Top story: తెలంగాణ సర్వీసులకు అకున్ సభర్వాల్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకేనని ప్రచారం

తెలుగు రాష్ట్రాలను బ్యూరోక్రాట్ల సమస్య ఇబ్బంది పెడుతోంది. పాలన సజావుగా సాగాలంటే ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ ల అధికారులు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఏఐఎస్ అధికారులు తగినంత మంది లేరు. కొద్దీ రోజుల క్రితం రెండు రాష్ట్రాలకు జూనియర్లను కేటాయించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 13, 2024 | 06:19 PMLast Updated on: Oct 13, 2024 | 6:19 PM

Akun Sabharwal Is Campaigning For Telangana Services To Put An Iron Foot On Drugs

తెలుగు రాష్ట్రాలను బ్యూరోక్రాట్ల సమస్య ఇబ్బంది పెడుతోంది. పాలన సజావుగా సాగాలంటే ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ ల అధికారులు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఏఐఎస్ అధికారులు తగినంత మంది లేరు. కొద్దీ రోజుల క్రితం రెండు రాష్ట్రాలకు జూనియర్లను కేటాయించింది. వీరికి పాలనలో అనుభవం లేకపోవడం, భారీగా పోస్టులు ఖాళీగా ఉండటంతో వివిధ శాఖల్లో పనులు పెండింగ్ లోనే ఉంటున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఏఐఎస్ అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన అధికారులు…అక్కడ వెళ్లకుండా తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తెలంగాణ పని చేస్తున్న 11 మంది ఏఐఎస్ అధికారులను ఏపీలో రిపోర్ట్ చేయాలని ఇటీవల డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి, విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతి, ఐపీఎస్ లు అంజనీకుమార్, అభిలాష్ బిస్టా, అభిషేక్ మహంతిలు ఏపీలో చేరాలని ఆదేశించింది. అలాగే ఏపీలో పని చేస్తున్న అధికారులను…తెలంగాణలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

స్మితా సభర్వాల్ భర్త, సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ తెలంగాణ సర్వీసులకు రానున్నారు. తెలంగాణ కేడర్ కు చెందిన అకున్ సభర్వాల్….బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర సర్వీసులకు వెళ్లారు. 2023లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు డిప్యూటేషన్ పై వెళ్లారు. ఇండో టిబెటన్ బోర్డర్ ఆఫ్ పోలీస్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్కడి నుంచి రిలీవ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ అధికారుల సమస్య ఉండటంతో ఆయన్ను సొంత రాష్ట్రానికి పంపింది. అకున్ సభర్వాల్ ను తెలంగాణకు పంపుతూ…కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రీ మేచుర్ రీపాట్రియేషన్ ద్వారా తెలంగాణకు పంపింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అకున్ సభర్వాల్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో…ఎక్సైజ్ కమిషనర్ గా పని చేశారు. ఆ తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా పని చేశారు. 2023లో కేంద్ర హోం శాఖకు డిప్యూటేషన్ పై వెళ్లారు. గత ప్రభుత్వంలో అకున్ భార్య స్మితా సభర్వాల్ సీఎంవోలో చక్రం తిప్పారు. కీలకమైన శాఖలను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక సంఘం కార్యదర్శిగా పని చేస్తున్నారు.

అకున్ సభర్వాల్ ను తిరిగి తెలంగాణకు తీసుకురావడం వెనుక పెద్ద వ్యూహామే ఉన్నట్లే తెలుస్తోంది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇప్పటికే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ ను మరింత అణచివేయాలంటే అనుభవం, గతంలో డ్రగ్స్ కేసును డీల్ చేసిన అకున్ సభర్వాల్ అయితే బాగుటుందనే నిర్ణయానికి వచ్చారు రేవంత్ రెడ్డి. ఇటీవల హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో తన ప్రతిపాదనను పెట్టినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రపోజల్ కు అంగీకరించిన కేంద్రం…అకున్ సభర్వాల్ ను సొంత కేడర్ కు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది.