Owaisi: కేసీఆర్‌కు ఒవైసీ దూరమవుతున్నారా? ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకమా?
రోజులెప్పుడు ఒకటేలాగా ఉండవు.. కేసీఆర్‌కు ఈ విషయం తెలియనది కాదు..! తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది గులాబీ పార్టీ. తన నీడకు తోడుగా ఎల్లప్పుడూ వెన్నంటే ఉండే ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముక్కి మూలిగి మేయర్ పీఠం దక్కించుకుంది బీఆర్‌ఎస్. అది కూడా ఎంఐఎం మద్దతుతో..! బీఆర్‌ఎస్‌కు పీకల వరకు మునిగిపోయే ఆపదైతే ఇప్పటివరకు రాలేదు కానీ.. ఒకవేళ వస్తే.. కేసీఆర్‌ను ఒడ్డుకు చేర్చే పార్టీల్లో ఎంఐఎం(MIM) అందరికంటే ముందుంటుంది. అలాంటి స్నేహానికి ఎండ్‌కార్డ్ పడనుందా అంటే అసదుద్దీన్ ఒవైసీ మాటలు చూస్తే మాత్రం అవునానే సమాధానమే వినిపిస్తోంది. ఏదో విమర్శించాలి కాబట్టి పుష్కరానికి ఓసారీ బీఆర్‌ఎస్ పార్టీపై కౌంటర్లు వేసే మజ్లిస్ అధ్యక్షుడు..ఈసారి ఘాటుగా వ్యాఖ్యలు చేయడం గులాబీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇంతకీ ఒవైసీ ఏమన్నారు..? కేసీఆర్‌ని ఇంతలా ఆయన ఎందుకు టార్గెట్ చేశారు..?
ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చేతిలోనే బీఆర్‌ఎస్ స్టీరింగ్ ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తనదైన స్టైల్‌లో తిప్పికొట్టారు. తన చేతిలోనే స్టీరింగ్ ఉంటే సెక్రటేరియట్‌ను తాజ్‌మహల్ లాగా నిర్మించేవాడినని.. గుజరాత్‌ని ఓ హనుమాన్ మందిరం నమూనా ఆధారంగానే కొత్త సెక్రటేరియట్ నిర్మించేవాడిని కాదంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యల హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి బీఆర్‌ఎస్‌ను ముస్లిం పక్షపాతిగానే తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఎంఐఎం పోటి చేయని చోట్లా అక్కడి ముస్లింలు కేసీఆర్ పార్టీకే ఓటేస్తారు..వాళ్లిద్దరీ అండర్‌స్టాండింగ్ అలా ఉంటుంది. అయితే ఆదిలాబాద్ సభలో మాత్రం ఒవైసీ బీఆర్‌ఎస్ ముస్లింలను పట్టించుకునే పార్టీ కాదని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
మసీదు కూల్చిన చోట కొత్తది నిర్మించలేదు కానీ.. సెక్రటేరియట్‌ను పూర్తి చేశారంటూ ఫైర్ అయ్యారు ఒవైసీ. గచ్చిబౌలీలో ఇస్లామిక్ సెంటర్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు కానీ.. బ్రాహ్మణ్ సదన్ ప్రారంభానికి ఏర్పాట్లు కంప్లీట్ చేశారంటూ మండిపడ్డారు. బ్రాహ్మణ్ సదన్ ప్రారంభోత్సవానికి సౌత్ ఇండియాలోని అన్ని ప్రముఖ మఠాధిపతులను ఆహ్వానించారని.. రూ.2,500 కోట్ల నిధులు తెలంగాణలో మందిరాల కోసం ఖర్చు చేశారన్నారు..అదే సమయంలో ముస్లింల కోసం ఒక్క రూపాయ కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని తీవ్ర ఆరోపణలు చేశారు ఒవైసీ.
ఒవైసీ ఇలా ఎందుకు మాట్లాడారన్నదానిపై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రాంతీయ పార్టీల కూటమితో బీజేపీ, కాంగ్రెస్‌ను ఢీ కొట్టాలని భావిస్తుండగా.. హస్తం పార్టీ సపోర్టు లేకుండా అది సాధ్యం కాదన్నది విశ్లేషకుల మాట! ఇదే విషయాన్ని ఇప్పటికే మమతబెనర్జీ లాంటి నేతలు అంగీకరించారు కూడా. కేసీఆర్ మాత్రం మొండి పట్టు వదలడంలేదు. కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తే అది రాష్ట్ర ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది.
అటు కాంగ్రెస్ ఇటివలే కర్ణాటక ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చింది. జోడోయాత్ర తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులో కేసీఆర్ కాంగ్రెస్ లేకుండా వెళ్తానంటే ప్రాంతీయ పార్టీలు ఆయన్నే పక్కనపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ విషయం ఒవైసీకి తెలుసు.. దేశ నేతలు ఒక్కొక్కరిగా బీఆర్‌ఎస్‌కు దూరం జరుగుతూ వస్తున్నారు.. అటు కాంగ్రెస్ కూడా తెలంగాణలో పుంజుకుంటుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్‌ఎస్‌తో కలిసి ఉండడం కంటే కాంగ్రెస్‌తో కలిసి ఉంటేనే ఎంఐఎంకు మేలు. అందుకే బీఆర్‌ఎస్‌పై ఎన్నడూ లేని విధంగా ఒవైసీ ముస్లిం వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులకు హిందూ దేవతల పేర్లు ఉన్నాయంటూ..ముస్లింల అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేస్తుందో తెలియడం లేదంటూ ఒవైసీ నిప్పులు చెరగడం వెనుక కాంగ్రెస్ ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఖాతా తెరవని రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని ఒవైసీ భావిస్తున్నారు. దాని కోసం బద్ద శత్రువులైన కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలా జరగాలంటే ముందు కేసీఆర్‌కు దూరమవ్వాలి.. ఒకవేళ అదే జరిగితే గులాబీ పార్టీ పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అవుతుంది.