సైబరాబాద్ మొక్కను పీకేయండి.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్

వైసిపి మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు ఏసీబీ అధికారులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 05:15 PMLast Updated on: Mar 06, 2025 | 5:15 PM

Acb Officials Are Ready To Register A Case Against Former Ycp Minister Vidudhala Rajani

వైసిపి మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు ఏసీబీ అధికారులు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో పాటగా పల్నాడు జిల్లాలో ఆమె పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు.. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన పార్టీ కూడా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయంగా వైసిపి బలంగా ఉండటం.. వైసిపి అధిష్టానం వద్ద ఆమెకు మంచి వెయిట్ ఉండటంతో ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాటగా నియోజకవర్గంలో నడిచింది అనే వ్యాఖ్యలు వినిపించాయి.

ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న గ్రానైట్ వ్యాపారులు, స్టోన్ క్రషర్ వ్యాపారులను ఆమె ఎక్కువగా ఇబ్బందులకు గురి చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై పలు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ముఖ్యంగా ఒక స్టోన్ క్రషర్ యజమానిని ఆమె బెదిరించి ఐదు కోట్లు డిమాండ్ చేశారని, ఆ తర్వాత రెండున్నరకోట్లకు సెటిల్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై స్టోన్ క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై ఏసీబీ అధికారులు కూడా ఫిర్యాదు అందుకుని విచారణ మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రాథమిక సాక్షాలను కూడా ఈ విషయంలో సేకరించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉండటంతో ఏసీబీ అధికారులు కూడా దూకుడు పెంచుతున్నారు. మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి లేకపోతే అనవసరంగా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే లీగల్ గా ఏ సమస్యలు లేకుండా ఉండేందుకు గవర్నర్ అనుమతి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఒక లేఖను సిద్ధం చేసి పంపారు. అందులో ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన ఆధారాలను కూడా పొందుపరిచి గవర్నర్ వద్దకు పంపించారు. గవర్నర్ అనుమతి వచ్చిన వెంటనే ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక విడుదల రజనీని కచ్చితంగా అరెస్టు చేయవచ్చు అనే సంకేతాలు బయటకు రావడంతో వైసీపీ అధిష్టానం కూడా ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు గట్టిగానే మాట్లాడిన రజిని ఈమధ్య మళ్ళీ సైలెంట్ అయ్యారు. రెండు వారాల క్రితం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేసేందుకు సిద్ధం కావడంతో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఆమె మరిదిపై కూడా కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే అప్పట్లో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారుల కు సంబంధించిన సాక్షాలను కూడా అధికారులు సేకరించారు.