Etcherla Politics: ఎచ్చెర్లలో ఏం నడుస్తోంది.. ఎచ్చెర్లలో ఉప్పు, నిప్పు ఒక్కటయ్యాయా?

నిన్నటి దాకా బావా బావా పన్నీరు.. అన్నట్టుగా ఉన్న రాజకీయం.. ఇప్పుడు ప్రేమలు పెరిగిపోయి, ఆప్యాయతల్లో మునిగిపోతూ.. బతగ్గోరేవాడే బామ్మర్ది అన్నట్టుగా మారిపోయిందట. అయినా సరే ఆ సీన్‌ని స్థానిక వైసీపీ నాయకులు పూర్తిగా నమ్మలేకపోతున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 02:10 PMLast Updated on: Dec 02, 2023 | 2:10 PM

All Is Ok In Etcherla Assembly Constituency Between Ysrcp Leaders

Etcherla Politics: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఉప్పు, నిప్పు ఒక్కటయ్యాయా? ఆ ఎమ్మెల్యే మాకొద్దంటూ నిరసన ర్యాలీలు తీసిన వారంతా.. ఇప్పుడు ఒద్దికగా ఒకే ఫ్రేమ్‌లో ఇమిడిపోయారా? ఆ కలయిక శాశ్వతమా లేక అవసరాన్ని బట్టి మళ్ళీ మారిపోతుందా ? అక్కడ బావాబామ్మర్దుల మధ్య ఉన్న గొడవేంటి? నిన్నటిదాకా ఎందుకు కారాలు మిరియాలు నూరుకున్నారు? ఇప్పుడెందుకు పన్నీరు చల్లుకుంటున్నారు? శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో ట్విస్ట్‌లు పెరుగుతున్నాయి. నిన్నటి దాకా బావా బావా పన్నీరు.. అన్నట్టుగా ఉన్న రాజకీయం.. ఇప్పుడు ప్రేమలు పెరిగిపోయి, ఆప్యాయతల్లో మునిగిపోతూ.. బతగ్గోరేవాడే బామ్మర్ది అన్నట్టుగా మారిపోయిందట. అయినా సరే ఆ సీన్‌ని స్థానిక వైసీపీ నాయకులు పూర్తిగా నమ్మలేకపోతున్నారట.

RGV VYOOHAM: ఆర్జీవీకి సినిమా కష్టాలు.. వ్యూహం రివర్స్‌.. వాళ్ల విషయంలో వర్మ ఫెయిల్ అయ్యాడా..

కలయా? నిజమా? ఇది శాశ్వతమా? అన్న డౌటానుమానాలు అలాగే ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు మీద వైసీపీ తరపున గెలిచారు గొర్లె కిరణ్ కుమార్. పార్టీ వేవ్‌తోపాటు టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు కూడా ఆయన కలిసొచ్చాయన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ.. ఎమ్మెల్యేగా గెలిచాక కిరణ్‌కుమార్‌ పూర్తిగా మారిపోయారని, కొద్ది మందికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పలువురు నేతలు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. కిరణ్ వద్దు జగన్ ముద్దంటూ ర్యాలీలు సైతం తీశారు. ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం మండలాల్లో చెప్పుకోదగ్గ స్దాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగిన నలుగురు నాయకులు బాహాటంగానే ఎమ్మెల్యే తీరును వ్యతిరేకించారు. వీరికి కిరణ్‌కుమార్‌ సొంత బావమరిది పిన్నింటి సాయి అండదండలు ఉన్నాయన్నది లోకల్‌ టాక్‌. బావ మీద కోపంతో సాయి పార్టీ వ్యవహారాలతో కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా ఉంది. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించిన సాయిని.. ఆ తర్వాత దూరం పెట్టారట ఎమ్మెల్యే కిరణ్. అప్పట్నుంచి బావా బామ్మర్దికి చెడిందంటున్నారు. ఆ తర్వాత సాయి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ అధిష్టానానికి ఫిర్యాదులు సైతం వెళ్ళాయట.

అసలు ఈ బావా బామ్మర్దులు మళ్ళీ కలుసుకుంటారా అన్నంతగా వ్యవహారం ముదిరిపోయిన తరుణంలో.. ఉప్పు, నిప్పులా ఉన్న నేతలిద్దర్నీ సామాజిక సాధికార బస్సు యాత్ర కలిపింది. పార్టీ అధిష్టానం వార్నింగో, లేక మరో కారణముందో తెలియదు కానీ.. పిన్నింటి సాయి, జనార్దన రెడ్డి లాంటి అసమ్మతి నేతలంతా బస్సు యాత్ర మీటింగ్‌లో పాల్గొన్నారు. యాత్రలో రెబెల్‌ లీడర్స్‌ అంతా చురుగ్గా పాల్గొనడం ఇప్పుడు ఎచ్చెర్ల వైసీపీలో హాట్‌ టాపిక్‌ అయింది. వివాదాలు ఇక సమసిపోయినట్టేనా? ఎలక్షన్‌ టైంలో అంతా కలిసి పార్టీ కోసం పనిచేస్తారా అన్న చర్చలు మొదలయ్యాయి. అయితే.. ఇల్లు అలకగానే పండగ కాదని, ఇక్కడే మరో అనుమానం కూడా ఉందంటున్నారు కొందరు నియోజకవర్గ నాయకులు. నిజంగానే నాయకులందరికీ మనసులు కలిశాయా లేక బలవంతంగా ఎవరైనా కలిపారా అన్న ప్రశ్నలు వస్తున్నాయట కొత్తగా. ఎందుకంటే.. నిన్నటిదాకా ఫైర్‌ ఫైర్స్‌ ద ఫైర్‌ అన్న నాయకులు ఉన్నట్టుండి ఒక్కసారిగా బస్సు యాత్ర పేరుతో మారిపోయారంటే నమ్మలేమంటున్నారట.

పైకి వాటేసుకుంటున్నా.. కడుపులో కత్తులు అలాగే ఉన్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. గతంలో అవసరాలు, అవకాశాలే నేతల మధ్య దూరం పెంచాయని, మరిప్పుడు ఆ అవసరాలన్నీ తీరాయా? లేదంటే వాటి కోసం మళ్ళీ కత్తులు దూసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. నిజంగానే నేతల మనసులు కలిస్తే మంచిదేగానీ.. వ్యవహారం నివురుగప్పినట్టుగా ఉంటే మాత్రం ఎన్నికల టైంలో మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.