Amanchi Brothers: ఆమంచి బ్రదర్స్ అదిరోపోయే వ్యూహం…!
అన్న ఓ పార్టీలో... తమ్ముడు మరో పార్టీలో... ఇది కదా రాజకీయం అంటే... చీరాలలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో ఉంటే ఇప్పుడు ఆయన సోదరుడు జనసేన కండువా కప్పుకుంటున్నారు.
అన్న ఓ పార్టీలో… తమ్ముడు మరో పార్టీలో… ఇది కదా రాజకీయం అంటే… చీరాలలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో ఉంటే ఇప్పుడు ఆయన సోదరుడు జనసేన కండువా కప్పుకుంటున్నారు.
ఏపీలో ఇది ఎన్నికల నామ సంవత్సరం. సాధారణంగా ఈ సమయంలో పార్టీల్లో జంపింగ్‌లు కామనే. పార్టీ పొజిషన్, తమ సీటు, తమ శత్రువర్గం సంగతి ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని నేతలు పార్టీలు మారిపోతుంటారు. ఆ కోవలోదే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ సాములు జనసేన ఎంట్రీ. ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈ సమయంలో సాములు జనసేన తీర్థం పుచ్చుకోవడం ఆసక్తిగా మారింది.
ఆమంచి సాములు జనసేనలోకి రావడం వెనక పెద్ద వ్యహమే ఉన్నట్లు కనిపిస్తోంది. కృష్ణమోహన్ గతంలో రెండుసార్లు చీరాల ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నవోదయం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఆపై వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019లో ఆయన వైసీపీ తరపున పోటీచేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరామ్ చేతిలో 17వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కరణం వైసీపీలోకి చేరిపోయారు. దీంతో ఆమంచికి కష్టకాలం మొదలైంది. ఇరువర్గాల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. కొట్టుకున్నారు కూడా. చీరాలలో తన పట్టు తగ్గడాన్ని ఆమంచి తట్టుకోలేకపోయారు. ఇరువర్గాల మధ్య సయోధ్యకు హైకమాండ్ ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు ఆమంచిని పర్చూరుకు పంపింది. అయితే ఆమంచికి మాత్రం చీరాలను వదులుకోవడం ఇష్టం లేదు. తన నియోజకవర్గంలో కరణం బలరాం బలం పెంచుకోవడాన్ని ఆమంచి తట్టుకోలేకపోయారు. తన వర్గానికి ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు.
ఆమంచి కృష్ణమోహన్‌కు మొదటి నుంచి అండగా ఉన్నది ఆయన సోదరుడు సాములు. ఆమంచి గెలుపు వెనక సాములు వ్యూహాలున్నాయి. ఇప్పుడు తను చీరాలను వదిలేసినా తన పట్టుపోకుండా సాములును రంగంలోకి దించినట్లు భావిస్తున్నారు. సాములు జనసేన తరపున బరిలోకి దిగుతారు. చీరాలలో కాపు సామాజికవర్గం బలంగానే ఉంది. ప్రస్తుతం జనసేన బలం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో తమ వ్యక్తిగత పలుకుబడి, పవన్ క్రేజ్‌ను ఉపయోగించుకుని సాములును గెలిపించుకోవాలన్నది ఆమంచి కృష్ణమోహన్ వ్యూహంగా కనిపిస్తోంది. వైసీపీ హైకమాండ్ కూడా తననేం అనలేని పరిస్థితి కల్పించారు ఆమంచి. అదేమంటే మా ఇద్దరికీ సంబంధం లేదన్న రొటీన్ డైలాగ్‌ను నమ్మేలా చెబుతారు. సాములు చాలాకాలం క్రితమే జనసేనలో చేరతారని బావించారు. అప్పట్లో ఆయన పేరిట చీరాలలో పవన్ కల్యాణ్ ఫ్లెక్లీలు కూడా వెలిసాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ కూడా సాగింది. ఇప్పుడు అది నిజమైంది.
మరి చీరాలలో ఆమంచి బ్రదర్స్ వ్యూహాన్ని కరణం బలరామ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.