టీడీపీ ఆఫీస్ కు అక్కినేని నాగార్జున.. షాక్ అయిన ఎంపీలు
ఏదేమైనా టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ సినిమాలు చేయకపోయినా, ఏదో ఒక రూపంలో ఫేమస్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక వ్యవహారంలో మీడియాలో నానుతూనే ఉంటుంది.

ఏదేమైనా టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ సినిమాలు చేయకపోయినా, ఏదో ఒక రూపంలో ఫేమస్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక వ్యవహారంలో మీడియాలో నానుతూనే ఉంటుంది. అక్కినేని నాగార్జున మీడియాలో కనపడేందుకు ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. సినిమాల కంటే కూడా ఆయన ఇతర వ్యవహారాల్లో మీడియాలో నానడం గమనార్హం. సినిమా హీరోగా మానేసి ఇప్పుడు యాంకర్ గా మారిపోయిన నాగార్జున.. ఇక రాజకీయ నాయకులను తనకు దగ్గర చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు.
తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, అక్కడ కొంతమంది వ్యక్తులతో భేటీ కావడం అన్ని సంచలనం అవుతూనే ఉన్నాయి. తాజాగా కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసినందుకు అక్కినేని నాగార్జున వెళ్లారు. తన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, అలాగే కోడలు శోభితతో కలిసి పార్లమెంటు భవనానికి వెళ్లిన ఆయన, ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే టీడీపీ ఆఫీసులోకి వెళ్లడం సంచలనం అవుతుంది. వాస్తవానికి టిడిపికి నాగార్జునకు పెద్దదూరమే ఉంది. అలాంటిది నాగార్జున డైరెక్ట్ గా టిడిపి ఆఫీస్ కి వెళ్లి ఎంపీలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఇక పలువురు టిడిపి ఎంపీలు నాగార్జునతో ఫోటో దిగేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. టిడిపి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అయితే ఏకంగా ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి వెళ్లి ఆయనతో కాసేపు ముచ్చటించారు. సడన్ గా నాగార్జున మోడీ వద్దకు వెళ్లడం ఏంటి అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగిపోయింది. గతంలో పలుమార్లు ప్రధానమంత్రిని ఆయన కలిసినా ఇప్పుడు కలవడం మాత్రం కాస్త స్పెషల్ గానే ఉంది.
ఏపీలో, తెలంగాణలో ప్రభుత్వాలు నాగార్జునకు అనుకూలంగా కనపడటం లేదు. రేవంత్ రెడ్డి మొన్నామధ్య హైడ్రాతో చుక్కలు చూపించారు. అలాంటిది ఇప్పుడు ఆయన కూటమికి దగ్గరయ్యే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. ఇటీవల టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పై నరేంద్ర మోడీ ప్రశంసలు కూడా కురిపించారు. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. దీనితో నాగార్జున ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా వెళ్లే ప్రధానమంత్రిని కలవడం వెనుక ప్రధాన కారణం అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంచ్ అని అంటున్నారు. అయితే టిడిపి ఎంపీలను ఎందుకు కలిశారు.. అనే దానిపై క్లారిటీ లేదు. అయితే వైసిపి బలహీన పడటంతో నాగార్జున జాగ్రత్త పడుతున్నారని, అందుకే వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను అలాగే టిడిపిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో తనకున్న వ్యాపారాలు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాజకీయంగా వైసిపి బలహీనంగా ఉండటంతో నాగార్జున కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడే సూచనలున్నాయి. ఇటీవల వైసీపీకి విజయసాయి కూడా రాజీనామా చేయడంతో నాగార్జున మరింత అలెర్ట్ అయినట్టు సమాచారం. భవిష్యత్తు గురించి ముందే జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది.