AAP Vs CONGRESS: ఆప్, కాంగ్రెస్ కలవవా..? మోదీని మరోసారి అందలం ఎక్కిస్తారా..?
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి అంతిమంగా మోదీకే లబ్ధి కలిగిస్తున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్, ఆప్ సహా ఇతర పక్షాలు ఈ విషయం తెలిసి కూడా కలిసికట్టు పనిచేయడానికి సందేహిస్తున్నాయి. రెండుసార్లు ఎదురుదెబ్బలు తిన్నా ఒక్క పార్టీకి కనువిప్పు కలగడం లేదు.
AAP Vs CONGRESS: దేశంలో రెండుసార్లు ప్రధానిగా ఎన్నికై మోదీ సంచలనమే సృష్టించారు. ఇదంతా మోదీ హవానే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతగా మోదీ తన ఇమేజ్ పెంచుకున్నారు. బీజేపీకి, మోదీకి ఇప్పుడు సంప్రదాయ, శాశ్వత ఓటు బ్యాంక్ ఉంది. అలాంటి మోదీని ఎదుర్కోవాలంటే.. మోదీ వ్యతిరేక ఓట్లు గంపగుత్తగా పడాలి. మోదీకి వ్యతిరేకంగా ఒక్క పార్టీయే అయితే సమస్య లేదు. కానీ.. అందరూ మోదీని వ్యతిరేకించే వాళ్లే. పైగా ఎవరి దారి వారిదే. ఇంకేముంది.. ప్రతిపక్షాల్లో ఐక్యత లోపించడమే ఇప్పుడు మోదీకి బలం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి అంతిమంగా మోదీకే లబ్ధి కలిగిస్తున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్, ఆప్ సహా ఇతర పక్షాలు ఈ విషయం తెలిసి కూడా కలిసికట్టు పనిచేయడానికి సందేహిస్తున్నాయి. రెండుసార్లు ఎదురుదెబ్బలు తిన్నా ఒక్క పార్టీకి కనువిప్పు కలగడం లేదు. ముఖ్యంగా కూటమిగా కలిసి పని చేసేందుకు కాంగ్రెస్, ఆప్ ముందుకు రావడం లేదు. ఇలాగైతే ప్రతిపక్షాల కూటమి అసాధ్యమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మోదీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా.. 2024లో బీజేపీ ఓడిపోతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. గతంలోకంటే మెజారిటీ మాత్రం తగ్గుతుంది. మరోవైపు ప్రతిపక్షాలు బలపడుతున్న మాట వాస్తవమే కానీ.. అది మోదీని ఎదుర్కొనేంత బలంగా కాదు. ఈ పరిస్థితుల్లో మూడోసారి కూడా మోదీకి అధికారం దక్కకుండా చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేయాలి. ఒకే కూటమిగా ఎదురెళ్తేనే మోదీని ఎదుర్కోవడం సాధ్యం. ఇది అన్ని పార్టీలూ అంగీకరించే సత్యమే. అయితే, కలిసి పనిచేయడం దగ్గరే ప్రతిపక్షాలకు చిక్కొచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత ప్రతిపక్షాల వైఖరిలో మార్పు వచ్చింది. కలిసిపని చేస్తే మోదీని ఓడించడం సాధ్యమే అనే నిర్ణయానికొచ్చాయి. దీంతో ఐక్యత కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల పాట్నాలో, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. దీనికి కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ సహా అనేక పార్టీలు హాజరయ్యాయి. అయితే, కాంగ్రెస్-ఆప్ మధ్య అనేక విషయాల్లో సఖ్యత కుదరలేదు.
ఆప్-కాంగ్రెస్ కలిసిపోవా..?
ప్రతిపక్షాల కూటమిలో బలమైన పార్టీలుగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్, ఆప్. వీటిలో ఆప్ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మిగతా పార్టీలన్నీ ఒక్కో రాష్ట్రానికే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆప్-కాంగ్రెస్ కలిస్తే బీజేపీని ఎదుర్కోవడ సులభమవుతుంది. కానీ, కాంగ్రెస్ ఈ విషయంలో చొరవచూపడం లేదు. ఎందుకంటే ఆప్ అధికారంలో ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్ నుంచి అధికారం లాక్కున్నదే. తమను ఓడించిన కాంగ్రెస్‌తో కలిసేందుకు కాంగ్రెస్ సంశయిస్తోంది. ఢిల్లీ ఎన్నికల తర్వాత నుంచి ఆప్, కాంగ్రెస్ మధ్య విబేధాలు మరింత పెరిగాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీస్తూ, బీజేపీని గెలిపించేందుకే ఆమ్ ఆద్మీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఇటీవల ఢిల్లీ విషయంలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి. ఒక్క కాంగ్రెస్ తప్ప. ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్‌పై ఆప్ ఆగ్రహంతో ఉంది. దీంతో ప్రతిపక్ష కూటమిలో రెండు పార్టీలూ అంటీముట్టనట్లుగా ఉంటున్నాయి. అవసరమైతే కాంగ్రెస్ ఉన్న కూటమిలో తాము ఉండబోమని కూడా ఆప్ చెబుతోంది.
వచ్చే నెల స్పష్టత వస్తుందా..?
ఇప్పటికింకా పరిస్థితి చేజారలేదు. ఆప్, కాంగ్రెస్ తమ విబేధాలు పక్కనపెట్టి పని చేస్తే మోదీని ఎదుర్కోవడం సాధ్యమే. రెండు పార్టీలూ తమ స్వప్రయోజనాలు మాత్రమే చూసుకుని, బెట్టు చేస్తే రెండింటికీ నష్టమే. ప్రధానంగా కాంగ్రెస్ ఎక్కువగా నష్టపోతుంది. అయితే, ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క సమావేశమే జరిగింది. జూలై 12న మరో సమావేశం జరగనుంది. కాంగ్రెస్, ఆప్ కలిసి పని చేసే అంశంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటికీ వాస్తవాలు గ్రహించి, కలిసి సాగకపోతే ఇరు పార్టీలూ నష్టపోతాయి.