బాలీవుడ్‌ నటిపై వేధింపుల కేసులో మలుపు..

బాలీవుడ్‌ నటిపై వైసీపీ నేతల వేధింపుల బాగోతం వెనక అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. ఓ పెద్ద తలకాయను కాపాడేందుకు.. జగన్‌తో కలిసి సజ్జల స్కెచ్ వేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2024 | 03:28 PMLast Updated on: Aug 28, 2024 | 3:28 PM

A Turning Point In The Harassment Case Against Bollywood Actress

బాలీవుడ్‌ నటిపై వైసీపీ నేతల వేధింపుల బాగోతం వెనక అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. ఓ పెద్ద తలకాయను కాపాడేందుకు.. జగన్‌తో కలిసి సజ్జల స్కెచ్ వేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. సజ్జన్‌ జిందాల్‌ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆయన. దేశంలోనే టాప్‌ పారిశ్రామికవేత్తల్లో ఒకరు. అలాంటి ప్రముఖుడిపై గతేడాది ముంబైకి చెందిన నటి రేప్‌ కేసు పెట్టింది. అప్పట్లో ఆ కేసు రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఐతే కొద్దిరోజులకే అదే నటి… సజ్జన్‌ జిందాల్‌పై కేసును వెనక్కి తీసుకుంది. జిందాల్‌పై పడిన కేసుకు, విద్యాసాగర్‌కు పెట్టిన కేసుకు సంబంధం ఉందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. జిందాల్ మీద ఆ నటి కేసు పెట్టడానికి, వాపస్‌ తీసుకోవడానికి మధ్య విజయవాడ కేంద్రంగా భారీ సెటిల్‌మెంట్‌ నడిచిందనే ప్రచారం జరుగుతోంది. అక్కడ బాధితురాలిగా సజ్జన్‌ జిందాల్‌పై కేసు పెట్టిన ముంబై నటిని… ఇక్కడ విజయవాడలో నిందితురాలిగా చేర్చి ఒక కేసు పెట్టారు. ఆమెను, ఆమె తల్లిదండ్రులనూ అరెస్టు చేసి నెలకుపైగా జైలులో ఉంచారు. ఇక్కడ బెయిలుపై విడుదలైన తర్వాత… అక్కడ సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన రేప్‌ కేసును ఆమె వెనక్కి తీసుకున్నారు.

ఇలా జిందాల్‌ను రక్షించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి, ముంబై నటిపై కేసు పెట్టి, ఆమెను అరెస్టు చేయించి, బెదిరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. 2023 డిసెంబరులో సజ్జన్‌ జిందాల్‌పై ముంబై నటి రేప్‌ కేసు పెట్టింది. ఒక పెంట్‌ హౌస్‌లో ఆయన తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. దీంతో సజ్జన్‌ జిందాల్‌ చిక్కుల్లో ఇరుకున్నారు. ఆమె కేసు విత్‌డ్రా చేసుకోకుంటే… కోర్టు విచారణ తప్పదు! దీంతో… ఆమెతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రాజీ ఎపిసోడ్‌లో వైసీపీ నేతకుక్కల విద్యాసాగర్‌ ఎంట్రీ ఇచ్చారు. ముంబై నటితోపాటు సజ్జన్‌ జిందాల్‌తోనూ విద్యాసాగర్‌కు మంచి పరిచయం ఉంది.

కేసు వాపసు తీసుకునేందుకు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఐతే అందుకు ఆమె ససేమిరా అన్నా రు. దీంతో ఆమెను దారికి తెచ్చుకునేందుకు… తమ స్టైల్‌ ముందుకు వెళ్లాలి అన్నట్లుగా అప్పటి సీఎం జగన్‌ ముందుకు వ్యవహారం తీసుకెళ్లారట. నిజానికి సజ్జన్‌ జిందాల్‌కు జగన్‌ సన్నిహితులు కూడా ! విద్యాసాగర్‌కు కూడా జగన్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. సజ్జన్‌ జిందాల్‌, విద్యాసాగర్‌ ఇద్దరూ కలిసి… ఈ ఏడాది ఫిబ్రవరిలో జగన్‌ను కలిశారని.. టీడీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియా ప్రచారం మొదలుపెట్టింది. ఆ తర్వాతే కౌంటర్‌ స్ట్రాటజీ సిద్ధం అయిందనే టాక్ వినిపిస్తోంది.

జగన్‌తో సజ్జన్‌ జిందాల్‌ భేటీ తర్వాత.. ఈ వ్యవహారాన్ని నేరుగా డీల్‌ చేసేందుకు సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. తమ వ్యూహంలో భాగంగా విద్యాసాగర్‌… ముంబై నటిపై విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు పెట్టారు. ఆమె తనను బ్లాక్‌ మెయిల్‌ చేసిందనీ.. కొన్ని సంతకాలు చేయించుకుందనీ ఆరోపించారు. సజ్జల ఆదేశాలతో అప్పటి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతి రాణా వేగంగా రియాక్ట్ అయ్యారు. అప్పటి డీసీపీ విశాల్‌ గున్నీ నేతృత్వంలో ప్రత్యేక బృందం ముంబైకి వెళ్లింది. దర్యాప్తు అధికారి సత్యనారాయణతోపాటు ఏసీపీలు రమణమూర్తి, హనుమంతరావు ముంబైకి వెళ్లారు.

అక్కడ… ముంబై నటిని, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ముందు అక్కడి కోర్టులో హాజరుపరచి… ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఇక్కడికి తీసుకొచ్చి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నటి కుటుంబ సభ్యులను దారుణంగా వేధించినట్టు తెలుస్తోంది. అప్పుడు కమిషనరేట్‌లో ఉంటూ చక్రం తిప్పి, ఇప్పుడు వీఆర్‌లో ఉన్న ఒక ఎస్‌ఐ… నటి పట్ల దారుణంగా ప్రవర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ నటితోపాటు ఆమె కుటుంబసభ్యులను చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయ్. ఐతే ముంబైలో సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసును వాపసు తీసుకుంటేనే… ఇక్కడ ఈ కేసులో రిలీఫ్ ఉంటుందని పోలీసులు చెప్పారట.

దీంతో వారి బంధువులు వచ్చి.. పోలీసులతో మాట్లాడి రాజీకి అంగీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన అరెస్టుకాగా… మార్చి 8వ తేదీన ఆ నటి, కుటుంబ సభ్యులు బెయిలుపై విడుదలై ముంబై వెళ్లిపోయారు. ఆపై వారం రోజులకే.. అంటే మార్చి 16వ తేదీన సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసును ఆమె వెనక్కి తీసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన కొద్దిరోజుల తర్వాత.. ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసు విషయంలో రాజీ కుదిరింది. కేసు విచారణ కోర్టులో ఉండడంతో.. లోక్‌ అదాలత్‌లో వైసీపీ నేత, నటి రాజీపడుతున్నట్టుగా చూపించారు. రేప్‌ కేసు నుంచి సజ్జన్‌ జిందాల్‌ ఇలా బయటపడ్డారని.. టీడీపీ మీడియా కోడై కూస్తోంది.