టన్నెల్‌లో 8మంది ప్రాణాలు బలి.. వీళ్ల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
SLBC సొరంగంలో గల్లంతైన ఎనిమిది మంది లేరు. గుర్తించాల్సింది శవాలను మాత్రమే ! అది కూడా కష్టంగానే మారింది.

SLBC సొరంగంలో గల్లంతైన ఎనిమిది మంది లేరు. గుర్తించాల్సింది శవాలను మాత్రమే ! అది కూడా కష్టంగానే మారింది. 250 మంది నాలుగు బృందాలుగా విడిపోయి వెతికినా.. ఇప్పటికీ శవాలు దొరకలేదు. దొరుకుతారో లేదో కూడా తెలియదు. దొరికినా గుర్తించే పరిస్థితి ఉంటుందో లేదో అర్థం కాదు. మృతదేహాల ఆనవాళ్లు దొరికాయ్. ఎవరిది ఏ మృతదేహామో తెలియడం లేదు. SLBC సొరంగంలో జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్.. రాబిన్సన్ సంస్థకు చెందిన టీబీఎం ఆపరేటర్లు సన్నీ సింగ్, గురు దీప్ సింగ్, రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జక్తాజెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు.
వీరందరూ జమ్మూ, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చారు. చాలామంది పొట్టకూటి కోసం వచ్చినవాళ్లే. చాలీచాలనీ జీతాలతో.. కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారే. SLBC ప్రమాదంతో.. సాగునీటి పథకాల్లో పనుల్లో కార్మికల జీవితాలు మళ్లీ తెరమీదకు వచ్చాయ్. వేల కోట్లు ఖర్చు చేస్తూ చేపట్టిన సాగునీటి పథకాల పనుల్లో.. అపర భగీరథులు అంటే కార్మికులే. కిలోమీటర్ల దూరం భూగర్భంలోకి వెళ్లి ఊపిరాడని ప్రాంతాల్లో వారు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటారు. వారి శ్రమకు, పొందే వేతనానికి పొంతనే ఉండదు. తగిన రక్షణ చర్యలు లేక వారి ప్రాణాలు కూడా గాలిలో దీపాల్లా మారుతున్నాయ్. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్లో కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ పనిచేయడం లేదు. సబ్ కాంట్రాక్ట్‌లు ఇచ్చి పని కానిచ్చేస్తోంది. వాళ్లు బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తక్కువ వేతనానికి కార్మికులను తీసుకువస్తున్నారు.
చదువుకోలేని వారు, నైపుణ్యాలు లేనివారే వారిలో ఎక్కువ. భోజనం, వసతి కల్పిస్తూ విద్యార్హత లేని వారికి నెలకు 6వేల 5వందలు.. కొంత నైపుణ్యం ఉన్నవారికి 10 నుంచి 12వేలు… నైపుణ్యం ఉన్న వారికి 15వేల వరకు ఇస్తున్నారు. కార్మికుల వివరాలు కార్మిక శాఖదగ్గర నమోదు చేయట్లేదు. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున కార్మికులతో 12 గంటల వరకు పనులు చేయిస్తున్నారు. SLBC ప్రమాదంలో చనిపోయిన 8మందిలో.. ఆరుగురి కుటుంబాలు తీవ్రమైన పేదరికంలో గడుపుతున్నాయని తెలుస్తోంది. కుటుంబానికి దూరంగా ఉండి అయినా సరే.. నాలుగు పైసలు వెనకేసుకుందాం అనుకుంటే.. ఆ మనిషే ఇప్పుడు దూరం అయిన పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత 8మంది కార్మికుల కుటుంబాలు ఆ సొరంగం దగ్గరే ఎదురుచూస్తున్నాయ్. ప్రాణం లేని ఆ శరీరం కోసం నీళ్లు ఇంకిపోయిన కళ్లతో ఆశగా చూస్తూనే ఉన్నాయ్. ఆ పరిస్థితి తలుచుకుంటేనే.. చాలామంది గుండె మెలేసినట్లు అవుతోంది.