జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి సామాన్యుడి లేఖ

పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ చూసిన తరువాత మీకు ఈ లేఖ రాస్తున్నాను.మీకు జీవితం లోనూ, కెరీర్ లోనూ చివరికి రాజకీయాల్లోను అదృష్టం కలసి వచ్చి....ఉన్నత స్థాయి కి ఎదిగారు తప్ప ఎక్కడా కష్టం కనిపించదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2025 | 10:00 PMLast Updated on: Mar 18, 2025 | 10:00 PM

A Common Mans Letter To Jana Sena President And Ap Deputy Chief Minister Pawan Kalyan

పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ చూసిన తరువాత మీకు ఈ లేఖ రాస్తున్నాను.మీకు జీవితం లోనూ, కెరీర్ లోనూ చివరికి రాజకీయాల్లోను అదృష్టం కలసి వచ్చి….ఉన్నత స్థాయి కి ఎదిగారు తప్ప ఎక్కడా కష్టం కనిపించదు. ఈ మాట అంటే మీ అభిమానుల కు కోపం రావచ్చు. దశాబ్దాలుగా మిమ్మల్ని గమనిస్తున్న సామాన్యుడిగా, ఇది నా అభిప్రాయం. నిజమో కాదో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొండి. మీకు దేని పైన పూర్తి అవగాహన ఉండదు. అలా అని అజ్ఞాని కాదు మీరు. మంచి హృదయం ఉన్న వాళ్లు. ఎవరికి హాని చేసే వ్యక్తిత్వం కాదు. ఈ లక్షణం మాత్రమే మిమ్మల్ని ఇన్నాళ్లూ కాపాడింది.

ఆబద్ధం చెప్పేవాడికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండాలి. నిజాలు చెప్పేవాడికి అన్ని గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఉండదు. మీకు జ్ఞాపక శక్తి బాగా తక్కువ. మీరు చెప్పిన మాటలే మరచి పోతూ ఉంటారు. కొత్త ఆబద్ధం చెప్పేస్తారు. మీరు లైఫ్ లో చెప్పిన ప్రతి విషయానికి మీరే కౌంటర్ చేసుకుంటు ఉంటారు. వ్యక్తిగత జీవితం లో, కెరీర్ లో, రాజకీయాల్లో ఎక్కడ మీకు స్థిరమైన అభిప్రాయం లేదు ….ఉండదు అనేది పదే పదే నిరూపిస్తూనే ఉన్నారు . చివరికి నిన్న పిఠాపురం సభ లో… యెవడు యేలా అనుకున్నా నాకేం నష్టం లేదు నేను ఇలాగే ఉంటా అని తెగేసి చెప్పేశారు. ఎవడి కోసమో నా అభిప్రాయాలను మార్చుకోను అన్నారు. మాలాంటి సామాన్యులు కోరుకునేది కూడా అదే. యేదో ఒక సిద్ధాంతం, అభిప్రాయం పై స్థిరంగా ఉండటమే. కనీసం ఇప్పుడైనా సనాతన ధర్మ పరిరక్షణ అనే లక్ష్యానికి కట్టుబడి ఉండండి. నిజానికి అది జనానికి అర్థం కాదు, అవసరం లేదు. కనీసం అది మీకు యేదో ఒక పెద్ద పదవీ అయినా ఇప్పిస్తుందేమో అని ఆశిద్దాం.

20 యేళ్ళ క్రితం అనుకుంట … మీరు నేను యంగ్ స్టార్ గా గా ఉన్నప్పుడు నక్సల్స్ లోకి వెళ్లి పోదాం అనుకున్నా అని చెప్పారు. కొన్నాళ్లు నల్లమల అడవుల్లో కి వెళ్లి పోదామని అనుకున్న అని చెప్పారు. మీరు వెళ్లలేదు. వెళ్లరు కూడా. నక్సలిజం మీకు ఒక ఫ్యాషన్ మాత్రమే. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీరు అతిగా ఊహించు కోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. స్టేట్ ఆఫ్ ఉటోపియా అంటారు దీన్ని. మిమ్మల్ని మీరు ఒక ఉద్యమ కారునిగా, విప్లవ కారునిగా ఊహించుకుంటు ఉంటారు అంతే. 57 యేళ్ళ మీ లైఫ్ లో అసలు ఏ ఉద్యమం చేశారు. ? యెన్ని సార్లు లాఠీ దెబ్బలు తిన్నారో చెప్పండి. ? ఏ తిరుగుబాటు లో మీరు పాల్గొన్నారు? విద్యార్ది ఉద్యమాల్లో పాల్గొన్నారు? రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశారా? కుల నిర్మూలన ఉద్యమాల్లో ఉన్నారా? రైతు ఉద్యమాల్లో పాల్గొని తుపాకీ తూటాలకు యెదురు వెళ్లారా? మీరు చేసిన ఉద్యమం చెప్పనా? 24 యేళ్ళ క్రితం మీకు వ్యతిరేకంగా రాసినందుకు దక్కన్ క్రానికల్ ఆఫీసు ముందు కాసేపు ధర్నా చేశారు.

మరో సారి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు తుపాకీ భుజం పై పెట్టుకుని కాసేపు హడావుడి చేశారు. ఇంకో సారి టిడిపి మీడియా శ్రీ రెడ్డి, కత్తి మహేష్ లాంటి వాళ్లతో మిమ్మల్ని తిట్టిస్తుంటే తట్టుకోలేక ఫిల్మ్ చాంబర్ లో మీటింగ్ పెట్టారు. ఈ మూడు సంఘటనలు మీ వ్యక్తిగతం మాత్రమే. అవి ఉద్యమాలు కాదు. జనసేన పెట్టాక ప్రజల్లో సమస్యలు తెలుసు కోడానికి వచ్చారు. మీరు ఎన్నడూ ఉద్యమాలు చేయలేదు. మీరు ఒక సినిమా హీరో. ఆ పాపులారిటీ మిమ్మల్ని పాలిటిక్స్ లో నాయకుడిగా నిలబెట్టింది. మీరు సినిమా హీరో కాకపోతే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వలేరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మిత్రులు మిమ్మల్ని ఉద్యమకారులు అనే భ్రమలో ఉంచి పబ్బం గడుపుకున్నారు అంతే. ఇప్పటికీ మీరు అదే భ్రమల్లో ఉన్నారు. అందుకే 16 యేళ్ళు గా మీరు ప్రతి మీటింగ్ లో మీ గురించి మీరే చెప్పుకుంటారు.మీ ఉనికి కోసం మీరే తాపత్రయ పడతారు . మీరు చెప్పింది మిగిలిన వాళ్ళు నమ్మడం లేదనే డౌట్ మిమ్మల్ని వెంటాడు తోంది. లేకపోతే ఎన్నాళ్లు చెప్తారు సార్..మీ నెల్లూరు పురాణం. డాక్టర్ కరీముల్లా అస్తమా మెడిసిన్, మీ నాన్నగారి క్రమశిక్షణ, అన్నగారి హార్డ్ వర్క్, మీ మార్షల్ ఆర్ట్స్, మీ ఆత్మహత్య ప్రయత్నం, చిన్న అన్నయ్య ఇచ్చిన నాని పాల్కి వాలా బుక్కు…ప్రతి మీటింగ్ లోనూ ఇదే సొంత డబ్బా నా? నిజం చెప్పండి మీ జీవితం ఇతరులు ఆదర్శంగా తీసుకునేంత గొప్ప జీవితమా? Ap కి డిప్యూటీ సిఎం అయినంత మాత్రాన మిమ్మల్ని ఈ తరం యువత ఫాలో అవ్వాలా? మీ చిన్న అన్నయ్య నాగబాబు గారు పిఠాపురం వేదికపై మిమ్మల్ని నేటి యువత ఫాలో అవ్వాలని సందేశం ఇచ్చారు. ఎంత అన్యాయం పవన్ కళ్యాణ్ గారు.

నాయకుడు కి స్పష్టమైన విధానాలు ఉండాలి. మిమ్మల్ని నమ్మి కోట్ల మంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు. నాయకుడు ఎప్పటికప్పుడు విధానాలు మార్చేసుకుంటే, మీ వెనక వచ్చేవాళ్లు అలా విధానాలు మార్చుకోవాలా? మొదట మీరు కమ్యూనిస్టుని ని అన్నారు. కమ్యూనిస్టులతో లతో చర్చలు జరిపారు. చే గువేరా ఆదర్శం అన్నారు. ఇప్పుడేమో డాక్టర్ అయ్యుండి ప్రజల కోసం పోరాడాడు అందుకే ఇష్టం తప్ప… చేగువేరా తో నాకేంటి సంబంధం అంటారు. మీరు చెప్పారు అని మేము అంతా చేగువేరా స్టిక్కర్స్ పెట్టుకొని తిరిగాం. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ… అతను ధర్మం అంటున్నారు. మళ్లీ మీ స్టిక్కర్లు మార్చుకొని వెధవలం అవ్వాలా? హిందీ ని మనపై బలవంతంగా రుద్దు తున్నారని , ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్లపై ఆధిపత్యం చలాయిస్తున్నారని మీరు తిట్టారు. అప్పుడు వెంటనే మేమంతా మీకు జై కొట్టాం.

ఇప్పుడేమో ఉత్తరాది,.దక్షిణాది తేడా ఏంటి అందరూ ఒకటే…హిందీ, సంస్కృతం అందరూ నేర్చుకోవాలి అని మీరే అంటున్నారు. ఇప్పుడేం చేయాలో మాకు అర్థం కావటం లేదు. 2014 లో బిజెపి, టిడిపి లను మీరు దించారు. అప్పుడు మేము జై కొట్టాం. 2019 లో లోకేష్, చంద్ర బాబు అవినీతి పరులని తిట్టారు. మళ్లీ 2024 లో ఏపీ బతకాలంటే టిడిపి కే ఓటు వేయాలి అన్నారు. మీరు ఇప్పుడు విధానాలు మార్చుకుంటూ వెళ్తే….మీ వెనుక మేము అంత వేగంగా మారలేకపోతున్నాం. గుర్తుందో లేదో 2019 లో మీరు cpm, సిపిఐ, బీఎస్పీ లతో కలసి పోటీ చేశారు. 2024 కి వచ్చేసరికి బిజెపి లో చంకలో దూరారు. మీ అంత వేగంగా మేము ఎక్కడ పడితే అక్కడ దూరలేక పోతున్నాం. నాకూ అప్పుడు మెచ్యూరిటీ లేదు. ఇప్పుడే పరిణితి చెందాను అందుకే విధానాలు మార్చాను అని పిఠాపురం లో చెప్పారు. అంటే మేము ఇన్నాళ్లూ పరిణితి లేని నాయకుడి వెనుక తిరిగాం అన్న మాట.

ఒక్కోసారి మీరు మాట్లాడే మాటలు అహంకారం తెలియదు అజ్ఞానం అర్థం కాదు.100% స్ట్రైక్ రేట్ అని పదే పదే చెప్తుంటారు. ఈ పదం మీ సొంత పదం కాదు ఎవడో ఎక్కించాడు. సరే.100% స్ట్రైక్ రేటు మీకు మీరే తెచ్చుకున్నారా. తెలుగుదేశం సహకారం లేకుండానే మీకు వచ్చేసిందా? అలా వచ్చి ఉంటే 2019లోనే రావాలి కదా.40 ఏళ్ల టిడిపిని నేను నిలబెట్టాను… నేను నిలబెట్టాను అని పదేపదే చెప్తారు. తెలుగుదేశం లేకుండా అసలు మీరు నిలబడగలరా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. వెనకటికి ఎవడు పెళ్లినాడు పెళ్ళానికి పట్టుచీర కొనిచ్చి పాతికేళ్లు అదే చెప్పుకొని తిరిగాడంట. అసలు మీ రాజకీయ జీవితంలో తెలుగుదేశం, బిజెపి సపోర్ట్ లేకుండా 11 సీట్లు అయినా గెలవగలరా? ఛాలెంజ్ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. పిఠాపురంలో మీ గెలుపుకి వర్మ అనే టిడిపి నాయకుడు కృషి చేశాడు. అతని నియోజకవర్గానికి వెళ్లి అతని మీరు మీ సోదరుడు నాగబాబు వెక్కిరించి వస్తారు. దీన్నిబట్టి మీ మెగా ఫ్యామిలీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో జనానికి అర్థమైంది. మీరు మెగా ఫ్యామిలీ గురించి ఎన్ని కథలు చెప్పినా వాస్తవాన్ని వర్తమానంలోనే చూస్తారు జనం.

మన వ్యక్తిగత జీవితంలో…. వ్యక్తులను, విధానాల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. కానీ రాజకీయ జీవితంలో విధానాలను ఎలా పడితే అలా మార్చేస్తే జనం కూడా వాళ్ల విధానాలను మార్చుకుంటారు. నాయకుల్ని కూడా మార్చేస్తారు.
ఒక్కటి స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి మీరు.2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ కాదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఐదేళ్లపాటు వైసిపి అరాచకం, జగన్ అహంకారం, అతని ప్రభుత్వ అరాచకం మిమ్మల్ని గెలిపించాయి. మీ గెలుపు అంతా అంతా మీ ప్రతిభ అనుకొని మీరు ఎలా పడితే అలా మాట్లాడితే…. మీరు మీ విధానాలు మార్చుకున్నట్లే…. క్షణం కూడా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు. మాటలతో…. నెల్లూరు పురాణంతో… మెగా ఫ్యామిలీ ముచ్చట్లతో… కొత్త కొత్త విధానాలతో, అర్థం లేని సనాతన ధర్మంతో జనాన్ని మాయ చేయలేం. ఇది మీరు గుర్తిస్తే చాలు.

ఇట్లు మీ సామాన్యుడు.