Pawan Kalyan: పార్టీపై ఫుల్ ఫోకస్ చేసిన పవన్.. నియోజకవర్గాలకు ఇంఛార్జిల నియామకం
తాజాగా మూడు నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించారు. రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును ఇంఛార్జిలుగా నియమించారు.
Pawan Kalyan: జనసేన ఎంతగా జనాల్లోకి వెళ్తున్నా ఆ పార్టీకి ఉన్న పెద్దలోపం.. నియోజకవర్గ స్థాయిలో ఇంఛార్జిలను నియమించకపోవడం. పనవ్ ఏ నియోజకవర్గంలో సభ నిర్వహించినా ఒక్కరే కనిపిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఇంఛార్జికి పెద్దగా ప్రాధాన్యం ఉండటం లేదు. గతంలో కొందరిని నియమించినప్పటికీ వారు పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. కొన్ని చోట్ల మాత్రమే నేతలు బలంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ అంశంపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా మూడు నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించారు. రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ, పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును ఇంఛార్జిలుగా నియమించారు. టీవీ రామారావు గతంలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరికి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నియామక పత్రాలను పవన్ అందించారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి జనసేన టిక్కెట్ దాదాపు వీరికే ఖాయం అయినట్లు భావించాలి. ఇటీవలే జనసేనలో చేరిన నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి (కార్యక్రమాల నిర్వహణ కమిటీ)గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మొదలైన చేరికలు
జనసేన ఆవిర్భవించి దాదాపు తొమ్మిదేళ్లు అవుతున్నా ఏపీలోని కీలక నేతలు ఎవరూ పెద్దగా పార్టీలో చేరలేదు. అంతకుముందు పార్టీలో చేరిన కొద్ది మంది నేతలు కూడా తర్వాత పార్టీని వీడారు. అయితే, ఇప్పుడు జనసేనకు వస్తున్న ఊపు చూసి చాలా మంది పార్టీలో చేరుతన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) జనసేన పార్టీలో చేరారు. శనివారం స్వాములు తన అనుచరులతో కలిసి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. విశాఖ జిల్లాకు చెందిన మరో నేత కూడా జనసేనలో చేరబోతున్నారు. ఇటీవలి కాలం వరకూ విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు త్వరలో జనసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రమేష్ బాబు స్వయంగా ప్రకటించారు. ఆయన గతవారమే వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ను కలిసిన రమేష్ బాబు పార్టీలో చేరికపై చర్చించారు. ఈ నెల 20న జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల రమేష్ బాబు ప్రకటించారు. మరికొద్ది మంది నేతలు కూడా త్వరలో జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. పార్టీలో నేతలకు ఇంఛార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తే నాయకులు ప్రజల్లోకి వెళ్తారు. పార్టీని జనంలోకి తీసుకెళ్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంశంపై పవన్ మరింతగా దృష్టిపెట్టి, ఇంఛార్జిలను నియమిస్తే జనసేన ఇంకా పుంజుకోవడం గ్యారెంటీ.