ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. సీఎం రేవంత్‌కు భారీ ఊరట..

ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌పై... సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసు ట్రయల్‌ని భోపాల్‌కి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2024 | 02:30 PMLast Updated on: Aug 29, 2024 | 2:30 PM

A Key Development In The Case Of Notes For Votes Big Relief For Cm Revanth

ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌పై… సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసు ట్రయల్‌ని భోపాల్‌కి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌పై జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ ముగించింది. ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు రావడంతో.. స్పెషల్ ప్రాసిక్యూటర్‌ని నియమిస్తామని ధర్మాసనం తెలిపింది.

న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని.. ప్రతి ఒక్కరి మనస్సులో నమ్మకం ఉండేలా.. ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని జస్టిస్ గవాయ్ వివరించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్ రెడ్డి… ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన దగ్గరే ఉందని… జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ర్యాలీల్లో… పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని… జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది వివరించారు.

సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే… కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని… ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్‌లో కూడా వైఖరి మారిందని తెలిపారు. ఐతే ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ని నియమించే వ్యవహారాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు. తెలంగాణకు చెందిన తన సహచరులను సంప్రదించి… ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తామని చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని.. విచారణను ముగిస్తున్నామని త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.

కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే.. న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. 2015లో తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చర్చలు జరిపిన వీడియోను సైతం ఏసీబీ విడుదల చేయడంతో అది సంచలనంగా మారింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు.