Congress: కర్ణాటకలో సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే.. బీజేపీ తప్పులేంటి.. ఘోర ఓటమి తప్పదా ?
కర్ణాటక ఎన్నికలకు ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తోంది దేశమంతా ! మళ్లీ ఓడిపోతో ఉనికి కోల్పోతామన్న భయంతో ఓ పార్టీ చేస్తున్న పోరాటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకోవాలని మరో పార్టీ ఆరాటం.. కర్ణాటక రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయ్. కర్ణాటక ఎన్నికలు.. పక్క రాష్ట్రాల రాజకీయాలను, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయ్. అందుకే ఇప్పుడు దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తోంది.
ఐతే సర్వేలన్నీ చెప్తోంది ఒక్కటే.. అదే కర్ణాటకలో మళ్లీ అధికారం కాంగ్రెస్‌దే అని ! 35 ఏళ్లుగా కర్ణాటకలో ఏ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకోలేదు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగడం ఖాయం అని సర్వేలు చెప్తున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాలకు పైగా సాధించి.. కాంగ్రెస్ అధికారం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి.
కాంగ్రెస్‌కు 105 నుంచి 117 స్థానాలు.. బీజేపీకి 81 నుంచి 93.. జేడీఎస్ 24 నుంచి 29 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. నంబర్ కాస్త అటు ఇటుగా.. అన్ని సర్వేలు చెప్తోంది అదే ! ఈసారి ఎన్నికల్లో మత రాజకీయాలు పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు అని సర్వేలు చెప్తున్నాయి. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చింది. దాన్ని ఆయుధంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నా.. కోస్తా కర్ణాటకలో మినహా.. పెద్దగా ఎక్కడా ఈ అంశం ప్రభావం చూపించే అవకాశం లేదు అనే అంచనాలు వినిపిస్తున్నాయి.
లెక్కలు, అంచనాలు.. జనాల అభిప్రాయాలు ఎలా చూసినా.. కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీకి ఘోర పరాభవం తప్పేలా లేదు. బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు.. అనుసరించిన విధానాలు.. చిన్న చిన్న తప్పులే.. బీజేపీ ఘోర ఓటమికి కారణం కాబోతున్నాయనే చర్చ జరుగుతోంది. ధరల పెరుగుదల.. ఈ ఎన్నికల్లో భారీగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో.. నిరుద్యోగులంతా బీజేపీ మీద గుర్రుగా ఉన్నారు.
ఇక బీజేపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి హద్దే లేకుండా పోయింది. కేబినెట్‌లో మెజారిటీ మంత్రులపై ఆరోపణలు వినిపించాయ్. ఇంత జరిగినా.. బీజేపీ నుంచి చర్యలు కనిపించలేదు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రధానంగా అందుకుంది. ఆయుధంగా మార్చుకొని.. బీజేపీ మీద అస్త్రాలు సంధిస్తోంది. అవినీతి వ్యవహారం.. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ ఓటమికి ప్రధాన కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతుల్లో బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పంటకు కనీస మద్దతు ధర, పంట నష్టం పరిహారం అంశాలపై ప్రభుత్వ పనితీరుపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్లంతా కాంగ్రెస్, జేడీఎస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో తిరుగుబాటు వ్యవహారం కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికలకు ముందు చాలామంది నేతలు.. కమలంతో కటీఫ్ చెప్పేశారు. ఈ అంశాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్‌కు ఆయుధంగా మారుతున్నాయి. బీజేపీ చేసిన తప్పులే.. కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నాయ్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఇవే అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావించింది. మేనిఫెస్టో కూడా దాదాపుగా ఈ అంశాల చుట్టే సిద్ధం చేసింది. ఓవరాల్‌గా.. కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోవడం బీజేపీకి అంత ఈజీగా కనిపించడంలేదు. ఎన్నికలకు దాదాపు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇలాంటి పరిణామాల మధ్య.. బీజేపీకి ఘోర పరాభవం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.