CHANDRABABU NAIDU: 28 రోజులుగా చంద్రబాబు జైల్లోనే.. బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా..!

గత నెల 10న చంద్రబాబును కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. అయితే, ఆయన రెండు, మూడు రోజుల్లో తిరిగొస్తారని అంతా అనుకున్నారు. కానీ, దాదాపు నెల కావొస్తున్నా ఆయన విడుదల కాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 6, 2023 | 03:10 PMLast Updated on: Oct 06, 2023 | 3:10 PM

Acb Court Reserves Judgement To Monday On Chandrababu Naidus Bail Plea

CHANDRABABU NAIDU: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 28 రోజులుగా జైలులోనే ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజుతో చంద్రబాబు రిమాండ్ పూర్తైన నేపథ్యంలో ఆయన రిమాండ్‌ను కోర్టు మరో రెండు వారాలు పొడిగించడంతో టీడీపీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. చంద్రబాబు జైలు నుంచి ఎప్పుడు బయటికొస్తారనే ఆశతో ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గత నెల 10న చంద్రబాబును కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. అయితే, ఆయన రెండు, మూడు రోజుల్లో తిరిగొస్తారని అంతా అనుకున్నారు. కానీ, దాదాపు నెల కావొస్తున్నా ఆయన విడుదల కాలేదు. తన విడుదల కోసం చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసిన విడుదల కాలేకపోయారు. కోర్టుల్లో చంద్రబాబుకు వరుస ఎదురుదెబ్బలే తగిలాయి. మొదట ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 24 వరకు రిమాండ్ విధించింది. అది ముగిసిన తర్వాత నేటి వరకు రిమాండ్ పొడిగించింది. శుక్రవారం.. మరోసారి రెండు వారాల రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 19 వరకు ఆయన జైలులోనే ఉండాల్సి ఉంది. మరోవైపు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీ సీఐడీ తరఫు న్యాయవాదులు మాత్రం చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని, కస్టడీకి అప్పగించాలని కోరారు. సీఐడీ వాదనలపై చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఇప్పటికే ఒకసారి కస్టడీకి అప్పగించారని, ఆ వివరాలను ఇంకా వెల్లడించలేదని, కేసులో చంద్రబాబు పాత్రపై ఏమీ తేల్చలేకపోయారని, అందువల్ల మరోసారి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. ఇదే సమయంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దూబే వాదించారు.