Mamata Banerjee: రాష్ట్రపతి విందుకు మమత హాజరు.. మండిపడ్డ కాంగ్రెస్.. ఘాటుగా బదులిచ్చిన టీఎంసీ..
మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. "జీ20 సదస్సులో భాగంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మమత హాజరుకాకపోయుంటే ఆకాశమేమీ ఊడి పడేది కాదుగా. ఆమె ఈ విందులో పాల్గొనేందుకు ఇంకేదైనా కారణం ఉందా..?" అంటూ చౌదరి ప్రశ్నించారు.

Mamata Banerjee: బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టినప్పటికీ ఇండియా కూటమిలోని పార్టీల వైఖరి అప్పుడప్పుడూ వివాదాస్పదంగా ఉంటుంది. కూటమికి వ్యతిరేకంగా కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారు. గతంలో మోదీ పాల్గొన్న ఒక సభకు ఎన్సీపీ నేత శరద్ పవార్ హాజరుకాగా.. తాజాగా జీ20 సదస్సులో భాగంగా శనివారం, ఢిల్లీలో రాష్ట్రపతి ఇచ్చిన విందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
విదేశీ అతిథులకు రాష్ట్రపతి ఇచ్చిన విందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ప్రముఖులకు ఆహ్వానం అందింది. అయితే, ఇండియా కూటమిలోని ముఖ్యమంత్రులు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించి, విందుకు హాజరుకాలేదు. కానీ, టీఎంసీ అధినేత్రి, ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం విందులో పాల్గొన్నారు. పైగా ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పక్కనే కూర్చున్నారు. అందులోనూ విందుకు ఒకరోజు ముందుగానే ఢిల్లీ వెళ్లారు. ఈ అంశంపైనే విపక్ష కూటమిలో కీలక పార్టీ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. “జీ20 సదస్సులో భాగంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మమత హాజరుకాకపోయుంటే ఆకాశమేమీ ఊడి పడేది కాదుగా. ఆమె ఈ విందులో పాల్గొనేందుకు ఇంకేదైనా కారణం ఉందా..?” అంటూ చౌదరి ప్రశ్నించారు. అయితే, కాంగ్రెస్ విమర్శలపై టీఎంసీ స్పందించింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ శంతనుసేన్ కాంగ్రెస్ విమర్శల్ని తిప్పికొట్టారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ ఎప్పుడు, ఎక్కడికి ప్రయాణించాలన్నది కాంగ్రెస్ నేతలు నిర్ణయించలేరని విమర్శించారు. రాష్ట్రపతి విందుకు మమత హాజరుకావడం ప్రొటోకాల్ ప్రకారమే జరిగిందన్నారు.
ఇండియా కూటమిలో మమతా బెనర్జీ పాత్ర ఏంటో అందరికీ తెలుసని, ఆమె నిబద్ధత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఎంపీ శంతనుసేన్ అభిప్రాయపడ్డారు. ఈ విందుకు మమతతోపాటు ప్రతిపక్ష కూటమిలోని బిహార్ సీఎం నితీష్ కుమార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హాజరయ్యారు. అయితే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాగెల్ హాజరుకాలేదు.