Actress Gautami: బీజేపీకి గుడ్‌బై చెప్పిన నటి గౌతమి.. కారణం ఏంటంటే..
ట్విట్టర్‌లో సుదీర్ఘ లేఖను గౌతమి పోస్ట్ చేశారు. గౌతమి నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఆస్తులను స్వాహా చేసిన అళగప్పన్ అనే వ్యక్తికి.. పార్టీలోని సీనియర్ సభ్యులు పూర్తి మద్దతు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Actress Gautami: సీనియర్ సినీ నటి గౌతమి.. బీజేపీకి రాజీనామా చేశారు. 25 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్న ఆమె.. ఆ పార్టీతో బంధాన్ని తెంచుకున్నారు. బీజేపీ సీనియర్లపై గౌతమి సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి తనకు మద్దతు కరువైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ట్విట్టర్‌లో సుదీర్ఘ లేఖను గౌతమి పోస్ట్ చేశారు. గౌతమి నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఆస్తులను స్వాహా చేసిన అళగప్పన్ అనే వ్యక్తికి.. పార్టీలోని సీనియర్ సభ్యులు పూర్తి మద్దతు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను గత 25 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నానని.. పూర్తి నిబద్ధతతో పనిచేశానని గౌతమి గుర్తు చేశారు. 20ఏళ్ల కిందట అళగప్పన్ తనకు పరిచయమయ్యాడని.. అతడిని నమ్మి తన ఆస్తుల నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్టు వివరించారు. భూముల విక్రయ బాధ్యతలను అప్పగిస్తే.. తనను మోసం చేసినట్టు ఇటీవలే గుర్తించినట్టు చెప్పారు. అతడి కుటుంబంలో భాగమైన తనను, తన కుమార్తెను స్వాగతిస్తున్నట్టు నటిస్తూనే నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజపాళయం నుంచి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి.. చివరి నిమిషంలో తనకు మొండిచెయ్యి చూపించారని గౌతమి వివరించారు. తాను ప్రతి సందర్భంలోనూ పార్టీ పట్ల నిబద్ధతను నిలబెట్టుకున్నానని.. 25ఏళ్ల పాటు సేవ చేసినా తనకు మాత్రం మద్దతు కరువైంది అన్నారు.
అందుకే తీవ్ర నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గౌతమి తెలిపారు. అళగప్పన్ మోసంపై న్యాయ పోరాటం చేస్తానని.. ముఖ్యమంత్రి స్టాలిన్, పోలీసు, న్యాయవ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్పారు. విశాఖపట్నంలో చదువుకుంటూ సినిమాల్లో ప్రవేశించిన గౌతమి.. తన నటనతో అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో పలు పాత్రలతో మరోసారి తన నటనా ప్రతిభను చూపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.