కొణిదల నాగబాబు పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటామని ఇప్పటికే తెలుగుదేశం, జనసేన రెండు ప్రకటించాయి.
నాగబాబు స్థానంలో ఎవరున్నా సరే క్యాబినెట్ లోకి వస్తారని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కూడా తమ అధికారిక ప్రకటన చేసింది. దీనితో నాగబాబు కచ్చితంగా ఎమ్మెల్సీకి ఎన్నిక కావడం లాంచనంగానే కనపడుతుంది. ఇక బిజెపి నుంచి మాధవ్ పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. ఆయన కూడా ఎన్నికల్లో సీటు ఆశించారు. కొన్ని కారణాలతో ఆయనకు సీటు నిరాకరించింది బిజెపి. నియోజకవర్గాల విషయంలో ఎక్కువగా రాకపోవడంతో ఆయనను పక్కనపెట్టారు.
అయితే పార్టీ కోసం కష్టపడుతున్నారు దాని కారణంతోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు బిజెపి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అయిదుగురు నేతలకు దాదాపుగా సీట్లు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వీరిలో ముగ్గురికి మాత్రం ఖచ్చితంగా సీటు ఖరారు చేయొచ్చని.. మిగిలిన నేతల విషయంలో మాత్రం చెప్పలేమని అంటున్నారు. వంగవీటి రాధా, నాగబాబు, వర్మ పేర్లైతే ఖరారు అయినట్లుగానే కనబడుతోంది. మరి కె.ఎస్ జవహర్, మాధవ్ విషయంలో పార్టీ అధిష్టానాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. అటు తెలుగుదేశం పార్టీ నుంచి దేవినేని ఉమా కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు.