Nitish Kumar: బిహార్‌పై కన్నేసిన బీజేపీ.. జేడీయూను చీలుస్తారా..? మరో మహారాష్ట్ర అవుతుందా..?
మహారాష్ట్రలో గత ఏడాది శివసేను చీల్చి, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఎన్సీపీని చీల్చి, తిరుగుబాటు నేత అజిత్ పవార్‌ను డిప్యూటీ సీఎంను చేసింది. ఇదే తరహా ప్లాన్‌ను ఇప్పుడు బిహార్‌లోనూ అమలు చేస్తోందని విశ్లేషకుల అంచనా.
Nitish Kumar: మహారాష్ట్రలో రెండు పార్టీలను దెబ్బతీసి, అధికారం దక్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు బిహార్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. బిహార్‌లో అధికార జేడీ (యూ)ను చీల్చే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ దిశగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. బిహార్, ఉత్తర ప్రదేశ్‌లలో పార్టీలో చీలికలు రావొచ్చని బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అంటున్నారు. తాజా పరిస్థితులను చూస్తుంటే ఇది నిజమే అనిపించకమానదు. ఉత్తరాదిని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతోంది.
మహారాష్ట్రలో గత ఏడాది శివసేను చీల్చి, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన ఎన్సీపీని చీల్చి, తిరుగుబాటు నేత అజిత్ పవార్‌ను డిప్యూటీ సీఎంను చేసింది. ఇలా మహారాష్ట్రలో రెండు కీలక పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలను చీల్చి.. తమకు ప్రత్యర్థి పార్టీలు లేకుండా ప్లాన్ చేసింది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-శివసేన (షిండే వర్గం)-ఎన్సీపీ కలిసే ఉంటాయి. కాబట్టి, అక్కడ గెలుపు సులభమని బీజేపీ భావిస్తోంది. ఇదే తరహా ప్లాన్‌ను ఇప్పుడు బిహార్‌లోనూ అమలు చేస్తోందని విశ్లేషకుల అంచనా. త్వరలో ఉత్తర ప్రదేశ్‌లోని మరో పార్టీని కూడా చీల్చబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు బిహార్ వంతు
మహారాష్ట్రలో టాస్క్ పూర్తి కావడంతో బీజేపీ దృష్టి ఇప్పుడు బిహార్‌పై పడింది. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా నిలబడ్డ పార్టీల్లో జేడీ (యూ) ఒకటి. ఈ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒక దశలో మోదీకి ప్రత్యామ్నాయంగా కూడా కనిపించారు. మరోవైపు ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలను సహించలేని బీజేపీ ఇప్పుడు జేడీ(యూ)ను చీల్చబోతుంది. నిజానికి ఈ ప్రయత్నాల్ని బీజేపీ గతంలోనే ప్రారంభించింది. అప్పట్లో బీజేపీ-జేడీయూ కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, బీజేపీ కుట్రలను ముందుగానే పసిగట్టిన నితీష్ కుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీష్‌కు బీజేపీ షాకివ్వాలనుకుంటే.. బీజేపీకే నితీష్ షాకిచ్చారు. అయినప్పటికీ బీజేపీ తన ప్రయత్నాలు మానలేదు. తెరవెనుక చేయాల్సిందంతా చేస్తూనే వచ్చింది.
జేడీయూపై తిరుగుబాటు
నెమ్మదినెమ్మదిగా జేడీయూ బలాన్ని బీజేపీ తగ్గిస్తూ వస్తోంది. నితీష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఉపేంద్ర కుష్వాహా జేడీయూ నుంచి బయటకు వచ్చి, సొంత పార్టీ పెట్టుకున్నాడు. అలాగే జితిన్‌రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ కూడా నితీష్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లోపు వీళ్లంతా బీజేపీలో చేరే అవకాశాలున్నాయని అంచనా. వీళ్లంతా బీజేపీలో చేరితే ఆ పార్టీ బలపడుతుంది. మరోవైపు అక్కడ నితీష్ ఇమేజ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. మోదీ ఇమేజ్ పెరుగుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో జేడీయూకు చెందిన చాలా మంది నేతలు బీజేపీలోకి చేరే అవకాశాలున్నాయి. జేడీయూ త్వరలోనే చీలబోతుందంటూ బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే జరిగితే నితీష్ కుమార్‌కు ఎదురుదెబ్బ తప్పదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు ఎదురైన పరిస్థితులే నితీష్‌కూ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అయితే, ఈ విషయంలో నితీష్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు బీజేపీ తన ప్రయత్నాలు తాను చేస్తుంటే.. ఇటు నితీష్ కూడా దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రాజకీయ క్రీడలో ఎవరు.. ఎవరిపై పైచేయి సాధిస్తారో చూడాలి.